Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లఖింపూర్ ఖేరీలో రైతులను కారుతో చంపిన కేంద్రమంత్రి తనయుడు..
- పెద్ద నేరస్థుడికి బెయిల్ ఇవ్వటం బాధాకరం :ఏఐకేఎస్
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో జరిగిన హింసాత్మక సంఘటన కేసులో కీలక నిందితుడు ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు గురువారం బెయిలు మంజూరు చేసింది. గత అక్టోబరు 3న జరిగిన ఈ సంఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆశిష్‌ను గతేడాది అక్టోబరు 9న అరెస్టు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న రైతులపై నుంచి వాహనాలు దూసుకెళ్ళడంతో నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కీలక నిందితుడని ప్రత్యేక దర్యాప్తు.బృందం (సిట్) తమ చార్జిషీట్లో ఆరోపించింది. అదే నెలలో అరెస్టు చేశారు.
బెయిల్ న్యాయవిరుద్ధం. ఏఐకేఎస్
పెద్ద నేరస్థుడికి బెయిల్ దురదృష్టకరమని ఏఐకేఎస్ విమర్శించింది. అక్టోబరు 3న ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో నలుగురు రైతులు, జర్నలిస్టు హత్యలో ప్రధాన హంతకుడైన ఆశిష్ మిశ్రా తేనీకి బెయిల్ మంజూరు చేస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఈ మేరకు గురువారం ఏఐకేఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్ దావలే, హన్నన్ మొల్లా ప్రకటన విడుదల చేశారు. ఆశిష్ మిశ్రాకి బెయిల్ న్యాయ విరుద్ధమని, కుట్ర జరిగిందని సుప్రీం కోర్టు నేతృత్వంలోని సిట్ అభిప్రాయపడుతుండగా బెయిల్ ఇవ్వడం దారుణమని అన్నారు. ఆశిష్ మిశ్రా, ఇతరులపై ఐపీసీలోని సెక్షన్ 302 (హత్య), సెక్షన్ 307 (హత్య ప్రయత్నం), ఇతర అత్యంత తీవ్రమైన సెక్షన్ల కింద అభియోగాలు మోపబడ్డాయని తెలిపారు. ఇది అత్యంత దురదష్టకరమైన హైకోర్టు తీర్పు అని న్యాయ ప్రమాణాలకు విరుద్ధమని పేర్కొన్నారు. ''ఈ క్రూరమైన నేరాన్ని విచారించిన సుప్రీంకోర్టు నియమించిన సిట్ ఇది ప్రమాదం కాదని, స్పష్టమైన కుట్ర అని నిర్ధారణకు వచ్చింది. సిట్ తీర్పు ఇలా ఉండగా నేటి తీర్పు ప్రజల్లో తీవ్ర అసహనానికి గురి చేసింది'' అని తెలిపారు.
లఖింపూర్ ఖేరీ ఊచకోత జరిగిన వెంటనే ఆశిష్ మిశ్రా తండ్రి అజయ్ మిశ్రాను క్యాబినెట్ నుంచి తక్షణమే తొలగించాలని ఎస్‌కెఎం, ఎఐకెఎస్ డిమాండ్ చేశాయి. ఈ ఊచకోత క్రిమినల్ సూత్రధారి, కేంద్ర హౌం వ్యవహారాల సహాయ మంత్రి అజరు మిశ్రా టెనీని హత్య, కుట్ర అభియోగాల కింద తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశాయని తెలిపారు. ఈ కేసులో ఇతర నేరస్తులందరినీ అరెస్టు చేయాలని కోరాయని అన్నారు.
''ఈ భయంకరమైన హత్యాకాండ జరిగి నాలుగు నెలలు గడిచినా ప్రధాని మోడీ, హౌం మంత్రి అమిత్ షా రాజకీయ నైతికతలను గాలికి వదిలి, సిగ్గులేకుండా హంతకుడు, కుట్రదారు అజరు మిశ్రా తేనిని కేంద్రమంత్రిగా కొనసాగిస్తున్నారు. పైగా ఆశిష్ మిశ్రా టెనీకి బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువడింది'' అని అన్నారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రైతులు, ప్రజలు తమ సంకల్పాన్ని రెట్టింపు చేయాలని, రాబోయే కాలంలో ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల, మతతత్వ, నిరంకుశ, అనైతిక బీజేపీని ప్రతిధ్వనించేలా ఓడించడానికి తమ ప్రయత్నాలను విస్తృతం చేయాలని ఏఐకేఎస్ పిలుపు నిస్తుందన్నారు.