Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమస్యల సుడిగుండంలో సూక్ష్మ, చిన్నమధ్య తరహా పరిశ్రమలు
- ఎలాంటి ఊరటనివ్వని కేంద్ర బడ్జెట్
- ఆత్మనిర్భర్ భారత్‌తో ఫలితం శూన్యం..
- దేశ ఎగుమతుల్లో 50శాతం ఈరంగం నుంచే : ఆర్థిక నిపుణులు
- కొత్తగా ఏమైనా చేస్తారేమోనన్న ఆశలపై నీళ్లు
కోవిడ్ సంక్షోభం, నిరుద్యోగ సమస్య చుట్టుముట్టినవేళ కేంద్ర బడ్జెట్‌కు ఎనలేని ప్రాధాన్యత ఏర్పడింది. అధిక ధరలతో జేబు గుల్లవుతున్న పేదలు, మధ్య తరగతి ఎంతో ఆశించారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ(ఎంఎస్ఎంఈ)కు ప్రయోజనాలు ప్రకటిస్తారేమోనని ఎంతోమంది ఎదురుచూశారు. అలాంటిదేమీ జరగలేదు. కీలక నిర్ణయాలేవీ తీసుకోకుండానే బడ్జెట్ ప్రసంగాన్ని నిర్మలా సీతారామన్ ముగించారు. ఇప్పటివరకూ అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాల్నే మరింత వేగవంతం చేస్తామని బాహాటంగా ప్రకటించింది.
న్యూఢిల్లీ : కోవిడ్‌తో తీవ్రంగా దెబ్బతిన్న సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల కోసం కేంద్రం ఏదైనా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తుందేమోనని అందరూ ఎదురుచూశారు. ఆ ప్రస్తావన లేకపోవటం ఆర్థిక నిపుణుల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆర్థిక వ్యవస్థలో కొనుగోలు శక్తి పెంచే దిశగా ఈ బడ్జెట్ లేదని వారు అభిప్రాయపడ్డారు. నిర్మలా సీతారామన్ తన 90 నిమిషాల బడ్జెట్ ప్రసంగంలో, ''సమ్మిళిత అభివృద్ధి, ఇంధన పరివర్తన, పర్యావరణ మార్పు, ఉత్పత్తి పెంపు, పెట్టుబడులపై దృష్టి సారించాం. తద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు రాబోయే 25ఏండ్లు అమృత కాలమవుతుంది'' అని అన్నారు. బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి స్పష్టమైన గణాంకాలు విడుదల చేయలేదు. అయితే 'అమృత కాలం'లో ఫలాలు ఎవరికి దక్కుతాయనే ప్రశ్నలు నిపుణులు లేవనెత్తుతున్నారు. మన ఆర్థిక విధానాలు, ఆరోగ్య విధానాలు మారాలని కోవిడ్ సంక్షోభం నిరూపించింది. అయినా దీనిని ఒక గుణపాఠంగా పాలకులు భావించటం లేదనే సంగతి కేంద్ర బడ్జెట్ చూపుతోందని నిపుణులు ప్రస్తావించారు.
2020లో మొదలైన కోవిడ్ సంక్షోభం మనదేశాన్ని ఇంకా వీడలేదు. ఈ సంక్షోభ సమయంలో పేదలు, మధ్య తరగతిని ఆదుకునే చర్యలు ప్రకటించలేదు. 'ఆత్మనిర్భర్ భారత్' కింద కేంద్రం ప్రకటించిన ఆర్థీక ప్యాకేజీ ఎంత దారుణంగా విఫలమైందో అందరికీ తెలిసిందే. సూక్ష్మ, చిన్నమధ్య తరహా పరిశ్రమల అవసరాల్ని ఈ ప్యాకేజీ పూర్తిగా విస్మరించింది. ఇప్పుడు మళ్లీ కొత్తగా 'అమృత కాలం' అంటూ తియ్యటి మాటల్ని కేంద్రం వినిపిస్తోంది. 'అమృత కాలం' అనేదానిపై కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే..సూక్ష్మ, చిన్నమధ్య తరహా పరిశ్రమకు ఈ బడ్జెట్లో ప్రాధాన్యత దక్కేదని విమర్శకులు చెబుతున్నారు.
ఉపాధి కల్పించటంలో ఎంఎస్ఎంఈలే కీలకం
మనదేశంలో 6కోట్లకుపైగా సూక్ష్మ, చిన్నమధ్య తరహా పరిశ్రమ యూనిట్లు(ఎంఎస్ఎంఈ) ఉన్నాయని ఒక అంచనా. ఇందులో 36శాతం వాణిజ్యరంగంలో, 33శాతం సేవారంగంలో, 31శాతం తయారీరంగంలో ఉన్నాయి. దాదాపు 12కోట్లమందికి ఉపాధి చూపుతోంది. భారత ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. భారత జీడీపీలో సుమారుగా 30శాతం ఎంఎస్ఎంఈల నుంచే ఏర్పడుతోంది. భారతదేశ ఎగుమతుల్లో 50శాతం ఎంఎస్ఎంఈల నుంచే వస్తోంది. కేంద్ర ప్రభుత్వం లెక్క ప్రకారం 2016-17 నుంచి 2018-19 మధ్య ఎంఎస్ఎంఈ రంగం వృద్ధి 10శాతం దాటింది.
ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ రంగం కోవిడ్ తర్వాత తీవ్రంగా దెబ్బతిన్నది. ఊహించని, సంక్లిష్టమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. ఆదుకునే హస్తం కరువైంది. ప్రభుత్వం నుంచి నిరాదరణ ఎదురవుతోంది. ఈ రంగంలో 99శాతం యూనిట్లు సూక్ష్మ తరహావే ఉండటం గమనార్హం. చిన్న, మధ్య తరహా యూనిట్లు వరుసగా 0.52శాతం, 0.01శాతం మాత్రమే ఉన్నాయి. దీనినిబట్టి కేంద్రం తన పాలసీలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలన్నది ఇక్కడ స్పష్టంగా కనపడుతోంది. సమాజంలో ఆర్థిక, సామాజిక మార్పులు రావాలంటే ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్ని, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల్ని పాలకులు ప్రోత్సహించాలి. అయితే కేంద్ర బడ్జెట్లో అలాంటి చర్చే లేదు.
మూతపడుతున్న యూనిట్లు
మార్చి 2020లో మోడీ సర్కార్ దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించింది. ఈ నిర్ణయాన్ని ఏకపక్షంగా తీసు కుంది. దీని ప్రభావం ఏ విధంగా ఉంటుందన్న ఆలోచన చేయలేదు. ఫలితం..ఎంఎస్ఎంఈ రంగం దారుణంగా దెబ్బతిన్నది. కోట్లాది మంది ఉపాధి కోల్పోయారు. ఆదాయంలేక, రుణాలు రాక..అనేక యూనిట్లు మూతపడ్డాయి. కార్మికులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితి వచ్చింది. నలుగురు కార్మికులున్న చోట..ఒక్కరితో నడిపిస్తున్నారు. ఈరం గాన్ని ఒడ్డునపడేసే ఏర్పాట్లు కేంద్రం ప్రభుత్వం చేపట్టకపోవటం వల్ల.. ఎంఎస్ఎంఈ రంగం ఒడిదొడుకులకు లోనవుతోంది. మనుగడ కోసం 35శాతం యూనిట్లు ప్రయివేటుగా రుణాలు తీసుకున్నాయని ఒక సర్వే పేర్కొన్నది. ప్రభుత్వం నుంచి ఆర్థిక తోడ్పాటు, ఉద్దీ పన లేనందువల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు.