Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కర్నాటక హిజాబ్ వివాదంపై ఐద్వా
న్యూఢిల్లీ : ముస్లిం బాలికల హక్కులను పరిరక్షించడంలో కర్నాటక ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ (ఐద్వా) విమర్శించింది. ఈ మేరకు ఐద్వా జాతీయ అధ్యక్షురాలు మాలినీ భట్టాచార్య, ప్రధాన కార్యదర్శి మరియం ధావలే బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. హిజాబ్ వివాదాన్ని రేపి విద్యార్థినుల విద్యాహక్కును కాలరాయటం ఆమోదయోగ్యం కాదని ఆవేదన వ్యక్తంచేశారు. ముస్లిం బాలికల విద్యాహక్కును కాపాడే రాజ్యాంగ కర్తవ్యాన్ని నెరవేర్చేందుకు చొరవ చూపకుండా, కర్నాటక ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి సమస్యను మరింత తీవ్రతరం చేయటం దిగ్భ్రాంతికరమన్నారు. మైనారిటీ కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకొని.. బెదిరించే ప్రయత్నంలో ఉద్దేశపూర్వకంగానే ఈ వివాదాన్ని రగిలించారని విమర్శించారు. కాషాయ కండువాలు ధరించి జై శ్రీరాం అని అరుస్తూ దూకుడుగా ఉన్న యువకుల గుంపులు మతతత్వ శక్తుల వికారమైన ఎజెండాను బట్టబయలు చేస్తున్నాయని ఐద్వా నేతలు పేర్కొన్నారు. శాంతిభద్రతలు కాషాయమూకలు ఉసికొల్పిన పోకిరీలవల్లే దెబ్బతింటున్నాయనీ, హిజాబ్ ధరించిన అమ్మాయిల వల్ల కాదని స్పష్టంచేశారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం మత స్వేచ్ఛకు, ఆర్టికల్ 21-ఏ కింద విద్యా హక్కు, ఆర్టికల్ 21 ప్రకారం గౌరవ హక్కులను ఉల్లంఘించడమేనన్నారు. కర్నాటకలో ఇటీవలి పరిణామాలతో ముస్లిం బాలికలకు ఈ హక్కులన్నీ కాలరాయబడుతున్నాయని అందోళన వక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ నేతృత్వంలోని కాషాయదళం మైనారిటీలను లక్ష్యంగా చేసుకునే తన మత ఎజెండాను మరింత ముందుకు తీసుకెళ్లడానికి, ద్వేషపూరిత రాజకీయాలను ఉపయోగించుకునేలా వేగం పెంచిందని విమర్శిం చారు. విద్యాసంవత్సరం ముగిసే సమయానికి విద్యార్థుల చదువులకు అంతరాయం కలిగించడంతోపాటు.. ముఖ్యంగా ముస్లిం బాలికల విద్యావకాశాలపై ప్రతికూల ప్రభావం చూపేలా రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు, చట్టాలను ఏకపక్షంగా మార్చాలనుకోవడం దారుణమని ఐద్వా నేతలు తెలిపారు. ముస్లిం బాలికలకు పూర్తి రక్షణ కల్పించాలనీ, కళాశాలల్లో తరగతులకు హాజరయ్యేలా వారికి సహాయం చేయాలని ఐద్వా నేతలు డిమాండ్ చేశారు. హిజాబ్‌తో సంబంధం లేకుండా.. ముస్లిం బాలికలందరూ తమ విద్యను కొనసాగించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. మతవాద, ఛాందసవాద శక్తులు విద్యార్థులను విభజించేలా చేస్తున్న కుట్రను తిప్పికొట్టాలని, విద్యాసంస్థల్లో లౌకిక వాతావరణాన్ని దెబ్బతీయకుండా నిరోధించాలని చెప్పారు.