Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాళ్లురువ్వుకున్న ఇరువర్గాలు
- లాఠీచార్జి,బాష్పవాయువు ప్రయోగం
- కర్నాటకలో విద్యా సంస్థలకు మూడు రోజులు సెలవు
బెంగళూరు: హిజాబ్ వివాదంపై కర్నాటకలో తీవ్ర దుమారం రేగుతోంది. రోజంతా ఇరువర్గాల విద్యా ర్థులు కళాశాలల వద్ద ఆందోళనకు దిగారు. దీనికి ప్రతిగా ఓ వర్గం యువకులు రెచ్చగొట్టేలా ప్రవర్తించటమే కాదు. జాతీయజెండాను తొలగించి..అక్కడ మతపరమైన పతాకాన్ని ఎగురవేశారు. జై శ్రీరామ్ అంటూ కవ్వింపుచర్యలు, రాళ్లు రువ్వుకుంటున్న ఘటనలతో కర్నాటకలోని విద్యాసంస్థల్లో రచ్చగా మారింది.ఉడిపి విద్యాసంస్థలో మొదలైన హిజాబ్ వివాదం మంగళవారం కూడా కొనసాగింది. శివమొగ్గలోని బాపూజీనగర్ ప్రభుత్వ ప్రీ-యూనివర్శిటీ కాలేజీ పరిసర ప్రాంతాల్లో విద్యార్థులు నిరసనకు దిగారు. హిజాబ్ ధరించిన విద్యార్థులు, కాషాయం శాలువాలతో వచ్చిన విద్యార్థుల మధ్య మాటామాటా పెరిగింది. దీంతో ఒక గ్రూపుపై మరో గ్రూపు రాళ్లు రువ్వినట్టు ఎస్పీ లక్ష్మీప్రసాద్ తెలిపారు.
విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు మంగళవారంనాడు లాఠీచార్జి చేశారు. అధికార బీజేపీకి అనుకూలంగా పోలీసులు వ్యవహరించటంతో.. పలువురు విద్యార్థులు ప్రయివేటు బస్సులపై రాళ్లు రువ్వారు. దీనికి ప్రతిగా పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడినట్టు తెలుస్తోది. ప్రస్తుతం శివమొగ్గలో సెక్షన్ 144 విధించారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా అధికార యంత్రాంగం అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దింపింది.
ఘర్షణలు కొనసాగుతున్న దృష్ట్యా..మూడు రోజులపాటు పాఠశాలలు, కళాశాలను బొమ్మే సర్కారు మూసివేయాలని ఆదేశించింది. అంతకు ముందు హిజాబ్‌పై వేసిన పిటిషన్లను కర్నాటక హైకోర్టు విచారణ జరిపింది.
చట్టాన్ని అనుసరిస్తామని న్యాయమూర్తి కృష్ణ దీక్షిత్ స్పష్టం చేశారు. ఎవరి అభిరుచి, భావాల వల్ల కాదు. రాజ్యాంగం ఏది చెబితే అది చేస్తాం. రాజ్యాంగమే ప్రామాణికంగా తీసుకుంటామనీ, విచారణను బుధవారానికి వాయిదా వేశారు.