Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 40 శాతానికి పైగా ఖాళీలు
- ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల నుంచి ప్రాతినిథ్యం అంతంతే..
న్యూఢిల్లీ : దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీల్లో అధ్యాపక పోస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 23 ఐఐటీల్లో 40 శాతానికి పైగా పోస్టులు భర్తీకి నోచుకుండా ఉన్నాయి. లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర విద్య మంత్రిత్వ శాఖ ఈ సమాచారాన్ని వెల్లడించింది. కేంద్రం మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం.. ఐఐటీల్లో మొత్తం 6,511 మంది అధ్యాపక సిబ్బంది ప్రస్తుతం పని చేస్తున్నది. 4,370 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రిజర్వ్డ్ కేటగిరి నుంచి ఫ్యాకల్టీ ప్రాతినిధ్యం పేలవంగా ఉన్నది. 6,511 మందిలో 12 శాతం మంది మాత్రమే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈబీసీ వర్గాల నుంచి ఉన్నారు. అయితే, కేటగిరి వారీగా మాత్రం వివరాలు వెల్లడించకపోవడం గమనార్హం. కాగా, 2021 డిసెంబర్లో అందించిన సమాచారం ప్రకారం ఎస్టీ నుంచి 32 మంది, ఎస్సీ నుంచి 183 మంది, ఓబీసీ వర్గాల నుంచి 462 మంది ఉన్నారు. రిజర్వేషన్ పాలసీల ప్రకారం ఎస్సీలకు 7.5 శాతం, ఎస్టీలకు 15 శాతం, ఓబీసీలకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్‌లకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాలి.
ఇక పాత, పెద్ద ఐఐటీలలో ఐఐటీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్) ధన్బాద్లో 57.2 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో 53.4 శాతం భర్తీకి నోచుకోకుండా ఉన్నాయి. ఐఐటీ ఢిల్లీలో మాత్రం తక్కువగా 9.4 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే, ఇక్కడ రిజర్వ్ కేటగిరి నుంచి మాత్రం ప్రాతినిధ్యం 6.5 శాతంగానే ఉండటం గమనార్హం. ఐఐటీ బాంబేలో ప్రాతినిథ్యం చాలా పేలవంగా ఉన్నది. ఇక్కడ 693 మందికి గానూ 3.8 శాతం మంది మాత్రమే రిజర్వేషన్ కేటగిరి నుంచి ఉన్నారు.