Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముకేశ్‌ను వెనక్కి నెట్టిన అదానీ
- ఏడాదిలో రూ.90వేల కోట్ల సంపద పెరుగుదల
న్యూఢిల్లీ : గడిచిన 14 ఏండ్లుగా ఆసియాలో అత్యధిక సంపద కలిగిన కుబేరుడిగా ఉన్న ముకేశ్ అంబానీని అదానీ గ్రూపు అధినేత గౌతం అదానీ వెనక్కి నెట్టారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకారం.. తాజాగా గౌతం అదానీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా అగ్రస్థానంలో నిలిచారు. అంబానీ రెండో స్థానానికి పడిపోయారు. ఫిబ్రవరి 8వ తేది నాటికి గౌతమ్ అదానీ సంపద 88.50 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.6.64 లక్షల కోట్లు)కు పెరిగింది. ముకేశ్ అంబానీ సంపద 87.90 బిలియన్ డాలర్లు (రూ.6.59 లక్షల కోట్లు)గా ఉంది. ముకేష్ కంటే అదాని సంపద 600 మిలియన్లు (రూ.4500 కోట్లు) ఎక్కువగా నమోదయ్యింది. దీంతో ఏషియాలోనే నంబర్ వన్ ధనవంతుడిగా అదానీ నిలిచారు. అదానీకి రాజకీయ మద్దతు ఇదే స్థాయిలో కొనసాగితే సమీప భవిష్యత్తులో అదానీ సంపద మరిన్ని రెట్లు పెరగొచ్చన్న అంచనాలు ఉన్నాయి. వీరివురి సంపదల మధ్య స్వల్ప తేడానే ఉండడంతో ఈ స్థానాలు రోజుల వ్యవధిలోనే తారుమారయ్యే అవకాశం లేకపోలేదని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీ పదో స్థానంలో ఉన్నారు. తాజాగా 11వ స్థానానికి దిగజారగా.. అదానీ 10వ స్థానానికి ఎగబాకారు. గడిచిన ఏడాది కాలంలో అదానీ సంపద 12 బిలియన్లు (రూ.90వేల కోట్లు) పెరిగింది. మంగళవారం సెషన్లో రిలయన్స్ షేర్ 1.74 శాతం పెరిగి రూ.2,357.50కు చేరింది. గతేడాది కాలంలో ఈ సూచీ 18 శాతం లాభపడింది. ఇదే కాలంలో అదానీ గ్రూపు కంపెనీల షేర్లు 170 శాతం ఎగిశాయి. ఈ క్రమంలో అదానీ సంపద గణనీయంగా పెరిగిందని బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. కరోనా సంక్షోభ కాలంలోనూ అదానీ సంపద రోజుకు రూ.1000 కోట్లు పెరిగిందని హురున్ రిపోర్ట్ పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో ఏడాది వ్యవధిలో సంపద విలువ 261 శాతం ఎగిసిందని పేర్కొంది. కేవలం తొమ్మిది నెలల్లో అదానీ నికర సంపద రెండింతలు అయ్యిందని ఫోర్బ్స్ ఓ రిపోర్ట్‌లో తెలిపింది.