Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఎం-కేర్స్ ఫండ్ ద్వారా రూ.10,990కోట్లు వసూళ్లు
- మార్చి, 2021నాటికి కోవిడ్‌పై చేసిన వ్యయం రూ.3,976కోట్లు
న్యూఢిల్లీ : పీఎం-కేర్స్ ఫండ్..పేరుతో మోడీ సర్కార్ సేకరించిన విరాళాల్లో మూడోవంతు కూడా ఖర్చు కాలేదు. ''కోవిడ్-19 మహమ్మారి వల్ల ఏదైనా అత్యవసర ఆరోగ్య పరిస్థితి తలెత్తితే, తీవ్రమైన పరిస్థితి వస్తే..పీఎం-కేర్స్ ఫండ్‌ను వినియోగిస్తా''మని విరాళాల సేకరణపై కేంద్రం ఆనాడు వివరణ ఇచ్చింది. అయితే కేంద్రం మొదట చెప్పినదానికి..ఆ తర్వాత చేసినదానికి చాలా తేడా కనపడుతోంది. మార్చి 2020లో విరాళాల సేకరణ మొదలుకాగా, మార్చి 2021వరకూ రూ.10,990కోట్లు సమకూరాయి. దేశవ్యాప్తంగా ప్రజల నుంచి సేకరించిన ఈ ఫండ్‌ను మోడీ సర్కార్ పూర్తిస్థాయిలో సద్వినియోగపర్చిందా? అంటే..స్పష్టమైన సమాధానం రావటం లేదు. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవటం కోసం 2020-21 ఆర్థిక సంవత్సరంలో కేవలం 3,976కోట్లు మాత్రమే ప్రభుత్వం ఖర్చుచేసింది. కోవిడ్ వ్యాక్సిన్ల కొనుగోలుకు, టెస్టింగ్, వెంటిలేటర్స్, హాస్పిటల్స్, టెస్టింగ్ ల్యాబ్స్, ఆక్సీజన్ జనరేషన్ ప్లాంట్స్, వలస కార్మికుల సంక్షేమం..తదితర వాటికోసం రూ.3976కోట్లు ఖర్చు చేశామని ఆర్థిక సంవత్సరం 2020-21 ఆడిట్ నివేదికలో కేంద్రం తెలిపింది. పీఎం కేర్స్ ప్రభుత్వ నిధి కాదు, వీటి వివరాలు ఇవ్వమని తొలుత మోడీ సర్కార్ ప్రకటించింది. పలువురు సామాజిక కార్యకర్తలు ఆర్టీఐ దరఖాస్తు చేయగా, సమాచారాన్ని విడుదల చేయలేదు. ఆర్థిక సంవత్సరం 2020-21 ఆడిట్ నివేదికలో పై వివరాలు విడుదల చేయటం గమనార్హం.
వ్యాక్సిన్లు, వెంటిలేటర్స్ కొనుగోలు
మార్చి 27, 2020న ఈ నిధిని కేంద్రం ఏర్పాటుచేసింది. దేశవిదేశాల నుంచి ఈ ఫండ్‌కు భారీ మొత్తంలో విరాళాలు వచ్చాయి. దేశవ్యాప్తంగా స్వచ్ఛంద విరాళాల ద్వారా రూ.7184కోట్లు రాగా, విదేశాల నుంచి రూ.494కోట్లు సమకూరాయి. ఇక ఖర్చుల విషయానికొస్తే, రూ.1393కోట్లతో 6.6కోట్ల డోసుల వ్యాక్సిన్లు కొనుగోలు చేశారు. మరో రూ.1311కోట్లతో 50వేల వెంటిలేటర్స్‌ను కొనుగోలు చేశారు. వీటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని హాస్పిటల్స్‌కు అందజేశారు. అయితే ఇలా పంపిన వెంటిలేటర్స్‌లో అనేక సాంకేతిక లోపాలు తలెత్తాయని, సరిగా పనిచేయనివి రాష్ట్రాలకు పంపారనే ఫిర్యాదులు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వచ్చాయి. నాణ్యతలేని వెంటిలేటర్స్ పంపారని కేంద్రం తీరును పలు రాష్ట్రాలు తప్పుబట్టాయి. ఆయా రాష్ట్రాల్లోని పలు ప్రభుత్వ హాస్పిటల్స్‌లో కేంద్రం పంపిన వెంటిలేటర్స్ ఒక మూలన పడివుండటం వార్తల్లో నిలిచింది. ప్రభుత్వ హాస్పిటల్స్‌లో మౌలిక వసతుల మెరుగుదల కోసం రూ.201 అందజేశారు. రూ.50కోట్లు వ్యయం చేసి ముజఫర్‌నగర్, పాట్నాలో 500 బెడ్స్‌తో కోవిడ్ హాస్పిటల్‌ను ఏర్పాటుచేశారు. 9రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో 16 ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ ల్యాబ్స్‌ను ఏర్పాటుచేశారు. కోవిడ్-19 వ్యాక్సిన్ పరీక్షల కోసం రూ.20కోట్లు సెంట్రల్ డ్రగ్ ల్యాబోరేటరీస్‌కు ఇచ్చారు. లాక్డౌన్ సమయంలో వలస కూలీల సంక్షేమం కోసం సుమారుగా రూ.1000కోట్లు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇచ్చినట్టు ఆడిట్ నివేదిక పేర్కొన్నది. కోవిడ్ టీకా అభివృద్ధి కోసం రూ.100 కోట్లు ఇస్తామని ప్రధాని మోడీ స్వయంగా ప్రకటించారు. అయితే అలాంటిదేమీ జరగలేదని ఆడిట్ నివేదిక గణాంకాలు చెబుతున్నాయి.