Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్చి 28, 29న దేశవ్యాప్త సమ్మె: సీఐటీయూ, ఏఐఏడబ్ల్యూయూ నేతలు కె. హేమలత, బి.వెంకట్
- కార్పొరేట్ అనుకూల బడ్జెట్
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కార్పొరేట్ అనుకూలంగా ఉందని, అందులో పేదలకు మేలు చేసేవి ఏమి లేవని సీఐటీయూ, ఏఐఏడబ్ల్యూయూ నేతలు కె.హేమలత, బి.వెంకట్ విమర్శించారు. సోమవారం నాడిక్కడ ఏపీ భవన్ లో సీఐటీయీ అధ్యక్షురాలు కె.హేమలత, ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు మార్చి 28,29 దేశవ్యాప్త సమ్మె చేస్తున్నాయని తెలిపారు. కార్మిక సమస్యలు, ప్రయివేటీకరణ, నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ కు వ్యతిరేకంగా, రైతు డిమాండ్లు, సామాన్య ప్రజల డిమాండ్ల కోసం సమ్మె చేపడుతున్నామని అన్నారు. కోవిడ్ వల్ల కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయారని, ఉపాధి హామీ కూలీ పెంచడం, పనిదినాలు పెంచడం కోసం కేంద్రాన్ని ఎడదన్నరగా డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేసేలా బడ్జెట్ లేదని, కీలక రంగాలకు, పథకాలకు కేటాయింపులు తగ్గించారని విమర్శించారు. బడ్జెట్ కేటాయింపు, కార్మిక, రైతు ప్రజా సమస్యలపై చేస్తున్న నిరసనలు, సమ్మెను ప్రజలు విజయవంతం చేయాలని హేమలత పిలుపు ఇచ్చారు.ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ప్రయివేట్ పరం చేస్తుందని బి.వెంకట్ విమర్శించారు. ఎయిర్ ఇండియాను అమ్ముకుని బీజేపీ సంబరాలు చేసుకుంటుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు తీరని అన్యాయం జరిగిందనీ, విభజన హామీల అమలుకు బడ్జెట్లో కేటాయింపులు లేవని విమర్శించారు. తెలంగాణకు ఒక జాతీయ ప్రాజెక్టు ఇవ్వాలని చట్టంలో ఉన్న దాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థకు 60 వేల కోట్ల నిధులు తగ్గించారని, డిజిటల్ విద్యకు ప్రజలు నోచుకోవడం లేదని సర్వేలు చెబుతున్నాయని పేర్కొన్నారు.అదానీ, అంబానీ, టాటా,విదేశీ కంపెనీలకు కొన్ని రంగాలను అప్పగించేందుకు బీజేపీ పని చేస్తుందని విమర్శించారు.కార్పొరేట్లకు ఊడిగం చేసేందుకే బీజేపీ సర్కారు ఉన్నట్టు తీరు కనిపిస్తోందని ఆరోపించారు.ఇది కార్పొరేట్ల బడ్జెట్ అని, ప్రజల బడ్జెట్ కాదని ఎద్దేవా చేశారు.యూపీ ఎన్నికల్లో భాగంగా 9 ప్రాంతాల్లో సంయుక్త కిసాన్ మోర్చా సమావేశాలు పెట్టి బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరుతున్నామని అన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా సమావేశాలకు మంచి స్పందన వస్తుందని చెప్పారు. వ్యవసాయ, కార్మిక సంఘాల నిరసనలు, సమ్మెకు ప్రజలు మద్దతుగా నిలవాలని వెంకట్ కోరారు.