Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యుూపీ ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ స్వోత్కర్ష
షహరాన్‌పూర్ : యూపీలో మొదటి దశ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో షహరాన్‌పూర్‌లో గురువారం జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగం పూర్తిగా స్వోత్కర్షలతో నిండిపోయింది. మళ్లీ బీజేపీ ప్రభుత్వం వస్తేనే ముస్లిం మహిళలకు రక్షణ వుంటుందని చెప్పుకున్నారు. దేశంలోని ముస్లిం మహిళల హక్కులను, అభివృద్ధిని నిరోధించేందుకు కొంతమంది వ్యక్తులు కొత్త మార్గాలను కనుగొంటున్నారని మోడీ వ్యాఖ్యానించారు. ముస్లిం మహిళలు వేధింపులకు గురి కాకుండా వుండాలంటే ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం తప్పనిసరని చెప్పుకున్నారు. ''మూడుసార్లు తలాక్ చెప్పడమనే సాంప్రదాయం నుంచి ముస్లిం మహిళలకు బీజేపీ ప్రభుత్వం స్వేచ్ఛ ప్రసాదించింది. ముస్లిం మహిళలు బహిరంగంగానే మోడీ ప్రభుత్వానికి మద్దతిస్తుండడంతో ప్రత్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. అయినా మేం ప్రతీ ముస్లిం మహిళకు బాసటగా వుంటాం'' అని మోడీ పేర్కొన్నారు. కర్నాటకలో హిజాబ్ వివాదంపై పెద్ద రాద్ధాంతం జరుగుతున్న నేపథ్యంలో మోడీ వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఉత్తరప్రదేశ్‌లో ఘర్షణలు తలెత్తకుండా వుండాలన్నా, మహిళలు నిర్భయంగా వుండాలన్నా, నేరస్తులను జైళ్లకు పంపాలన్నా ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం వుండడం తప్పనిసరని మోడీ చెప్పుకున్నారు. సమాజ్‌వాదీ పార్టీ, దాని మిత్రపక్షాలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. వారికి వారసత్వ రాజకీయాల పట్ల విశ్వాసం వుందన్నారు. వారు కుటుంబ పరిధిని మించి చూడలేరు, మాఫియాల ద్వారానే అంతా జరిపించేస్తూ వుంటారని విమర్శించారు. వారు అధికారంలోకి వస్తే వ్యాక్సిన్లు అమ్ముకుంటారు, ఇక ప్రజలకు కోవిడ్‌తో చావుబతుకుల పోరాటమేనని వ్యాఖ్యానించారు. ఎలాగూ అధికారంలోకి రాలేరు, కాబట్టే ఏ వాగ్దానాలైనా వారు చేసేస్తున్నారని అన్నారు. అటువంటి బడా వాగ్దానాల్లో చాలావరకు బూటకమేనని అన్నారు.