Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యోగ జేెఏసీ నేతలతో ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి
- సమస్యలుంటే అనామలీస్, మంత్రుల కమిటీలకు చెప్పండి
అమరావతి : ప్రభుత్వం ఎప్పుడూ ఉద్యోగుల పక్షాన ఉంటుందని, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో అన్నీ చేయలేకపోయినా చేయగలిగినంత చేశామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అన్నారు. మీరు లేకపోతే నేను లేనని తనను కలిసిన ఉద్యోగ సంఘాల స్టీరింగ్ కమిటీ సభ్యులు, మంత్రుల కమిటీతో ముఖ్యమంత్రి ఆదివారం నాడన్నారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ ఏ సమస్య ఉన్నా ప్రభుత్వంతో చెప్పుకునేందుకు అవకాశం ఉందని, దీనికోసం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ, అనామలిస్ కమిటీ లందుబాటులో ఉంటాయని తెలిపారు. చర్చల సమయంలో మంత్రుల కమిటీ తనను సంప్రదించే నిర్ణయాలు తీసుకుందని అన్నారు. ఐఆర్‌ను సర్దుబాటు చేయడం ద్వారా రూ.5400 కోట్లు, హెచ్ఆర్ఏ వల్ల రూ.800 కోట్లు, అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వల్ల రూ.450 కోట్లు, సిసిఏ రూపంలో రూ.80 కోట్లు మొత్తం కలిపితే రూ.1330 కోట్లు అదనపు భారం అవుతుందని వివిరంచారు. మొత్తంగా రూ.11,577 కోట్లు ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం రికరింగ్భారం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. రూ.5725 కోట్లు పోస్ట్ రిటైర్మెంట్కు ఇస్తున్నామని వివరించారు. కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైం స్కేలు వర్తింపజేశామని, అంగన్వాడీలు, ఆశావర్కర్లు, హోంగార్డులు, శానిటేషన్ వర్కర్లు అందరికీ జీతాలు అన్ని రకాలుగా పెంచామని తెలిపారు. అవినీతి లేకుండా ప్రజలకు అన్నీ ఇవ్వగలుగుతున్నామంటే ఉద్యోగుల వల్లే అది సాధ్యమైందని తెలిపారు. సిపిఎస్మీద గట్టిగా పనిచేస్తున్నామని, దీనిపై కమిటీని వేశామని వివరాలు ఖరారైన తరువాత ఉద్యోగ సంఘాలతో కూర్చుని మాట్లాడుకుందామని చెప్పారు. ఎవరూ చేయని పనులు జగన్ చేశాడనే విధంగా అడుగులు ముందుకు వేస్తున్నామని తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉన్నామని, 30 వేలమంది టీచర్లకు ప్రమోషన్లు ఇస్తున్నామని, ఈ జూన్ నాటికి ఎస్జిటి నుండి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తున్నామని వివరించారు. ఉద్యోగులు చెప్పేవి వినడానికి ఈ ప్రభుత్వం ఎప్పుడూ సిద్దంగా ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అనుకున్నంత పిఆర్సి ఇవ్వలేకపోతున్నట్లు సిఎం తెలిపారని ఉద్యోగ సంఘాల నాయకులు బండి శ్రీనివాసరావు, సూర్యనారాయణ, వెంకట్రామిరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. స్టీరింగ్ కమిటీతో ప్రతినెలా భేటీ నిర్వహిస్తామని హామీనిచ్చినట్లు పేర్కొన్నారు. ఫిట్మెంట్ విషయంలో అంతకంటే అవకాశం లేదని, అందుకే ఇవ్వలేకపోయారని తెలిపారు. హెచ్ఆర్ఏ శ్లాబులు క్వాంటం, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్, సిపిఎస్ రద్దు అంశాలపై స్పష్టత ఇచ్చారని పేర్కొన్నారు. ఉన్నంతలో మెరుగైన ఫలితాన్ని సాధించామని తెలిపారు. రివర్స్ పిఆర్సికి తావులేకుండా చేసుకున్నామని పేర్కొన్నారు. మార్చిన హెచ్ఆర్ఏ వల్ల కొత్త పిఆర్సి ప్రకారం జీతాలు తగ్గవని అన్నారు. సిపిఎస్ రద్దు అంశంపై చర్చించి పరిష్కరిస్తామని సిఎం చెప్పారన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ సహృదయంతో అర్థం చేసుకోవాలని వారు కోరారు.