Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్ :
రాజ్యసభలో బడ్జెట్ పై చర్చలో ఎలమారం కరీం
న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్ పూర్తిగా ప్రయివేటీకరణే లక్ష్యంగా పెట్టుకున్న ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని సీపీఐ(ఎం) పార్లమెంటరీ పార్టీ నేత ఎలమారం కరీం అన్నారు. బుధవారం రాజ్యసభలో బడ్జెట్ పై జరిగిన చర్చలో సీపీఐ(ఎం) తరపున కరీం మాట్లాడారు. ప్రజలు అత్యధి కంగా జీవనోపాధి కోల్పోవడం, ఆదాయం కోల్పోవడం, తీవ్రరూపం దాల్చిన పేదరికం, ఆకలి వంటి రూపాల్లో అత్యధికులు ఊహించలేని దుస్థితిని ఎదుర్కొంటున్నారు.
సామాన్యుల అవసరాలను వదిలేసి..
''పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ తో పాటు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదల, నిరుద్యోగం చాలా దారుణంగా ఉంది. సంపద, ఆదాయ అసమానతలు అత్యంత దారుణంగా ఉన్నాయి. కరోనా మహమ్మారి, లాక్డౌన్ కారణంగా లక్షలాది మంది పేదరికంలోకి నెట్టబడ్డారు. భారీ నిరుద్యోగం మధ్య కూడా ద్రవ్యోల్బణం వేగవంతమవుతోంది. ఆర్థిక వ్యవస్థ ఇంత సవాలుతో కూడిన పరిస్థితిని ఎదుర్కొంటున్న సమయంలో బడ్జెట్లో ఆయా అంశాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఈ సమయంలో బడ్జెట్లో ఉద్యోగాల కల్పనకు, దేశీయ డిమాండ్‌ను పెంచడానికి అవసరమైన చర్యలు ఉండాలి. కానీ ఈ సమస్యలను పరిష్కరించడంలో ఈ బడ్జెట్ ఘోరంగా విఫలమైంది. కేంద్ర బడ్జెట్ సామాన్యుల అవసరాలను మరచిపోయి, విధ్వంసకర ప్రయివేటీకరణ డ్రైవ్ సమర్పించబడింది'' అని అన్నారు. ''బడ్జెట్ ప్రభుత్వ వ్యయం రూ.39.45 లక్షల కోట్లు, ఇది 2021-22కి సవరించిన అంచనా కంటే కేవలం 4.6 శాతం ఎక్కువ. ద్రవ్యోల్బణం రేటు పెరుగుదల కంటే తక్కువగా ఉంది. ఆర్థిక సర్వే అంచనా వేసిన 8-8.5 శాతం వాస్తవ జీడీపీ.వృద్ధి రేటు కంటే కూడా తక్కువగా ఉంది. 2022-23 బడ్జెట్ అంచనాల్లో వ్యయం 15.3 శాతానికి తగ్గింది. ఖర్చు తగ్గడం కేవలం కేంద్ర ప్రభుత్వ వ్యయంలోనే కాదు. వనరులను రాష్ట్రాలకు బదిలీ చేయడంలో తగ్గిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూడా అదే పని చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. ఈ బదిలీలు 2021-22లో జీడీపీలో 6.91 శాతం నుంచి 2022-23లో 6.25 శాతానికి తగ్గుతాయి'' అని అన్నారు.''మహమ్మారి సమయంలో కార్పొరేట్లు లాభాలను కూడబెట్టుకోగలిగారు. సాధారణ ప్రజలపై విధించే పరోక్ష పన్నుల నుంచి జీఎస్టీ, పెట్రోలియం ధరల పెరుగుదల ద్వారా ఆదాయ వసూళ్ల పెరుగుదల ప్రధానంగా పెరిగింది. ఉపాధి హామీకి కేటాయింపులు రూ.98 వేల కోట్ల నుంచి రూ.73 వేల కోట్లకు తగ్గించబడ్డాయి. విస్తృతమైన ఆకలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఆహార సబ్సిడీని 30 శాతం తగ్గించారు. ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరల నేపథ్యంలో ఎరువుల సబ్సిడీని 25 శాతం, పెట్రోలియం సబ్సిడీని 11 శాతం తగ్గించారు. ఇప్పుడు పీఎం-పోషన్గా పేరు మార్చబడిన మధ్యాహ్న భోజన పథకానికి కేటాయింపులో కూడా రూ.1,267 కోట్ల భారీ కోతను ఎదుర్కొంది'' అని పేర్కొన్నారు.
''జాతీయ ఖజానా నుంచి ప్రయివేట్ చేతుల్లోకి వనరుల బదిలీని సులభతరం చేస్తూ అవస్థాపన, తయారీ, ఖనిజ రంగాలను పూర్తిగా అప్పగించి నిరాశాజనకమైన, విధ్వంసకర ప్రైవేటీకరణ డ్రైవ్ లో బడ్జెట్ సమర్పించబడింది. ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగం ప్రారంభంలోనే నేషనల్ క్యారియర్ ఎయిర్ ఇండియా, నీలాచల్ ఇస్పాత్లను టాటాలకు విజయవంతంగా విక్రయించినందుకు ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ప్రభుత్వ యాజమాన్యంలోని మూలధన ఆస్తులను స్వదేశీ, విదేశీ ప్రయివేట్ రంగానికి మరింత బదిలీ చేయడానికి ప్రభుత్వ నిబద్ధతను బడ్జెట్ పునరుద్ఘాటించింది. వాస్తవానికి ఈ ప్రభుత్వ పాలనలో ఆర్థిక విధాన రూపకల్పన పూర్తిగా ప్రజా వ్యతిరేక విధ్వంసక ధోరణి వైపు వెళుతోంది. ఇది జాతీయ ప్రయోజనాలను దెబ్బతీస్తుంది'' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.''మహమ్మారి సమయంలో శ్రామిక ప్రజలు జీవనోపాధి, ఆదాయాల నష్టం, విస్తతమైన అసంఘటిత రంగంలో ఉపాధి ఎదుర్కొంటున్న కష్టాల గురించి బడ్జెట్ పట్టించుకోలేదు.
అందరికీ సామాజిక భద్రత, విస్తరణ కోసం డిమాండ్లు ఉన్నప్పటికీ, వాస్తవానికి దేశం కోసం సంపదను .సృష్టించే శ్రామిక ప్రజల కోసం బడ్జెట్ పూర్తిగా నిరాకరణ రీతిలోనే ఉంది. ఆర్థిక పునరుద్ధరణకు డిమాండ్‌ను ప్రేరేపించడానికి, శ్రామిక ప్రజలకు ఉపశమనం కలిగించడానికి బడ్జెట్ ఏమీ చేయలేదు. గత ఏడాదితో పోలిస్తే పేదలకు ఉపశమనం కలిగించే మొత్తం కార్యక్రమాల కోసం ఖర్చులు వాస్తవానికి తగ్గించబడ్డాయి. పట్టణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టడం అవసరం. దీనికి విరుద్ధంగా ఉపాధి హామీ ఖర్చును రూ.25 వేల కోట్లు, ఆహారం, ఇంధనం, ఎరువుల సబ్సిడీలను తగ్గించడంతోపాటు ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధిలో కేటాయింపులు తగ్గాయి'' అన్నారు.
రైతుల నిజమైన డిమాండ్లను విస్మరణ
''ఈ బడ్జెట్ రైతుల నిజమైన డిమాండ్లను పూర్తిగా విస్మరించి, విజయవంతమైన ఐక్య రైతు ఉద్యమంపై ప్రతీకార చర్యగా కనిపిస్తోంది. రైతులకు, వ్యవసాయ కూలీలకు ఎలాంటి ఉపశమనాన్ని ప్రకటించలేదు. లాభసాటి ధరలకు భరోసా కల్పించాలని, రుణమాఫీ చేయాలనే రైతుల డిమాండ్లను కూడా పరిష్కరించలేదు. ఫసల్ బీమా పథకానికి కేటాయింపులు కూడా దాదాపు రూ.500 కోట్లు పడిపోయాయి'' అని పేర్కొన్నారు..
రాష్ట్రాలకు సహాయంపై మౌనం
''కోవిడ్ అనంతర కాలంలో కేరళతో సహా అన్ని రాష్ట్రాలకు మరింత సహాయం అందించాల్సిన అవసరం ఉంది. కానీ బడ్జెట్లో మౌనంగా వహించారు. రాష్ట్రాల అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర బడ్జెట్ తోడ్పడటం లేదు. జీఎస్టీ పరిహారాన్ని మరో ఐదేండ్లపాటు పొడిగించాలన్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోలేదు. అదేవిధంగా రుణ పరిమితిని 5 శాతానికి పెంచాలన్న రాష్ట్ర డిమాండ్‌ను బడ్జెట్ ఆమోదించలేదు'' అని విమర్శించారు.
కార్పొరేట్ వర్గాల పన్ను ఎగవేతకు ప్రోత్సహం..
''గత రెండేండ్ల మహమ్మారి కాలంలో ధనికులు మరింత ధనవంతులుగా మారారు. ఆక్స్‌ఫామ్ ప్రకారం భారతదేశంలోని అత్యంత సంపన్న కుటుంబాల సంపద 2021లో రికార్డు స్థాయికి చేరుకుంది. భారతదేశంలోని మొదటి పది మంది వ్యక్తులు సంపదలో 57 శాతం కలిగి ఉన్నారు. అయినప్పటికీ, ఈ సూపర్ లాభాలపై పన్ను విధించే ప్రతిపాదన లేదన్నారు.