Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీఎస్సీ నియామకాల్లో 30శాతం తగ్గుదల
- బ్యాంకింగ్, రైల్వేలో పడిపోయిన ఉద్యోగాల భర్తీ
న్యూఢిల్లీ : ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ల కొరత తీవ్రస్థాయిలో ఉందని అనేక రాష్ట్రాలు చెబుతున్నాయి. కేంద్రమూ అదే మాట అంటోంది. మరోవైపు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నియామకాలు చూస్తే..ఏటా పోస్టుల భర్తీ గణనీయంగా పడిపోతోంది. ఉదాహరణకు 2016-17లో కమిషన్ ద్వారా భర్తీ అయిన ఖాళీలు 6103కాగా, 2019-20నాటికి వాటి సంఖ్య 4399కు పడిపోయింది.
నియామకాల్లో తగ్గుదల దాదాపు 30శాతం ఉందని తాజాగా లోక్‌సభలో కేంద్రమే ప్రకటించింది. యూపీఎస్సీ నియామకాల్లోనే కాదు, బ్యాంకింగ్, రైల్వే ఉద్యోగ నియామకాలు కూడా పెద్ద ఎత్తున తగ్గాయని సమాచారం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ), రైల్వేల్లో చేపడుతున్న నియామకాలు వివాదాస్పదమవుతున్నాయి.ఇటీవల రైల్వే నాన్-టెక్నికల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి పరీక్షలో అవకతవకలు జరిగాయని అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగటం తెలిసిందే. ఢిల్లీలో సివిల్ సర్వీస్‌కు ప్రిపేర్ అవుతున్న యూపీకి చెందిన శేఖర్ కుమార్ మాట్లాడుతూ, ''ప్రభుత్వరంగంలో ఉద్యోగాల భర్తీ దారుణంగా పడిపోయింది. పేదలు, అణగారిన వర్గాలకు చెందిన యువతపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. రాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్లను మరో విధంగా దెబ్బకొట్టడమే''నని చెప్పారు. ఉత్తరప్రదేశ్, బీహార్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీపడుతున్న అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఉద్యోగాల భర్తీపై మోడీ సర్కార్ అనుసరిస్తున్న తీరును వీరంతా తీవ్రంగా తప్పుబడుతున్నారు. గాజీపూర్‌కు చెందిన శివం కుమార్ మాట్లాడుతూ, ''ప్రతిఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న ప్రధాని మోడీ, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్, రైల్వే, ఇతర శాఖల్లో నియామకాల్ని తగ్గించారు. బ్యాంకుల ప్రొబేషనరీ ఆఫీసర్ల నియామకాలు వేలల్లో తగ్గాయి'' అని చెప్పారు.