Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళితుడి పెండ్లి ఊరేగింపుపై రాళ్లతో దాడి
- సాంప్రదాయక టర్బన్లు ధరించారని దారుణం
- గుజరాత్‌లోని బానాస్కాంతలో ఘటన
న్యూఢిల్లీ : మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో పెత్తందార్లు రెచ్చిపోయారు. దళితుడి పెండ్లి ఊరేగింపుపై రాళ్లతో దాడికి దిగారు. పెండ్లి ఊరేగింపులో పాల్గొన్నవారు సాంప్రదాయక టర్బన్లను ధరించడంతో కోపోద్రేక్తులైన పెత్తందార్లు రెచ్చిపోయి ఈ దారుణానికి పాల్పడ్డారు. పలువురికి గాయలయ్యాయి.
పోలీసులు 28 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో ఆ గ్రామ సర్పంచ్ కూడా ఉండటం గమనార్హం. ఈ ఘటన గుజరాత్‌లోని బానాస్కాంతా జిల్లా మోటా గ్రామంలో చోటు చేసుకున్నది.
పోలీసులు, బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అతుల్ సెఖాలియా వివాహ ఊరేగింపు సోమవారం జరిగింది. ఊరేగింపులో భాగంగా అతుల్‌ను గుర్రం మీద తీసుకెళ్లడానికి ఆయన కుటుంబం నిర్ణయించింది. ఈ విషయం ఆ ఊరిలో పెత్తందార్లకు తెలిసింది. ఈ కార్యక్రమాన్ని జరపకూడదని పెండ్లి కొడుకు కుటుంబీకులను హెచ్చరించారు. తమ ఆదేశాలను కాదని ఈ ఊరేగింపును జరిపితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరించారు. పెత్తందారీ వర్గానికి చెందిన గ్రామ సర్పంచ్ ఆదివారం ఒక పంచాయతీని ఏర్పాటు చేసి పెండ్లి కొడుకు కుటుంబానికి ప్రత్యేకమైన ఆదేశాలను జారీ చేశారు. దళిత వర్గానికి చెందిన వ్యక్తులు గుర్రంపై ఎక్కి స్వారీ చేయకూడదనీ, ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయమని పంచాయతీలో సర్పంచ్ తెలిపారు.
దీంతో గొడవలు వద్దనుకొని గుర్రంపై ఊరేగింపు విషయంలో దళిత కుటుంబం వెనక్కి తగ్గింది. పెండ్లికి ముందు రోజు పోలీసుల భద్రతను కూడా కోరింది.
పోలీసుల సమక్షంలోనే సోమవారం పెండ్లి ఊరేగింపు జరిగింది. అయితే, ఈ పెండ్లి ఊరేగింపులో దళిత కుటుంబీకులు సాంద్రాయ టర్బన్లను ధరించారు. ఈ విషయం తెలుసుకున్న పెత్తందార్లు ఊరేగింపు దగ్గరకు చేరుకున్నారు. కులం పేరుతో దళిత కుటుంబాన్ని దూషించారు. అంతటితో ఆగకుండా ఊరేగింపుపై రాళ్ల వర్షం కురిపించి భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఈ హింసలో పెండ్లి కొడుకు బంధువులకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం పోలీసులు ఆ ఊరేగింపును అక్కడ నుంచి అతి కష్టం మీద దాటించారు. ఈ ఘటన అనంతరం అతుల్ సెఖాలియా తండ్రి వీరాభారు సెఖాలియా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు నిందితులపై ఎస్సీ, ఎస్టీ చట్టంతో పాటు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఈ కేసును ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ కుషాల్ ఓజాకు అప్పగించారు.