Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిస్కషన్ పాయింట్లపై వివరణాత్మక
- సూచనలు చేసిన మహిళా సంఘాలు
- జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌కి లేఖ
న్యూఢిల్లీ : క్రిమినల్ లాలో ప్రతిపాదిత మార్పులు చేయడానికి సంబంధించి మహిళా కమిషన్ లేవనెత్తిన డిస్కషన్ పాయింట్లను ప్రస్తావిస్తూ, వాటికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తూ మహిళా సంఘాలన్నీ కలిసి జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌కి లేఖ రాశాయి. హింస నుండి మహిళకు రక్షణ కల్పించడం జాతీయ మహిళా కమిషన్ లక్ష్యంగా వుండాలని ఆ లేఖలో స్పష్టం చేశాయి. మహిళల అనుకూల చట్టాల్లో ఇప్పటికే వున్న హక్కులను నీరుగార్చకుండా, మహిళల హక్కులను బలోపేతం చేసేలా కమిషన్ వ్యవహరించాలని లేఖలో మహిళా నేతలు కోరారు. ఐద్వా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాలిని భట్టాచార్య, మరియం ధావలె, ఎన్ఎఫ్ఐడబ్ల్యూఅధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అరుణ్ రారు, అని రాజా, ఐద్వా లీగల్ అడ్వయిజర్ కీర్తి సింగ్, ఏఐపీడబ్ల్యూఏ ప్రధాన కార్యదర్శి కవితా కృష్ణన్లు ఈ లేఖపై సంతకాలు చేశారు. ఇదే విషయమై గతంలో ఐద్వా, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ, ఏఐపీడబ్ల్య్యూఏలు కూడా మెమోరాండాలు పంపిన విషయాన్ని గుర్తు చేశాయి. భారత్‌లో మహిళల దృక్పథం, వారి స్థితిగతులను అనుసరించి ఏమైనా సవరణలు చేయాల్సినవి వుంటే వాటిని సూచించాల్సిందిగా కోరుతూ జాతీయ మహిళా కమిషన్ గతంలో లేఖ రాసింది. కమిషన్ ప్రతిపాదించిన డిస్కషన్ పాయింట్లలో కొన్నింటిని ప్రస్తావిస్తూ, ఇవి, పురుషులకు అనుకూలంగా క్రిమినల్ లాలోని నిబంధనలను నీరుగార్చేందుకు ఉద్దేశించినట్లుగా వున్నాయని భావించడానికి దారి తీసేలా వున్నాయని మహిళా సంఘాలు ఆ లేఖలో పేర్కొన్నాయి. మహిళా సంఘాలు, గ్రూపులు సుదీర్ఘకాలం పోరాటం సాగించి, ప్రచారం చేసిన తర్వాత తీసుకొచ్చిన నిబంధనలివని ఆ లేఖ పేర్కొంది. ఆ డిస్కషన్ పాయింట్లకు సమాధానంగానే ఈ లేఖ రాస్తున్నామని మహిళా సంఘాలు తెలిపాయి.
సెక్షన్ 498ఏ
పరిధి, శిక్ష, అవగాహన, బెయిల్ ఇవ్వడం, కాంపౌండబిలిటీకి సంబంధించి సెక్షన్ 498-ఎ ని సవరించవచ్చా?లేదా?అని ప్రశ్నించారు,కానీ దీనికి సంబం ధించి ఎలాంటి సవరణ జరిగినా ఈ సెక్షన్ మరింత నీరుగారిపోవడానికే దారి తీస్తుందని,అది తమకు ఆమోద యోగ్యం కాదని మహిళా సంఘాల నేతలు స్పష్టం చేశారు. ప్రతి ఏటా ఈ సెక్షన్ కింద లక్షకి పైగా కేసులు నమోదవు తున్నాయి. మన సమాజంలో నెలకొన్న గృహ హింస స్వభావం ఎలా వుందో ఈ సెక్షన్ చూపుతుంది. 2015లో ఎన్సీఆర్బీ డేటాను పరిశీలించినట్లైతే దాదాపు 90శాతం కేసుల్లో చార్జిషీట్లు దాఖలయ్యాయంటే ఇవి నిజాయతీతో పెట్టిన కేసులేనని స్పష్టమవుతోందని వారు పేర్కొన్నారు.
వైవాహిక బంధంలో లైంగికదాడి, సమ్మతి,
జెండర్ న్యూట్రాలిటీ నిర్వచనం
అనేక ఏండ్ల తరబడి పోరాటాలు, నిర్భయ కేసులో వర్మ కమిటీ నివేదిక అనంతరం ఐపిసిలో మార్పులు చేశారు, లైంగికదాడి, మహిళలపై జరుగుతున్న ఇతర నేరాల నిర్వచనాన్ని విస్తరించారు. ఎస్375లో డిజిటల్, ఓరల్ రేప్ (అసభ్యంగా ఫోటోలు, సందేశాలు పంపడం, మాట్లాడడం), వోయరిజం (ఇతరులు నగంగా వున్నపుడు చూసి ఆనందించడం) (354-సి), వెంటబడి వేధించడం (354-డి) లైంగిక వేధింపులు (354-ఎ) తదితరాలు ఇందులో ఉన్నాయి. కాలం చెల్లిన కొన్ని పదాలను (టెర్మినాలజీ)ని మార్చడంతో పాటు 354, 509 ఐపిసిలో నిర్దిష్ట పితృస్వామ్య నిబంధనల నుంచి ఉద్భవించిన అంశాలు వున్నాయి. ఈ లైంగిక నేరాలు వేటిలోనూ ఎలాంటి మార్పులు, చేర్పులు అవసరం లేదని మహిళా సంఘాలు అభిప్రాయ పడ్డాయి. 2013లో నిర్భయ కేసు తర్వాత జాతీయ ఏకాభిప్రాయంతో తీసుకొచ్చిన సవరణల్లో జోక్యం చేసుకోరాదని జాతీయ మహిళా కమిషన్‌కు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. మహిళల కన్నా పురుషులను రక్షించాలనే లక్ష్యంతో చట్టాన్ని నీరు గార్చే ప్రయత్నాలకు కమిషన్ మద్దతివ్వరాదని కోరారు.
బహుభార్యత్వం
సెక్షన్494లో బహుభార్యత్వ నేరానికి సంబంధించిన ంత వరకు ఈ సెక్షన్‌ను లివిన్ రిలేషన్షిప్లకు కూడా విస్తరించడం తప్పు కాగలదని, పైగా తిరోగమన చర్య కాగలదని మహిళా నేతలు పేర్కొన్నారు. దీనివల్ల మహిళల వేధింపులు, ఈ రిలేషన్‌షిప్‌లోకి ప్రవేశించాలనుకునే వ్యక్తుల గోప్యత, వారి ప్రతిపత్తిని ఉల్లంఘించడమే అవుతుందని స్పష్టం చేశాయి. వాస్తవానికి, ఇటువంటి రిలేషన్షిప్ల్లో మహిళల హక్కులకు హామీ కల్పిస్తూ, వీటిని గుర్తించే దిశగా దేశం పయనిస్తోందని అన్నారు.
భరణం, సీఆర్పీసీలోని 125వ సెక్షన్
సిఆర్‌పిసిలోని 125వ సెక్షన్‌కి సంబంధంచినం తవరకు ఇందులోని సెక్షన్లు 4, 5లను తొలగించాలి. వివాహ బంధంలో వున్నప్పుడు ఆ ఇంటికి సదరు మహిళ చేసిన సేవలను దృష్టిలో వుంచుకుని ఈ మెయిన్టెనెన్స్ హక్కు లభిస్తుంది. దీనికి సార్వజనీనంగా గుర్తింపు లభించింది. విడిపోయిన తర్వాత ఆ మహిళ వ్యవహార శైలిపైన గానీ లేదా వివాహ బంధంలో వున్నపుడు ఆ మహిళ ప్రవర్తన పట్ల గానీ ఈ మెయిన్టెనెన్స్ హక్కు ముడిపడి వుంటుందని చెప్పడం పూర్తిగా తప్పని లేఖలో పేర్కొన్నారు. మహిళల అనుకూల చట్టాల్లో ఇప్పటికే వున్న హక్కులను నీరుగార్చకుండా, మహిళల హక్కులను బలోపేతం చేసేలా కమిషన్ వ్యవహరించాలని లేఖలో మహిళా నేతలు కోరారు.