Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జేఎన్‌యూ వీసీగా శాంతిశ్రీ నియామకంపై సర్వత్రా విమర్శలు
న్యూఢిల్లీ : దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థల్లో ఒకటైన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా శాంతి శ్రీ ధూళిపూడిని నియమించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర విద్యా శాఖ చేపట్టే ఇటువంటి నియామకాల్లో నాణ్యతా ప్రమాణాలు, నైపుణ్యాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిన తీరు తాజా చర్యతో ప్రస్ఫుటమవుతోంది. బహుశా ఏ మాత్రమూ వెనుకాడని రీతిలో శాంతిశ్రీ వ్యక్తం చేసే హిందూత్వ మితవాద రాజకీయ అభిప్రాయాలే ఈ పదవిలో ఆమెను నియమించేందుకు అన్నింటికన్నా పెద్ద అర్హతగా మారినట్లు కనిపిస్తోంది. గతంలో ఆమె చేసిన ట్వీట్లు చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. మహాత్మా గాంధీని హత్య చేయడమే ఏకైక పరిష్కార మార్గమనే రీతిలో నాథూరాం గాడ్సే చర్యను ఆమె సమర్ధిస్తూ గతంలో ట్వీట్లు చేశారు. భారత ముస్లింలను ఊచకోత కోయాలంటూ పిలుపునిచ్చారు. సుదీర్ఘకాలం పోరు బాటలో సాగిన రైతాంగాన్ని పరాన్నజీవులు, మధ్య దళారీలు, మధ్యవర్తులు అంటూ ఎద్దేవా చేస్తూ రైతాంగ ఉద్యమాన్ని అవహేళన చేశారు. జేఎన్‌యూ విద్యార్థులను, ఫ్యాకల్టీని 'ఓడిపోయినవారు', జిహాదీస్టులుగా వ్యాఖ్యానించారు. తాజాగా మూడు రోజుల నుంచి ఆమె ఈ ట్వీట్లకు దూరం పాటిస్తున్నారు. ఈ ట్వీట్లపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని డిమాండ్లు వస్తున్నాయి. పూనే యూనివర్శిటీలో ఆమె డైరెక్టర్‌గా వున్న సమయంలో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ సెంటర్లో విద్యార్థుల ప్రవేశాలకు పీఐఓ కోటాను దుర్వినియోగం చేశారంటూ జ్యుడీషియల్ కమిషన్ ఆమెను దోషిగా నిర్ధారించింది. ఆ రకంగా, నైతికత, సమగ్రతా విలువలు కలిగిన ఉన్నత స్థాయి వ్యక్తులను మాత్రమే వైస్ ఛాన్సలర్లగా నియమించాలని కచ్చితంగా పేర్కొంటున్న, దీర్ఘకాలంగా వున్న యుజిసి నిబంధనలను ఈ విషయంలో కేంద్ర విద్యా శాఖ పక్కకు నెట్టేసింది. అమల్లో వున్న నిబంధనలన్నింటినీ ఉల్లంఘించి ఇటువంటి నియామకాల్లో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై వివరణ ఇవ్వాలని డిమాండ్లు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి.