Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తాడేపల్లి/గుంటూరు :ఐద్వా నాయకురాలు, తెలంగాణ సాయుధ విప్లవ పోరాట యోధుడు, కార్మికోద్యమ నేత అమరజీవి పర్సా సత్యనారాయణ సతీమణి, పర్సా భారతి (92) గురువారం ఉదయం గుంటూరులోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. సత్యనారాయణ, భారతి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. చిన్న అల్లుడు మంతెన సీతారాం సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా ఉన్నారు. మూడు రోజుల క్రితం బాత్రూంలో జారి పడడంతో చెయ్యి ఫ్రాక్చర్ అయింది. వయో వృద్ధ సమస్యలు కూడా దీనికి తోడవడంతో ఆరోగ్యం క్షీణించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. భారతి భౌతిక కాయాన్ని తాడేపల్లిలోని సుందరయ్యనగర్ సీపీఐ(ఎం) ఆఫీసు వద్ద గంటసేపు ఉంచి, తరువాత విజయవాడలోని విద్యుత్ శ్శశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆమె భౌతిక కాయం పై ఎర్రజెండా కప్పి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వి కృష్ణయ్య అధ్యక్షతన జరిగిన సంతాప సభలో వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ, పర్సా భారతి జీవితం ఉద్యమాలతో ముడిపడిఉందని అన్నారు. ఆయనకు అన్ని విషయాల్లోను భారతి చేదోడువాదోడుగా నిలిచారని కొనియాడారు. సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు, ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు మాట్లాడుతూ, పర్సా సత్యనారాయణను పెండ్లి చేసుకున్నప్పటి నుంచి ఆమె కమ్యూనిస్టు ఉద్యమ ప్రస్థానం మొదలైందనీ, అనేక కష్ట నష్టాలకోర్చి కమ్యూనిస్టు ఉద్యమ బలోపేతానికి, మహిళా సంఘం నిర్మాణానికి కృషి చేశారన్నారు. ఆమెకు ఖమ్మం జిల్లాతో విడదీయరాని అనుబంధం ఉందన్నారు. ఆమె మృతికి సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ తరపున, జిల్లా కమిటీ తరపున ప్రగాఢ సంతాపాన్ని, ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.
రాఘవులు, తమ్మినేని సంతాపం
ఆమె మృతికి సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు, తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సంతాపం తెలిపారు. ఆమె ఐద్వా, కార్మిక సంఘాల్లో చురుగ్గా పాల్గొనేవారని పేర్కొన్నారు. పార్టీకోసం అంకిత భావంతో పనిచేశారని ఆమె సేవలను కొనియాడారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు.