Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రశ్నించిన మద్రాసు హైకోర్టు
- డ్రెస్ కోడ్లపై చెలరేగుతున్న వివాదాలపై ఆవేదన
చెన్నై : మతపరమైన భావాలను రెచ్చగొట్టేందుకు మతపరమైన వస్త్రధారణకు సంబంధించిన అంశాలను లేవదీయడం, వాటిని వివాదాస్పదం చేయడం పట్ల మద్రాసు హైకోర్టు గురువారం ఆవేదన వ్యక్తం చేసింది. ఆలయ సముదాయాల్లోకి హిందువులను మాత్రమే అనుమతించాలని, పైగా నాస్తికుల ప్రవేశాన్ని నిరోధించేందుకు గానూ సముచితమైన దుస్తులు ధరించడమే కాకుండా, నుదుటిపై సనాతన ధర్మానికి సంబంధించిన గుర్తులను కూడా పెట్టుకోవాలని పట్టుబట్టిన రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను కోర్టు విచారిస్తోంది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మునీశ్వర్ నాథ్ భండారి, జస్టిస్ డి.భారత చక్రవర్తిల ముందుకు ఈ రెండు కేసులు విచారణకు వచ్చాయి. కేవలం సందర్శన (సైట్ సీయింగ్) కోసం ఆలయాల్లోపలికి హిందూయేతరులు, విదేశీయులు ప్రవేశించరాదని శ్రీరంగానికి చెందిన రంగరాజన్ నరసింహన్ పట్టుబడుతున్నారు. హిందువులు కూడా శుభ్రంగా శుచిగా స్నానం చేసి, సక్రమంగా దుస్తులు అంటే ధోతి, కుర్తా పైజామా, చీర, ఓణి, సల్వార్ కమీజ్ వంటి సాంప్రదాయ దుస్తులు ధరించి రావాలని, అటువంటి వారినే ఆలయాల్లోకి అనుతించాలని పట్టుబడుతున్నారు. యువతకు డ్రెస్ కోడ్‌ను సూచించడంతో పాటు హిందూ పిల్లలు పూర్తిగా శరీరాన్ని కప్పి వుంచిన దుస్తులు ధరించాలని కోరుతున్నారు. ఈ అంశంపై వాదోపవాదాలు జరుగుతున్న సమయంలో, తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మునీశ్వర్ భండారీ మాట్లాడుతూ, ''ఇక్కడ ప్రాధాన్యత దేనికి? దేశానికా? లేదా మతానికా?'' అని ప్రశ్నించారు. 'కొంతమంది హిజాబ్‌కు అనుకూలంగా, మరికొంతమంది ఆలయాల్లో ధోతిలతో రావాలంటూ వాదించడం చూస్తుంటే నిజంగా దిగ్భ్రాంతి కలుగుతోంది. మీరు దేశానికి ఏం సందేశం పంపాలనుకుంటున్నారు? ఇది ఒక్క తాటిపై నిలబడ్డ దేశమేనా లేక మతం ప్రాతిపదికగా చీలిపోయిన దేశమా?' అని ఆవేదనతో ప్రశ్నించారు. దీనికి పిటిషనర్ సమాధానమిస్తూ, 'దేశ ఐక్యత గురించి ఎలాంటి సందేహాలు అవసరం లేదు. కానీ, హిందూ దేవాలయాల్లో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమం ఆగమ శాస్త్రాల ప్రకారమే జరగాలని స్పష్టం చేశారు. ఆగమ శాస్త్రం ప్రకారం హిందూయేతరులు ఆలయ ఆవరణలోకి ప్రవేశించరాదు. హిందూ మత, ధార్మిక, దేవాదాయ (హెచ్ఆర్సిఇ) విభాగం ఈ శాస్త్రాలను ఉల్లంఘిస్తోందని' ఆరోపించారు. మరోవైపు అడ్వకేట్ జనరల్ ఆర్.షణ్ముగ సుందరం కోర్టుకు సమాధానమిస్తూ, విదేశీయులు, హిందూయేతరులను ఆలయాల్లో ధ్వజస్తంభం వరకే అనుమతిస్తున్నామని, గర్భగుడి వరకు వారిని రానివ్వడం లేదని తెలిపారు. నిర్దిష్ట దూరం తర్వాత హిందూయేతరులు ఆలయంలోకి రాకూడదనే నోటీసులు అన్ని ఆలయాల్లో పెట్టామని చెప్పారు. దీనిపై సవివరమైన కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలుచేస్తామని చెప్పారు. దానిపై దేవాదాయ విభాగానికి నోటీసులు ఇవ్వాల్సిందిగా న్యాయమూర్తులు ఆదేశించారు. హిందూ భక్తులకు డ్రెస్ కోడ్‌ను విధించాలన్న కేసుకు సంబంధించి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ, ఏ ఆలయాలకు ఆ ఆలయాల్లో వారి ఆచారాల ప్రకారం డ్రెస్‌కోడ్‌ను విధించుకోవచ్చని అన్నారు. కేరళలో కొన్ని ఆలయాలు పురుషులు చొక్కాలు లేదా కుర్తాలు వేసుకుని లోపలకు రావడాన్ని ఆనుమతించవని గుర్తు చేశారు. కన్యాకుమారి జిల్లాలోని శుచింద్రం ఆలయంలో కూడా ఇదే పద్ధతి వుందన్నారు. 2015 డిసెంబరులో హైకోర్టులోని ఏకసభ్య ధర్మాసనం ఆలయాలకు వెళ్లేవారికి డ్రెస్‌కోడ్‌ను విధించారని,కానీ దాన్ని సవాలు చేయగా, జస్టిస్ వి.రామసుబ్రమణియన్ (ఇప్పుడు సుప్రీం న్యాయమూర్తి) ఆ నిర్ణయాన్ని తిరిగి సవరించిన విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. ఆలయాల్లో సందర్శన కోసం డ్రెస్ కోడ్‌ను విధించాలని రుజువు చేసేలా ఏదైనా సాక్ష్యాధారాలను అందజేయాలంటూ నరసింహన్‌కు కోర్టు పది రోజుల గడువును ఇచ్చింది.