Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్కడ పాగా వేస్తేనే పంజాబ్ వశం!
చండీగఢ్ : పంజాబ్‌లోని మాల్వా ప్రాంతంపైనే అన్ని పార్టీలు దృష్టి పెట్టాయి. అత్యధిక అసెంబ్లీ స్థానాలున్న ఈ ప్రాంతంలో పాగా వేస్తే పంజాబ్ పీఠం దక్కించుకోవడం తేలికవుతుందనే భావనలో ఉన్నాయి. పంజాబ్ రాష్ట్రం మాల్వా, దౌబా, మఝా ప్రాంతాల సమాహారం. మొత్తం 117 అసెంబ్లీ స్థానాల్లో దౌబాలో 23, మఝాలో 25 అసెంబ్లీ సీట్లున్నాయి. భౌగోళికంగా, ఓటర్లపరంగా అతి పెద్ద ప్రాంతమైన మాల్వాలో 69 అసెంబ్లీ స్థానాలున్నాయి. అసెంబ్లీకి రాచమార్గంగా మారిన మాల్వాలో గెలిచేందుకు అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. తమకే ఓటు వేయాలంటూ కాంగ్రెస్, ఆప్, అకాలీదళ్, బిజెపి హామీల వర్షం కురిపిస్తున్నాయి.
గతంలో మాల్వాపై అకాలీదళ్‌లకు మంచి పట్టు ఉండేది. 2007లో ఇక్కడ ఆ పార్టీ 19 సీట్లతోనే సరిపెట్టుకున్నా, 2012లో బాగా పుంజుకుని 34 సీట్లు సాధించగలిగింది. 2017లో బిజెపి -అకాలీ కూటమి కేవలం 8 సీట్లకు పరిమితమై కోలుకోలేనంతగా దెబ్బతింది. కాంగ్రెస్ ఏకంగా 40 సీట్లు సాధించి అధికారాన్ని చేజిక్కించుకుంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలోకి తొలిసారిగా దిగిన ఆప్ ఇక్కడ 18 సీట్లు నెగ్గిసత్తా చాటింది.
హామీల వర్షం
మాల్వా బాగా వెనకబడ్డ ప్రాంతం. ముఖ్యంగా దక్షిణ మాల్వా సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా కూడా వెనకబడే ఉంది. పత్తిపంట అధికంగా పండే ఈ ప్రాంతం (కాటన్ బెల్ట్) రైతు ఆత్మహత్యలకు చిరునామాగానూ మారింది. ఇక రాష్ట్ర దళిత జనాభాలో 31 శాతం ఇక్కడే ఉన్నారు. క్యాన్సర్, తీవ్ర తాగునీటి కొరత ఈ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్నాయి. 2012 ఎన్నికల్లో అకాలీదళ్ ప్రకటించిన దాల్ - ఆటా పథకం తరహాలోనే హామీల వర్షం కురిపిస్తున్నాయి. ప్రతి ఇంటికీ ఉద్యోగం, ఇల్లు, నిర్వాసితులకు ఇంటి స్థలం, నెలవారీ పెన్షన్‌తో పాటు పంట నష్టపోయిన రైతులకు పరిహారం, ఆరోగ్య బీమా వంటి హామీలను కాంగ్రెస్ ప్రకటించింది. ఆప్, బిజెపి కూడా ఇదే తరహాలో హామీలిచ్చాయి. సబ్సిడీ రేషన్ పథకాన్ని ప్రకటించాయి.
కనిపించని డేరాల ప్రభావం
ఈ ప్రాంతంలో సున్నితమైన అంశంగా నిలిచే మత సెంటిమెంట్లు ఈసారి అంతగా ప్రభావం చూపకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తమ సమస్యలను తీరుస్తుందని నమ్మే పార్టీకే ఇక్కడి ప్రజలు పట్టం కడతారని పేర్కొంటున్నారు. డేరాల ప్రభావాన్నీ తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదని, 2007, 2012 ఎన్నికల్లో బాగా ప్రభావం చూపిన సచ్‌ఖండ్, డేరా సచ్చా సౌధా ఈసారీ ఓటర్లను ఎంతోకొంత ప్రభావితం చేయొచ్చని భావిస్తున్నారు.
ఈసారి సర్వేల మొగ్గు ఆప్కే!
మాల్వాలో ఈసారి ఆప్ హవా ఉండొచ్చని సర్వేలు చెబుతున్నాయి. కూటమి పార్టీల మధ్య విభేదాలు, మారిన సమీకరణాలతోపాటు ఆప్ ప్రవేశించడంతో ఈసారి రాష్ట్రంలో త్రిముఖ పోటీ ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆప్ పార్టీకి 28 నుంచి 30 సీట్లు దాకా రావచ్చని ఇటీవలి జీ ఒపీనియన్ పోల్ తేల్చింది. కాంగ్రెస్‌కు 19 నుంచి 21, అకాలీదళ్‌కు 14 రావచ్చని, బిజెపి 3 సీట్లకు పరిమితమవుతుందని తెలిపింది. దీంతో ఈ నెల 20న జరగనున్న పోలింగ్‌పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది.