Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కమ్యూనిస్టుల్లో అనేక మంచి భావాలు
- బిలియనీర్నైనా నాలో మార్పులేదు
- బైజూస్ రవీంద్రన్ వెల్లడి
బెంగళూరు : కోటి మంది పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించనున్నట్లు ప్రముఖ ఆన్లైన్ విద్యా వేదిక బైజూస్ వ్యవస్థాపకులు రవీంద్రన్, ఆయన సతీమణి దివ్యా గోకుల్‌నాథ్ ప్రకటించారు. ఇందుకు కమ్యూనిజమే తమను ప్రభావితం చేసిందని వారు వెల్లడించారు. 15 మాసాల క్రితం ప్రారంభించిన ఈ ప్రోగ్రామ్‌లో ఇప్పటికే 35 లక్షల మంది పిల్లలకు చేయూతనిస్తున్నామని టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. వచ్చే రెండు, మూడు మాసాల్లోనే ఈ సంఖ్యను 50 లక్షలకు ఆ తర్వాత కోటి మంది విద్యార్థులకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఎడ్యూకేషన్ టెక్నలాజీ కంపెనీ అయినా బైజూస్ ప్రస్తుత విలువ రూ.1.35 లక్షల కోట్లు పైగా ఉంటుంది.
'' మీడియా మమ్మల్ని బిలియనీర్లుగా చూపిస్తుంది. మేము దీన్ని పట్టించుకోము. గడిచిన 10-20 ఏళ్లలో సంపన్నులుగా మారడం తప్పా మాలో ఎలాంటి మార్పు లేదు. చాలా మంది ప్రజలకు నేడు సహాయం చేయగలుగుతున్నాము'' అని రవీంద్రన్ అన్నారు. ''మేము అతిపెద్ద లాభాల విద్యా కంపెనీగా అదే విధంగా లాభాపేక్ష లేని అతిపెద్ద కార్యక్రమాన్ని రూపొందించాం''. ఈ రెండింటిలో రెండోదే సులభం. అయినప్పటికీ ఇది ఎవరూ చేయరని రవీంద్రన్ తెలిపారు.
కమ్యూనిస్టులు అత్యధిక ప్రభావం కలిగిన కేరళలోని కన్నూర్ జిల్లా అజికోడ్ గ్రామంలో రవీంద్రన్ పెరిగారు. '' నేను కమ్యూస్టును కాదు. కానీ.. కమ్యూనిజంలో అనేక మంచి అంశాలు ఉన్నాయి. అనేక అంశాలు ప్రాక్టికల్‌గా నిలువకపోవచ్చు. కానీ అందరూ సమానులే అనేది చాలా గొప్ప విషయం.'' అని రవీంద్రన్ పేర్కొన్నారు.
ప్రపంచంలోని అసమానతలను భౌతిక విద్య ద్వారా పరిష్కరించడానికి చాలా సమయం పడుతుందని గోకుల్‌నాథ్ అన్నారు. అనేక పాఠశాలలను నెలకోల్పడంతో పాటుగా మంచి ఉపాధ్యాయులను నియమించాల్సి ఉంటుందన్నారు. కానీ తాము ఖర్చు లేకుండా ఆన్లైన్లో ఉన్నత విలువ కలిగిన విద్యను అందిస్తున్నామన్నారు. ఇంటర్నెట్ లేకపోయిన క్లాస్‌లు వినవచ్చునని అన్నారు.
నగదు సభ్యత్వంతో ఏ క్లాస్‌లు అయితే అందిస్తున్నామే.. అదే విద్యను పేద విద్యార్థులకు ఉచితంగా కల్పిస్తున్నామన్నారు. ఆంగ్ల భాషలోని వీడియో తరగతులను 11 స్థానిక భాషల్లోకి తర్జూమ చేసి అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ ఉచిత విద్యా కార్యక్రమాన్ని ప్రస్తుతం 128 ఎన్‌జిఒలతో భాగస్వామ్యమై అందిస్తున్నామని బైజూస్ వైస్ ప్రెసిడెంట్ మన్సీ కస్లివాల్ తెలిపారు. కరోనా సంక్షోభ కాలంలో భౌతిక విద్యకు దూరం అయినా అనేక మంది పిల్లలకు బాసటగా నిలిచామన్నారు.