Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యసభలో ప్రతిపక్షాలిచ్చిన నోటీసు తిరస్కరణ
- రాష్ట్రపతి ప్రసంగానికి ప్రతిపక్షాలు 172 సవరణలు
- లోక్సభలో 92, రాజ్యసభలో 80 సవరణలు
న్యూఢిల్లీ: పెగాసస్ స్నూపింగ్ వివాదంపై సవరణల కోసం ప్రతిపక్ష సభ్యులిచ్చిన నోటీసును రాజ్యసభ తిరస్కరించింది. ప్రతిపక్ష ఎంపీలు ఎలమారం కరీం (సీపీఐ(ఎం), కెసి వేణుగోపాల్ (కాంగ్రెస్) ఇచ్చిన నోటీసులను రాజ్యసభ సెక్రెటేరియట్ ఆమోదించలేదు. ఈ అంశం సబ్ జడ్జి అయినందున అంగీకరించలేదని ఆ వర్గాలు తెలిపాయి. కాగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రతిపక్ష ఎంపీలు సవరణలు ప్రవేశపెట్టారు. పార్లమెంట్ ఉభయ సభల్లో 172 సవరణలు ప్రవేశపెట్టారు. లోక్సభలో 92 సవరణలు చేయగా, రాజ్యసభలో 80 సవరణలు చేశారు. రాజ్యసభలో సవరణల ప్రతిపాదించిన 19 నోటీసులు సభ ముందుకు రాలేదనీ, వాటిని ప్రతిపాదించిన ముగ్గురు సభ్యులు మోషన్ను స్వీకరించినప్పుడు సభకు హాజరు కాలేదని రాజ్యసభ వర్గాలు తెలిపాయి. రాజ్యసభ సెక్రెటరీ జనరల్ కి 14 మంది ప్రతిపక్ష సభ్యులు 99 నోటీసులు అందజేశారు. తీర్మానం చర్చకు వచ్చినప్పుడు ముగ్గురు హాజరుకానందున, ధన్యవాద తీర్మానంపై మొత్తం 80 సవరణలను రాజ్యసభలో 11 మంది సభ్యులు వివిధ అంశాలపై ముందుకు తెచ్చారు. ఎలమారం కరీం తను ప్రతిపాదించిన సవరణలను ఏ ప్రాతిపదికన అంగీకరించడం లేదు, అనుమతించడం లేదని రూలింగ్ ఇవ్వాలని రాజ్యసభ చైర్మెన్ ఎం. వెంకయ్య నాయుడుకు లేఖ రాశారు. ''పార్లమెంట్ సభ్యుని ప్రాథమిక హక్కును ఉల్లంఘిస్తూ, ఇటువంటి నిర్ణయం తీసుకోవడం చాలా దురదృష్టకరం. ఇది ఖండించదగినది'' అని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ఈ చర్య వల్ల రాజ్యసభ సెక్రెటేరియట్ ఉద్దేశపూర్వకంగా కేంద్రాన్ని బహిర్గతం చేసే సంఘటనలకు సంబంధించిన సవరణలను మినహాయించిందనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించవచ్చని ఆయన అన్నారు. ''ఏకపక్ష చర్య పూర్తిగా అప్రజాస్వామికం. అనైతికం'' అని కరీం విమర్శించారు.