Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర విద్యా శాఖ నియామకం
- రైతు ఉద్యమ సమయంలో రైతు వ్యతిరేక కామెంట్లు
న్యూఢిల్లీ : జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) మొదటి మహిళా వైస్ ఛాన్సలర్‌గా శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ అత్యున్నత పదవిలో ఆమెను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దేశంలో జరిగిన చారిత్రాత్మక రైతు ఉద్యమం పట్ల ఆమె వ్యతిరేక కామెట్లు చేశారు. శాంతిశ్రీ ధూళిపూడి ప్రస్తుతం మహారాష్ట్రలోని సావిత్రీబాయి ఫూలే యూనివర్సిటీలో పాలిటిక్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. 59 ఏండ్ల పండిట్ కూడా జేఎన్‌యూ పూర్వ విద్యార్థి, అక్కడ ఆమె ఎంఫిల్, అంతర్జాతీయ సంబంధాలలో పీహెచ్డీ చేశారు.
''యూనివర్సిటీ విజిటర్ అయిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్‌ను జేఎన్‌యూ వైస్ ఛాన్సలర్‌గా నియామకానికి ఆమోదముద్ర వేశారు. ఆమె నియామకం ఐదేండ్ల కాల పరిమితితో ఉన్నది'' అని సీనియర్ విద్యా మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు. పండిట్ 1988లో గోవా విశ్వవిద్యాలయం నుంచి తన ఉపాధ్యాయ వృత్తిని ప్రారంభించి, 1993లో పూణే విశ్వ విద్యాలయానికి మారారు. ఆమె వివిధ విద్యా సంస్థల్లో పరిపాలనా హౌదాలో ఉన్నారు. ఆమె యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ (ఐసిఎస్ఎస్ఆర్) సభ్యురాలు, కేంద్రీయ విశ్వ విద్యాలయాలకు విజిటర్ నామినీగా కూడా ఉన్నారు.ఆమె కెరీర్లో 29 మంది పీహెచ్‌డీలకు మార్గదర్శకత్వం వహించారు. జేఎన్‌యూలో ఐదేండ్ల పదవీకాలం ముగిశాక.. తాత్కాలిక వీసీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎం. జగదీష్ కుమార్ గత వారం యూజీసీ చైర్మెన్‌గా నియమితులైన విషయం విదితమే. జేఎన్‌యూకి మొదటి మహిళా వైస్-ఛాన్సలర్‌గా నియమితులైన శాంతిశ్రీకి హృదయపూర్వక అభినందనలు.. నా ఆశీర్వాదం ఎల్లప్పుడు ఉంటుందనీ, నూతన బాధ్యతలతో మరింతగా రాణించాలని కోరుకుంటున్నా'' అని జగదీష్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.