Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హిజాబ్ వివాదంతో మళ్లీ తెరపైకి మత స్వేచ్ఛపై కేసు
- రెండేండ్లుగా సుప్రీంలో పెండింగ్
న్యూఢిల్లీ : కర్నాటకలో గత కొద్ది రోజులుగా నలుగుతున్న హిజాబ్ వివాదం, మత స్వేచ్ఛ పరిధికి సంబంధించి గతంలో నమోదైన కేసుపై తిరిగి దృష్టి సారించేలా చేసింది. ఈ కేసు రెండేళ్ల నుంచి తొమ్మిది మంది న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనం ముందు పెండింగ్‌లో వుంది. ఈ కేసులో చివరి ఉత్తర్వులు 2020 ఫిబ్రవరి 17న వెలువడ్డాయి. ఆ మరుసటి రోజునే మళ్లీ విచారణ జరిగేలా చూడాలని ఆదేశించినా, కోవిడ్ తలెత్తడానికి ముందుగానే ఈ విచారణ తేదీల నిర్ణయంలో సుప్రీం కోర్టు కూడా వెనుక బడింది. ఆ తర్వాత అప్పటి ప్రధాన న్యాయమూర్తి ఎస్ఎ బాబ్డే పదవీ విరమణ చేశారు. ఆయనతోపాటు బెంచిలో వున్న వారిలో ముగ్గురు న్యాయమూర్తులు కూడా భానుమతి, అశోక్ భూషణ్, సుభాష్ రెడ్డి రిటైరయ్యారు. జస్టిస్ మోహన్ ఎం.శంతన్‌గౌడర్ మరణించారు. ఇక ఈ బెంచ్‌లో వుండి ఇప్పటికీ పనిచేస్తున్న వారిలో జస్టిస్ ఎల్.నాగేశ్వర్ రావు, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, జస్టిస్ బిఆర్ గవారు, జస్టిస్ సూర్యకాంత్ మాత్రమే వున్నారు. వీరిలో జస్టిస్ రావు పదవీ కాలం ఈ ఏడాది జూన్‌తో ముగుస్తోంది.శబరిమల కేసులో వయసులో వున్న మహిళలు ఆలయంలోకి ప్రవేశించే హక్కును సుప్రీం సమర్ధించిన నేపథ్యంలో తలెత్తిన కంటారు రాజీవరు వర్సెస్ ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ కేసును తొమ్మిది మంది న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనానికి నివేదించారు. శబరిమల కేసు సమీక్షకు నేరుగా సమాధానమివ్వడానికి బదులుగా కోర్టు దాని పరిధిని విస్తరించింది. వివిధ మతాల మతస్వేచ్ఛపై చట్టానికి సంబంధించిన ఏడు ప్రశ్నలను విస్తృత బెంచ్‌కు నివేదించింది. 2020 ఫిబ్రవరి 10న అప్పటి ప్రధాన న్యాయమూర్తి బాబ్డే నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం రివ్యూ బెంచ్ నిర్ణయాన్ని సమర్ధించింది.
ఆ ఏడు ప్రశ్నలు
తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం నుంచి సమాధానం కోసం పెండింగ్‌లో వున్న ఆ ఏడు ప్రశ్నలు -
1.రాజ్యాంగంలోని 25వ అధికరణ కింద మత స్వేచ్చ హక్కు పరిధి ఏ మేరకు వుంటుంది.
2.రాజ్యాంగంలోని 25వ అధికరణ కింద వ్యక్తులకు గల హక్కులు, 26వ అధికరణ కింద మతపరమైన తెగకు గల హక్కులు మధ్య పరస్పర సంబంధం ఏమిటి?
3. మతపరమైన తెగకు గల హక్కులు శాంతి భద్రతలు, నైతికత, ఆరోగ్యం వంటివాటితో సంబంధం లేకుండా రాజ్యాంగంలోని పార్ట్ 3లోని ఇతర నిబంధనలకు లోబడి వుంటాయా లేదా?
4. 25, 26 అధికరణల కింద నైతికత అనే పదం పరిధి ఏ మేరకు వుంటుంది. రాజ్యాంగ నైతికతలోకి దీన్ని చేర్చడానికి ఉద్దేశించబడిందా లేదా?
5. 25వ అధికరణలో ప్రస్తావించిట్లుగా మతపరమైన ఆచారాలకు సంబంధించి న్యాయ సమీక్ష పరిధి ఎంతవరకు వుంటుంది?
6. 25వ అధికరణ (2) (బి)లో పేర్కొన్నట్లుగా 'హిందూ వర్గాలు' అన్న వ్యక్తీకరణకు అర్థం ఏమిటి?
7. ఒక మతపరమైన తెగ లేదా గ్రూపునకు చెందని వ్యక్తి పిల్ దాఖలు చేయడం ద్వారా ఆ మత తెగ లేదా గ్రూపునకు సంబంధించి ఆచారాన్ని ప్రశ్నించవచ్చా?