Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యు) వైస్ చాన్సలర్‌గా శాంత్రిశ్రీ దూళిపూడి పండిట్ నియమితులైన సంగతి తెలిసిందే. యూనివర్సిటీ తొలి మహిళా వైస్ చాన్సలర్ కావడం విశేషం. అయితే ఆమె ఎంపిక ఆందోళన కలిగించే అంశంగా ఉన్నట్టు తెలుస్తోంది. కారణం పౌరహక్కుల కార్యకర్తలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు పలు అంశాలపై సోషల్‌మీడియాలో వివాదాస్పద పోస్ట్‌లు చేసినట్టు తెలుస్తోంది. గతంలో ఆమెపై అవినీతి అరోపణలు వచ్చినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. సంఫ్‌ు పరివార్ అర్హతలున్న విద్యావేత్తలను మాత్రమే కేంద్ర సంస్థల ఉన్నత స్థానాల్లో నియమించాలన్న కేంద్రప్రభుత్వ ధోరణి పండిట్ నియామకం విషయంలోనూ స్పష్టమైంది.
ఇటీవల వీసీగా మామిడాల జగదీష్ కుమార్ సుదీర్ఘ కాలం పదవీకాలం ముగియడంతో విద్యామంత్రిత్వ శాఖ (ఎంఓఈ) పండిట్‌ని నియమించింది. జగదీష్ కుమార్ పదవీ కాలంలోనూ యూనివర్సిటీలో పనితీరు అస్తవ్యవస్తంగానే ఉంది. ఇప్పుడు వివాదాస్పద వ్యక్తిగా ముద్ర ఉన్న శాంతిశ్రీ నియామకంతో యూనివర్శిటీ భవిష్యత్తు ప్రశ్నార్థకం కానుందని పలువరు ప్రొఫెసర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
శాంతిశ్రీ ప్రస్తుతం పూణెలోని సావిత్రీభాయి పూలే యూనివర్సిటీలో రాజకీయాలు, ప్రజాసంబధాలు, ఎంఫిల్ గైడ్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే యూనివర్సిటీ కమ్యూనికేషన్ స్టడీస్ విభాగంలో మాస్ మీడియా, మీడియా రీసెర్చ్, పాలిటిక్స్, కమ్యూనికేషన్‌ను బోధిస్తున్నారు.
ఆమె రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్‌ు (ఆర్ఎస్ఎస్)తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నట్లు ది వైర్ మీడియా తెలిపింది. పౌర హక్కుల కార్యకర్తలను హింసించడాన్ని సమర్థిస్తూ పలు వివాదాస్పద పోస్ట్‌లు చేశారు. ఆ ట్వీట్లనన్నింటినీ సోమవారం వాటిని ట్విటర్ ఖాతా నుండి తొలగించినట్లు తెలుస్తోంది. పౌర హక్కుల కార్యకర్తలు 'మానసిక జిహాదీల'ని పేర్కొన్నారు. తూర్పు చైనాలోని నిర్బంధ శిబిరాల్లో ఉండాల్సిన వ్యక్తులంటూ చైనీస్ శైలిలో విమర్శించారు.
సోమవారం వీసీగా నియమితులైనట్టు వార్త వెలువడిన వెంటనే పలువురు ఆమె పోస్ట్ చేసిన వివాదాస్పద ట్వీట్లను ప్రస్తావించారు. మత మార్పిడులపై హేళనగా పోస్ట్ చేశారని, భారత్‌లో క్రిస్టియన్లను 'బియ్యం బస్తాల మతమార్పిడులు' అని పేర్కొన్నారని తృణమూల్ కాంగ్రెస్ నేత సాకేత్ గోఖలే విమర్శించారు. రైతు నేతలు యోగేంద్ర యాదవ్, రాకేష్ తికాయత్‌లను 'పరాన్నజీవి మధ్యవర్తులు' అని, 'అసత్యాలు', 'ఓడిపోయిన వారు' అంటూ అభివర్ణించారని ఫ్యాక్ట్ చెకర్ మహ్మద్ జుబేర్ పండిట్ ఆ ట్వీట్ల స్క్రీన్ షాట్లను పోస్ట్ చేశారు. తన చర్య ముఖ్యమని, ఐక్య భారతం కోసం పరిష్కారంగా నాథూరామ్ గాడ్సే గాంధీని హత్య చేయాలని నిర్ణయించుకున్నారంటూ ట్విటర్లో పేర్కొన్నారు.
జేఎన్‌యూలోని విద్యార్థుల సంఘాలపై అయిష్టతను ప్రదర్శిస్తూ పోస్ట్‌లు చేయడం ఆందోళన కలిగిస్తోంది. గతేడాది ప్రారంభంలో జేఎన్‌యూలో ఫీజు పెంపును వ్యతిరేకిస్తూ విద్యార్థుల సంఘాలు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. క్యాంపస్ నుంచి ఈ అతివాద నక్సల్ గ్రూపులను నిషేధించాలని, జామియా, సెయింట్ స్టీఫెన్స్ వంటి మతపరమైన క్యాంపస్‌లకు నిధులను నిలిపివేయాలని పేర్కొన్నారు. పూణె యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ సెంటర్ (ఐఎస్సీ) డైరెక్టర్‌గా శాంతిశ్రీ ఉన్న సమయంలో పలు వృత్తి విద్యా కోర్సులో భారతీయ మూలాలు ఉన్న వ్యక్తుల(పీఐఓ)కు రిజర్వ్ చేయబడిన సీట్లను 2002 -2007 మధ్య కాలంలో 1800 మంది భారతీయ విద్యార్థులకు ఇచ్చినట్లు డాన్ 2011లో విడుదల చేసిన ఒక నివేదికలో వెల్లడించింది.
జేఎన్‌యూ వీసీగా ముగ్గురు అభ్యర్థుల పేర్లు ముందుకి రాగా, శాంతిశ్రీని నియమించినట్లు సంబంధిత వర్గాలు మీడియాకి తెలిపాయి. పండిట్‌తో పాటు స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లోని సెంటర్ ఫర్ యూరోపియన్ స్టడీస్ ప్రొఫెసర్ గుల్షన్ సచ్‌దేవా, న్యూఢిల్లీకి చెందిన ఇంటర్ యూనివర్శిటీ యాక్సిలేటర్ సెంటర్ (ఐయుఎసి) డైరెక్టర్ అవినాష్ చంద్ర పాండేలు విసి అభ్యర్థులుగా పోటీ పడ్డారు.