Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని మోడీకి ఎఐకెఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా బహిరంగ లేఖ
న్యూఢిల్లీ : టైర్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటుచేసేందుకుగాను టైర్ కార్పొరేట్ కంపెనీలపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విధించిన జరిమానాకు సమానంగా రబ్బరు రైతులకు గ్రాంట్‌గా ఇవ్వాలని ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆయన బహిరంగ లేఖ రాశారు. ''టైర్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటుచేసేందుకు గాను టైర్ కార్పొరేట్ కంపెనీలపై సీసీఐ విధించిన జరిమానా మొత్తానికి సమానంగా రూ.1,788 కోట్లు రబ్బరు రైతులకు గ్రాంట్‌గా అందించాలని కోరారు. ఎంఆర్ఎఫ్పై రూ. 622.09 కోట్లు, అపోలో టైర్స్‌పై రూ.425.53 కోట్లు, సియట్ లిమిటెడ్‌పై రూ. 252.16 కోట్లు, జెకె టైర్‌పై రూ. 309.95 కోట్లు, బిర్లా టైర్స్, ఆటోమోటివ్ టైర్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఏటీఎంఏ)పై రూ. 178.33 కోట్లు కాంపిటేషన్ చట్టంలోని సెక్షన్ కింద సీసీఐ జరిమానా విధించింది'' అని తెలిపారు.
''1994 ఏప్రిల్ 1న అప్పటి పివి నరసింహారావు ప్రభుత్వం సంతకం చేసిన డబ్ల్యూటీఓ ఒప్పందం, 2009 ఆగస్టు 13న అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం సంతకం చేసిన ఆసియన్ ఒప్పందం సహజ రబ్బరును పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవడానికి మార్గం సుగమం చేసింది. దిగుమతి సుంకాన్ని తగ్గించడం వల్ల దేశీయ మార్కెట్లో రబ్బర్ ధర 2010లో కిలో రూ.245 నుండి కిలోకు రూ. 65-70కు పడిపోయింది. దేశంలో 90శాతం రబ్బరు ఉత్పత్తి కేరళలో ఉంది. సహజ రబ్బరు ధర భారీ పతనం ఫలితంగా 2010-11 సంవత్సరంలో ఒక్క కేరళలోనే రబ్బరు రైతులకు రూ.11,600 కోట్ల నష్టం వాటిల్లింది. 2010లో కిలో సహజ రబ్బరు ధర రూ.245ను బెంచ్ మార్క్‌గా అంచనా వేసినప్పుడు, ధరల పతనం కారణంగా గత పదేళ్లలో కేరళలోని రబ్బరు రైతులు రూ.60,000 కోట్లకు తగ్గకుండా నష్టపోయారని వెల్లడైంది.
సహజ రబ్బరు ధర పడిపోయినప్పటికీ, ఆటోమోటివ్ టైర్ల ధర తగ్గలేదు. ఏటీఎంఏ క్రియాశీల సహాయంతో కార్టెల్‌లను ఏర్పాటు చేయడం ద్వారా రైతులను, వినియోగదారులను దోచుకోవడం ద్వారా టైర్ తయారీదారులు భారీ లాభాలను సంపాదించడానికి ఇది సహాయపడింది'' అని చెప్పారు.
''ఈ నేపథ్యంలో ఆగస్ట్ 2018లో ఐదు టైర్ల తయారీ కంపెనీలు, ఏటీఎంఏపై వాచ్డాగ్ మొత్తం రూ.1,788 కోట్ల జరిమానా విధించింది. 2011-12 మధ్య కాలంలో పోటీ చట్టంలోని సెక్షన్ 3ను ఉల్లంఘించినట్టు వారు గుర్తించారు. ఈ విభాగం పోటీ వ్యతిరేక ఒప్పందాలను నిషేధిస్తుంది. పోటీ వ్యతిరేక పద్ధతులకు మొత్తం రూ.1,788 కోట్లకు పైగా జరిమానాలు విధిస్తూ రెగ్యులేటర్ల ఉత్తర్వులను సవాలు చేస్తూ టైర్ కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఉత్పత్తి, దేశీయ విక్రయాలు, టైర్ల ఎగుమతిపై కంపెనీ వారీగా, సెగ్మెంట్ వారీగా డేటా రియల్ టైమ్ ప్రాతిపదికన సేకరించి, సంకలనం చేసిందని కమిషన్ కనుగొంది'' అని గుర్తు చేశారు.
''బీజేపీ తన 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో అధికారంలోకి వస్తే అన్ని పంటలకు ఎంఎస్పి (సి+50 శాతం) అమలు చేస్తామని హామీ ఇచ్చింది. కానీ మీ ప్రభుత్వం ఇప్పటికీ ఆ హామీని నిలబెట్టుకో లేదు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని మీరు హామీ ఇచ్చారు. అయితే ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ కాలంలో రైతుల ఆదాయం వాస్తవ పరంగా క్షీణించింది. కాబట్టి మీరు ఈ బహిరంగ లేఖను దాని నిజమైన స్ఫూర్తితో తీసుకుని, టైర్ కార్పొరేట్ కంపెనీలపై విధించిన జరిమానాతో సమానమైన మొత్తాన్ని రబ్బరు రైతులకు మంజూరు చేయడం ద్వారా భారతదేశం అంతటా రబ్బరు రైతుల ప్రయోజనాలను పరిరక్షించడానికి దృఢ సంకల్పంతో నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను'' అని పేర్కొన్నారు.