Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రానికి సీపీఐ(ఎం) నేత లేఖ
బెంగళూరు : కర్నాటకలో జరుగుతున్న దురదృష్టకర సంఘటనల పట్ల జోక్యం చేసుకోవాలంటూ సీపీఐ(ఎం) నేత, ఎంపీ ఎలమారం కరీం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కి లేఖ రాశారు. హిజాబ్ ధరించినందున ఉడుపిలో ముస్లిం విద్యార్థినులు తరగతులకు హాజరయ్యే హక్కును కోల్పోతున్నారని అన్నారు. రాష్ట్రంలో మత పరమైన విభజనలను సృష్టించాలనే ఉద్దేశంతో అనవసరపు వివాదాలను సృష్టిస్తున్నారనే వాస్తవాన్ని గమనించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ఉడుపి జిల్లాలోని కొన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లోకి హిజాబ్ ధరించిన విద్యార్థులను అనుమతించకపోవడంతో ఈ వివాదం ప్రారంభమైందనీ, ఇది ముస్లిం కమ్యూనిటీలో విస్తృత నిరసనలకు దారితీసిందని అన్నారు. ఇప్పటివరకు ముస్లిం యువతులు ఎటువంటి అభ్యంతరం లేకుండా హిజాబ్ ధరించి తరగతులకు హాజరయ్యేవారని, అయితే వారు డ్రెస్ కోడ్‌ను పాటించడం లేదంటూ తరగతులకు హాజరయ్యేందుకు నిరాకరించారని అన్నారు. ఇది పూర్తిగా వాస్తవాన్ని తప్పుదోవ పట్టించే అంశమని.. గత కొన్నేండ్లుగా వారు యూనిఫామ్‌పై హిజబ్ ధరిస్తున్నారని అన్నారు. కొన్ని విద్యా సంస్థలు అయితే వారికి డ్రెస్ కోడ్ పాటు హిజాబ్ రంగును కూడా నిర్దేశించాయని లేఖలో పేర్కొన్నారు. కొన్ని దశాబ్దాలుగా అక్కడ ఎలాంటి వివాదాలు తలెత్తలేదని చెప్పారు. దీంతో ఇది రెండు వర్గాల మధ్య విభజనను సృష్టించేందుకు,
మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు ఉద్దేశపూర్వకంగా లేవనెత్తిన అంశంగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన హోదాలో ఈ వివాదాన్ని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటుందని భావించామనీ, అయితే అవి జరగలేదని అన్నారు. ఈ వివాదం పేరుతో ముస్లిం బాలికలు చదువుకునే హక్కును, తరగతులకు హాజరయ్యే హక్కును హరించవద్దని తాను అభ్యర్థిస్తున్నట్టు ఎలమారం కరీం ఆ లేఖలో పేర్కొన్నారు.
విద్యను నేర్చుకునే వారి ప్రాథమిక హక్కును ఏ విధంగానైనా కాపాడాలని, ఇటువంటి వివాదాలను వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా వ్యవహరించాలని.. ఈ వివాదంపై మీరు తక్షణమే జోక్యం చేసుకోవాలని అభ్యర్థిస్తున్నట్టు లేఖలో తెలిపారు.
కలకలం సృష్టిస్తున్న కర్నాటక : కమల్‌హాసన్
కర్నాటకలోని హిజాబ్ వివాదంపై నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధ్యక్షుడు కమల్‌హాసన్ స్పందించారు. కర్నాటకలో జరుగుతున్న పరిణామాలు దేశవ్యాప్తంగా కలకలం సష్టిస్తున్నాయని అన్నారు. అమాయకపు విద్యార్థుల్లో మతవిద్వేషాలను రెచ్చగొట్టి విషపు విభజనలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పొరుగు రాష్ట్రంలో జరుగుతున్న ఈ వివాదాలు తమిళనాడులోకి చొరబడకుండా జాగ్రత్తపడాలని అన్నారు. ప్రగతిశీల శక్తులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయమిదని ట్వీట్ చేశారు.
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో హిజాబ్ ధరించిన విద్యార్థులను తరగతులకు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
హిజాబ్ వివాదం హేయనీయం : మలాలా
కర్నాటకలో కొనసా గుతున్న హిజాబ్ వివాదంపై నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జారు స్పందించారు. 'ముస్లిం బాలికల్ని హిజాబ్‌లతో పాఠశా లల్లోకి వెళ్లనివ్వకపోవడం అత్యతం హేయనీయం' అని పేర్కొన్నారు. ట్విట్టర్ వేదిక ద్వారా ఆమె స్పందించారు. 'చదువులు, హిజాబ్‌లు ఏదీ ముఖ్యమో ఎంచుకోవాలని కళాశాల బలవంతం చేస్తోంది. ఆడపిల్లలన్ని హిజాబ్‌లు ధరించి పాఠశాలకు వెళ్లనివ్వకపోవడం దారుణం. ముస్లిం మహిళలను చిన్న చూపు చూడటం భారత్‌లోని నేతలు ఆపాలి' అని ట్వీట్ చేశారు.