Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 0.15 శాతం మందికే ప్రమాద బీమా
- ఐటీఎఫ్-ఐఎఫ్ఏటీ అధ్యయనం
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ట్రాన్స్పోర్ట్, డెలివరీ సర్వీసుల్లో నిమగమై ఉన్న గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కరువైంది. దీంతో ఈ రంగంలో ఉండే కార్మికులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (ఐటీఎఫ్) భాగస్వామ్యంతో ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ (ఐఎఫ్ఏటీ) 'డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ఎకానమీలో కార్మికులను రక్షించడం' పేరుతో ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. ఈ అధ్యయనంలో గిగ్ వర్కర్లలో పెద్ద సంఖ్యలో సామాజిక భద్రత లేదని వెల్లడైంది. సర్వేలో పాల్గొన్న కార్మికులలో కేవలం 0.15 శాతం మంది మాత్రమే '' ప్రమాద బీమా'' ను కలిగి ఉండటం గమనార్హం. అలాగే, 2020 ఏడాదికి ఫెయిర్‌వర్క్ ఇండియా రేటింగ్‌లు, జొమాటో, స్విగ్గి వంటి ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్‌లను వాటి జాబితాలో అత్యంత దిగువన ఉంచాయి. గిగ్ వర్కర్లకు ఏ విధమైన సామాజిక భద్రత కల్పించకుండా చేతులు దులుపుకుంటున్న పరిస్థితులు ప్రస్తుత నయా ఉదారవాద కాలంలో కనిపిస్తున్నదని సామాజిక కార్యకర్తలు, పౌర సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. అలాంటి సంస్థలు లాభాలను గడిస్తూ కార్మికులను కష్టాల్లోకి నెట్టేస్తున్నాయని తెలిపారు.
లేబర్‌కోడ్‌లతో ప్రభావం
గతేడాది సెప్టెంబర్‌లో గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత ప్రయోజనాలను డిమాండ్ చేస్తూ ఐఎప్ఏటీ భారత సర్వోన్న న్యాయస్థానంలో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) వేసింది. ఈ పిటిషన్ విచారణకు అంగీకరించిన న్యాయస్థానం.. సామాజిక భద్రత గిగ్ కార్మికులతో సహా కార్మికుల హక్కు కాదా అని ప్రశ్నించింది. దీంతో గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత విషయంలో ఈ పిటిషన్ కీలకంగా మారింది. ఇక కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కూడా గిగ్ కార్మికులపై ప్రభావం చూపుతాయని కార్మిక సంఘాలు, కార్మిక హక్కుల నాయకులు ఆరోపించారు. ఈ నాలుగు కోడ్లు 29 కార్మిక చట్టాలను ఏకీకృతం చేయడానికి ప్రయత్నిస్తాయి. ఇందులో సామాజిక భద్రత కోడ్, 2020 (ఎస్ఎస్ కోడ్) కూడా ఉన్నది. ఇది అసంఘటిత కార్మికులకు వర్తించే కొన్ని చట్టాలలో ఒకటి. సామాజిక భద్రతను విశ్వవ్యాప్తం చేయాలని, హక్కుల ఆధారిత విధానాన్ని అవలంభించాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.