Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో : యూపీలోని ఉన్నావ్ జిల్లాలో మరో దారుణమైన ఘటన జరిగింది. రెండు నెలల క్రితం అదృశ్యమైన దళిత యువతి మృతదేహాన్ని సమాజ్‌వాదీ పార్టీకి చెందిన మాజీ మంత్రి ఆశ్రమం పరిసరాల్లో గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. మృతదేహం పూర్తిగా పాడైపోయిందనీ, పోస్ట్‌మార్టమ్ నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఈ ఆశ్రమం ఎస్పీకి చెందిన మాజీ మంత్రి ఫతే బహదూర్ సింగ్‌దని అన్నారు. ఆయన కుమారుడు, ప్రధాన నిందితుడు రాజోల్ సింగ్‌ని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కి తరలించారు. వివరాల్లోకి వెళితే..గతేడాది డిసెంబర్ 8న 22 ఏండ్ల యువతి అదృశ్యమైంది. తన కుమార్తెను మాజీ మంత్రి కుమారుడు రాజోల్ సింగ్ కిడ్నాప్ చేశాడంటూ ఆ యువతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించాలంటూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగింది. పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆగ్రహంతో జనవరి 24న లక్నోలోని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ వాహనం ముందు ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. దీంతో అదే రోజున పోలీసులు రాజోల్సింగ్ని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక నిఘా, మొబైల్ నిఘా ఆధారంగా యువతి మృతదేహాన్ని ఆశ్రమం సమీపంలోని ఖాళీ స్థలంలో పాతిపెట్టనట్టు గుర్తించామని ఉన్నావ్ అదనపు పోలీస్ సూపరింటెండెంట్ శశి శేఖర్ సింగ్ తెలిపారు. యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మొదటిదశ పోలింగ్ గురువారం పూర్తయింది. అయితే అదే రోజు ఈ ఘటన జరగడం రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్నది.