Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ కరెన్సీలు 'తులిప్ పువ్వు' లాంటివి
- మునిగితే ఎవరికి వారే బాధ్యులు
- ఆర్బీఐ గవర్నర్ హెచ్చరిక
- కీలక వడ్డీ రేట్లు యథాతథం
న్యూఢిల్లీ : క్రిప్టో కరెన్సీలతో భారత దేశ ఆర్థిక స్థిరత్వానికి పెను ముప్పు అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. మూడు రోజుల పాటు సాగిన ఆర్బీఐ ద్వై మాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను గురువారం శక్తికాంతదాస్ మీడియాకు వెల్లడించారు. వరుసగా 10వ సారి భేటీలోనూ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్టు వెల్లడించారు. ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2022-23 బడ్జెట్లోని ప్రధానాంశాలను చర్చించినట్లు తెలిపారు. ద్రవ్యలోటు, మూలధన ప్రణాళికలు, ప్రభుత్వ మార్కెట్ రుణ సమీకరణల వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో సమీక్షించామన్నారు. క్రిప్టో కరెన్సీల అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఈ కరెన్సీలకు ఎలాంటి విలువ ఉండదని హెచ్చరించారు. కనీసం 'తులిప్ పువ్వు' విలువ కూడా చేయవన్నారు. క్రిప్టోలవి ఊహాజనిత విలువ అని.. 17వ శతాబ్దం నాటి 'తులిప్ పువ్వ' సంక్షోభంతో అభివర్ణించా రు.17న శతాబ్దంలో డచ్లోని ఇన్వెస్టర్లు ఒక్కసారిగా తులిప్ పువ్వులపై పెట్టుబడులు పెట్టడంతో వాటి ధరలు అమాంతం పెరిగాయి. సగటు తులిప్ పువ్వు ధర నైపుణ్యం గల కార్మికుడి వార్షిక ఆదాయం కంటే ఎక్కువగా పలికింది. అలా మూడేండ్ల పాటు ఈ తులిప్ మానియా కొనసాగి ఆ తర్వాత ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆ పువ్వులను కొనేవాడు కూడా దిక్కు లేకుండా పోయాడు. ఊహాజనిత ఆర్థిక బుడగల చరిత్రలో ఇదే మొదటిదని చరిత్రకారులు చెబుతారు. క్రిప్టో కరెన్సీలను ఏ పేరుతో పిలిచిన అవి దేశ సూక్ష్మ ఆర్థిక గణంకాలు, ఆర్థిక స్థిరత్వానికి పెను ముప్పులా మారనున్నాయని దాస్ హెచ్చరించారు. ఆర్థిక స్థిరత్వం కోసం ఆర్బీఐ చేపడుతున్న చర్యలను బలహీనపర్చనున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సొంత పూచీకత్తు పైనే మదుపర్లు వాటిపై పెట్టుబడులు పెట్టుకోవాలని స్పష్టం చేశారు.
ఎమర్జెన్సీ హెల్త్ సర్వీస్, కాంటాక్టింగ్ ఇంటెన్సివ్ సర్వీస్ల కోసం గత జూన్లో మొత్తం రూ.65 వేల కోట్ల రుణాలు కేటాయించాల్సిందిగా బ్యాంకులను ఆదేశించామని దాస్ తెలిపారు. కరోనా భయాలు పూర్తిగా తొలగనందున ఈ పథకాన్ని 2022 జూన్ 30 వరకు పొడిగిస్తున్నామన్నారు. నిధుల లభ్యత పెరగడం వల్ల వైద్య రంగంలో మౌలిక సదుపాయాలు మరింతగా మెరుగవుతాయని దాస్ విశ్వాసం వ్యక్తం చేశారు.
సమీక్షా ప్రధానాంశాలు..
- ఆర్థిక సంవత్సరం 2022-23లో 7.8 శాతం వృద్థి ఉండొచ్చు.
- రెపోరేటు 4 శాతంగా, రివర్స్ రెపోరేటు 3.35 శాతంగానే కొనసాగింపు.
- నిత్యావసర వస్తువుల ధరలుఅదుపులో ఉంటాయి.
- 2022-23లో ద్రవ్యోల్బణం 4.5 శాతానికి పరిమితం కావొచ్చు.
- ఇంతక్రితం ఏడాదిలో ద్రవోల్బణం5.7 శాతంగా ఉంది.
- సెప్టెంబర్,డిసెంబర్ త్రైమాసికాలపై ఒమిక్రాన్ ప్రభావం పెద్దగా లేదు.
- కోవిడ్ ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుంది.
- వాణిజ్యబ్యాంకుల పనితీరు మెరుగుపడుతోంది.