Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ఏర్పాటుకు మేం వ్యతిరేకం కాదు
- రాజ్యసభలో కాంగ్రెస్ పై మోడీ గుస్సా..
- బీజేపీ పాలనలో ఏం చేశారు..: ప్రతిపక్షాలు, పౌరసమాజం
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనతో తెలుగు రాష్ట్రాలు ఇప్పటికీ నష్ట పోతున్నాయని ప్రధాని మోడీ అన్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధాని మోడీ మంగళవారం రాజ్యసభలో సమాధానమిస్తూ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఆ పార్టీ ఉనికిలో ఉండటం వల్ల ప్రజాస్వామ్య మూలాలు దెబ్బతింటున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కాంగ్రెస్ అన్యాయం చేసిందన్నారు. ''ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్ హడావిడిగా విభజించిందన్నారు. తాము తెలంగాణాకు వ్యతిరేకం కాదన్నారు. విభజన జరిగిన తీరు ఎలా ఉందనేది చాలా ముఖ్యమైన విషయమని వ్యాఖ్యానించారు. తెలంగాణాను ప్రత్యేక రాష్ట్రంగా విభజించినప్పటికీ, ఆ పార్టీని ప్రజలు నమ్మలేదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కాంగ్రెస్ చాలా అన్యాయం చేసిందన్నారు. విభజన తరువాత రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు. సరైన విధంగా విభజన జరిగి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. వాజ్ పేయీ ప్రభుత్వం కూడా మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. శాంతియుతంగా అందరూ కలిసి కూర్చుని, చర్చించి బిల్లులను ఆమోదించారు. కానీ ఏపీ, తెలంగాణ విషయంలో అలా జరగలేదు. నాడు కాంగ్రెస్ హయాంలో తలుపులు వేసి, మైకులు ఆపేశారు. కాంగ్రెస్ సభ్యులు పెప్పర్ స్ప్రే కొట్టారు. ఎలాంటి చర్చ లేకుండా ఏపీని విభజించారు. ఇదేనా ప్రజాస్వామ్యం?. విభజన తీరుతో ఏపీ, తెలంగాణ ఇప్పటికీ నష్టపోతు న్నాయి. కాంగ్రెస్ అహంకారం, అధికార కాంక్షకు ఇదే నిదర్శనం. ఏపీ విభజన తీరు సరిగ్గా లేదు. సరిగ్గా విభజన జరిగి ఉంటే రెండు రాష్ట్రాలకు సమస్యలు వచ్చేవి కావు'' అని మోడీ అన్నారు. కాంగ్రెస్ వంశపారంపర్య రాజకీయాలకు పాల్పడుతోందని, ఫలితంగా దేశానికి హాని జరుగుతోందని అన్నారు. భారత దేశమంటే 'యూనియన్ ఆఫ్ స్టేట్స్' అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పేరును 'ఫెడరేషన్ ఆఫ్ కాంగ్రెస్‌గా మార్చాలని సలహా ఇచ్చారు.
కాంగ్రెస్ లేకపోయుంటే ఏం జరిగేది? అని కొందరు సభ్యులు అడుగుతున్నారని, ఈ ప్రశ్నకు తన సమాధానం ఇదేనని అంటూ, కాంగ్రెస్ లేకపోయుంటే, దేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) అమలయ్యేది కాదన్నారు. కుల రాజకీయాలు కూడా ఉండేవి కాదన్నారు. సిక్కులు ఊచకోతకు గురై ఉండేవారు కాదని చెప్పారు. కాశ్మీరీ పండిట్ల సమస్యలు ఉత్పన్నమయ్యేవి కాదన్నారు.
భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని మోడీ చెప్పారు. ప్రజాస్వామ్యం, చర్చలు మన దేశంలో అనేక శతాబ్దాల నుంచి ఉన్నట్లు చెప్పారు. కాంగ్రెస్ తన వంశానికి భిన్నంగా దేనినీ చూడలేదని, ఆలోచించలేదని, ఇదే ఆ పార్టీ సమస్య అని ఆరోపించారు. దీనివల్ల ప్రతిభావంతులు దూరమవుతున్నారని, ఇదే పార్టీలకు జరుగుతున్న అతి పెద్ద నష్టమని తెలిపారు.
ప్రతిపక్షంలో ఉన్నపుడు కాంగ్రెస్ సమాఖ్య తత్వం (ఫెడరలిజం) గురించి ఉపన్యాసాలు ఇస్తుందన్నారు. కేంద్రంలో ఆ పార్టీ అధికారంలో ఉన్నపుడు మాత్రం ముఖ్యమంత్రులను చిల్లర విషయాలపై తొలగిస్తుందని చెప్పారు. అప్పటి ప్రధాన మంత్రి కుమారుడు విమానాశ్రయంలో ఏర్పాట్లు ఇష్టపడనందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని తొలగించిందన్నారు. అదే విధంగా కర్నాటకలో ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రి వీరేంద్ర పాటిల్‌ను అగౌరవంగా తొలగించిందన్నారు. అది కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగులేనపుడు తొలగించిందన్నారు. ఇటువంటి సంకుచిత ఆలోచనా ధోరణితో బీజేపీ పని చేయదని తెలిపారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితే, దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. దేశాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేర్చినట్లయితే దేశం ప్రగతి సాధిస్తుందని తెలిపారు.
ప్రభుత్వ చర్యలతో భరోసా ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల ఈ మహమ్మారి నుంచి బయట పడటం కోసం కొత్త విధానాలతో చర్యలు తీసుకోవచ్చుననే భరోసా కలిగిందన్నారు. 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ సరుకులు ఇవ్వడం ద్వారా ప్రపంచానికి ఓ ఉదాహరణగా మన దేశం నిలిచిందన్నారు. భారత దేశంలోనే తయారైన వ్యాక్సిన్లను ఇస్తూ కోవిడ్-19 వ్యాక్సినేషన్‌ను అత్యధికంగా చేపట్టిన దేశంగా భారత దేశం నిలిచిందని తెలిపారు. మన దేశంలో తయారైన వ్యాక్సిన్లు కేవలం భారతీయులకు మాత్రమే కాకుండా మన పొరుగు దేశాలకు కూడా అందించినట్టు తెలిపారు. నేడు మితమైన ద్రవ్యోల్బణం, అధిక వృద్ధి రేటు ఉన్న ఏకైక భారీ ఆర్థిక వ్యవస్థ భారతదేశమేనని చెప్పారు. అయితే ఏడేండ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ ఏం చేసిందని ప్రతిపక్షాలు, పౌర సమాజం మోడీని ప్రశ్నిస్తోంది.
కాంగ్రెస్ వాకౌట్
మోడీ మాట్లాడుతూండగా కాంగ్రెస్ సభ్యులు పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశ తొలి ప్రధానమంత్రి జవహార్‌లాల్ నెహ్రూ సమయం నుంచి మన్మోహన్ ప్రభుత్వం వరకు కాంగ్రెస్ పాలన తీరుపై ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. నెహ్రూ, ఇందిరా గాంధీలపై మోదీ విమర్శల వర్షం కురిపించడంతో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు.