Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీని కేరళలా చూడాలనుకుంటున్నారు..
తిరువనంతపురం, న్యూఢిల్లీ : యూపీని కేరళ, బెంగాల్‌లా మార్చవద్దంటూనే పరోక్షంగా బీజేపీకి ఓటు వేయాలంటూ అక్కడి ప్రజలను సీఎం యోగి హెచ్చరిస్తూ విడుదలైన ఓ వీడియోపై,కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కాంగ్రెస్ తదితర పార్టీల నేతలు కౌంటర్ ఇచ్చారు. యూపీని కేరళలాగా చూడాలని అక్కడి ప్రజ లు కోరుకుంటున్నారని విజయన్ తెలిపారు. ఆ రాష్ట్రం కేరళలా మారితే అక్కడి ప్రజలకు ఉత్తమ విద్య, ఆరోగ్య సేవలు, సామాజిక సంక్షేమం, మెరుగైన జీవన ప్రమాణాలు లభిస్తాయని కేరళ సీఎం అన్నారు. కేరళ ప్రజలు మత సామరస్యంతో ఐక్యంగా ఉంటారనీ.. యూపీ ప్రజలు అదే కోరుకుం టున్నారని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో మాదిరిగా మతం, కులాల పేరుతో ప్రజలను హత్య చేయడం వంటి దారుణాలు ఉండవని తెలిపారు.
అన్నింటిలో కేరళ అగ్రస్థానం : ఏచూరి
'మోడీ ప్రభుత్వ హయాంలో నిటి ఆయోగ్ ఎస్డీజీ ఇచ్చిన ర్యాంకింగ్ ప్రకారం మానవాభివృద్ధిలో కేరళ అగ్రస్థానంలో ఉంది. ఉత్తర ప్రదేశ్ అట్టడుగు స్థానంలో ఉంది' అని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ట్వీట్ చేశారు. 'ప్రభుత్వ పనిపరంగా కేరళ నిరంతరం ఉత్తమ రాష్ట్రంగా ఉంది. ఉత్తర ప్రదేశ్ అత్యంత చెత్తగా ఉంది. సీఎం యోగికి ఇది కూడా తెలియదా? కేరళ ప్రభుత్వం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైంది. ఇది పబ్లిక్ మాండేట్‌కు బహిరంగ సవాలు కాదా? ఇతర అంశాల వలే ఎన్నికల కమిషన్ దీనిపై ఏమీ చెప్పదా?' అని తెలిపారు.
యోగి భయపడుతున్నారు : శశిథరూర్
యూపీ కాశ్మీర్, బెంగాల్, కేరళలా మారితే.. బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం కోల్పోతామని యోగి భయపడుతున్నారని కాంగ్రెస్ నేత శశిథరూర్ ఎద్దేవా చేశారు. కాశ్మీర్ ప్రకృతి సౌందర్యం, బెంగాల్ సంస్కృతి, కేరళ విద్య ఆ రాష్ట్రాలను ఉత్తమంగా నిలబెట్టాయని, అద్భుతంగా నిలిచేలా చేశాయని పేర్కొన్నారు. యుపికి ఆ అదృష్టం లేదని, అక్కడి ప్రభుత్వంపై జాలి పడాలని విమర్శించారు.