Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హిందూ దేశంగా భారత్
- కర్నాటక మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
బెంగళూరు : బీజేపీ పాలిత రాష్ట్రం కర్నాటకలో ఇప్పటికే హిజాబ్ వంటి సున్నితమైన అంశం కొనసాగుతున్నది. ఈ విషయంలో రాష్ట్రవ్యాప్తంగా చర్చ నడుస్తున్నది. ఇలాంటి తరుణంలో బీజేపీ నాయకుల వివాదాస్పద వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. బాధ్యత గల మంత్రి పదవుల్లో ఉండి కూడా రాజ్యాంగ విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారు. జాతీయ పతాకం విషయంలో కర్నాటక మంత్రి కేఎస్ ఈశ్వరప్ప ఇలాంటి ప్రకటనే చేశారు. భవిష్యత్తులో త్రివర్ణ పతాకం స్థానాన్ని కాషాయ జెండా భర్తీ చేయొచ్చని అన్నారు. '' భవిష్యత్తులో త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండా భర్తీ చేసే అవకాశం ఉండొచ్చు.ఇందుకు వందేండ్లు కానీ, రెండు వందల ఏండ్లు కానీ, ఐదు వంద ల ఏండ్లుగానీ పట్టొచ్చు. కాషాయ జెండాను ప్రతి చోటా ఎగరేస్తాం. నేడు లేదా రేపు, భారత్ ఒక హిందూ దేశమవుతుంది. ఏమైనప్పటికీ త్రివర్ణ పతాకం ప్రస్తుతం మన జాతీయ పతాకం.దానిని ప్రతి ఒక్కరూ గౌరవించాలి. జాతీయ జెండాను గౌరవించనివారు దేశద్రోహి'' అని మంత్రి అన్నారు.కాగా, కాషాయ జెండా.. జాతీయ జెండాను భర్తీ చేయొచ్చన్న మంత్రి వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాజకి కార్యకర్తలు, పౌర సంఘాల నాయకులు మంత్రి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్య మాల్లో పోస్టులు పెడితే దేశద్రోహ చట్టం కింద కేసులు నమోదవుతాయనీ, మంత్రి పైనా ఇలాంటి కేసులు పెడతారా? అని నెటిజన్లు ప్రశ్నించారు.