Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలో ఆకలి సమస్యను రూపుమాపటానికి సహజంగా ఏ ప్రభుత్వమైనా ప్రాధాన్యత ఇస్తుంది. కానీ మోడీ సర్కార్ తాజా బడ్జెట్లో ఆహార సబ్సిడీకి నిధుల కేటాయింపు తగ్గించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద గత బడ్జెట్లో ఆహార సబ్సిడీ కోసం రూ.2,10,929కోట్లు కేటాయింపులు చేశారు. దానిని ఈ బడ్జెట్లో రూ.1,45,920కోట్లకు తగ్గించారు. రైట్ టు ఫుడ్ ప్రచారంలో ముఖ్యపాత్ర పోషిస్తున్న ఆర్థికవేత్త దీపా సిన్హా (అంబేద్కర్ వర్సిటీ) మాట్లాడుతూ..''కోవిడ్ సంక్షోభ సమయంలో మొదలుపెట్టిన 'పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన'కు కేంద్రం ముగింపు పలకాలని చూస్తోంది. దాదాపు 80కోట్ల ప్రజలు లబ్దిపొందే ఈ పథకాన్ని ఆపేయాలనుకుంది, కానీ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఉండటంతో వెనుకడుగు వేసింది. పథకం అమలును జనవరి నుంచి మార్చి వరకు పొడగించింది'' అని అన్నారు. పేదరిక నిర్మూలనపై ప్రభుత్వం వద్ద అధికారిక సమాచారమేదీ లేదు. కొన్ని ప్రయివేటు సంస్థలు..సీఎంఐఈ వంటివి విడుదల చేసే గణాంకాలు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటప్పుడు కేంద్రం ఉచిత రేషన్ సరుకుల పంపిణీ ఆపాలని ఎందుకు నిర్ణయించింది? అని దీపా సిన్హా ప్రశ్నించారు. ఈ బడ్జెట్లో ఆహార సబ్సిడీలో దాదాపు రూ.80వేల కోట్లు కోతలు విధించారని విశ్లేషకులు చెబుతున్నారు. గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం నిలిపేయడానికి దాదాపు రంగం సిద్ధమైందని బడ్జెట్ గణాంకాలు చెబుతున్నాయి.