Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐఐఎం బెంగుళూర్ ఫ్యాకల్టీ,అజీం ప్రేమ్జీ వర్సిటీ విద్యార్థులు
న్యూఢిల్లీ : ముస్లిం బాలికల హక్కుల్ని కాపాడాలని ఐఐఎం బెంగుళూర్ ఫ్యాకల్టీ, అజీం ప్రేమ్జీ వర్సిటీకి చెందిన 184మంది విద్యార్థులు 'జాతీయ మహిళా కమిషన్' (ఎన్సీడబ్ల్యూ)ను కోరారు. ఒక మతానికి చెందిన బాలికలు బెదిరింపులకు గురవుతున్నారని, హిజాబ్ వివాదంపై వెంటనే జోక్యం చేసుకోవాలని ఎన్సీడబ్ల్యూకు రాసిన లేఖలో తెలిపారు. ఒక మతానికి చెందిన బాలికలు వేధింపులను ఎదుర్కొంటున్నారని, విద్యకు దూరమవుతున్నారని అజీం ప్రేమ్జీ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లిం బాలికలు ఎదుర్కొంటున్న బెదిరింపులు, వేధింపులపై ఐఐఎం బెంగుళూర్ ఫ్యాకల్టీ ఎన్సీడబ్ల్యూను ఆశ్రయించింది. ఈ అంశాన్ని సుమోటాగా స్వీకరించాలని ఎన్సీడబ్ల్యూ ఛైర్పర్సన్ రేఖా శర్మను కోరింది. ''ప్రతి మతంలోనూ మహిళలు ప్రత్యేక సాంప్రదాయాల్ని కలిగివుంటారు. మహిళా సాధికారతలో అత్యంత కీలకమైనది విద్య. ఈ వివాదం కారణంగా అనేకమంది బాలికలు విద్యకు దూరమవుతారు. 'బేటి బచావో..పడావో' లక్ష్యం విఫలమైంది''మని ఎన్సీడబ్ల్యూకు ఒక పిటిషన్ సమర్పించింది.ఇలాంటి వివాదాలు సమాజంలో మతం, కులం, లింగ వివక్షను పెంచుతాయి. అనేక మతాలు, కులాలు ఉన్న మన సమాజంలో శాంతిసామరస్యాల్ని దెబ్బతీస్తుంది. ఒకరు ఏది తినాలో? ఏది నమ్మాలో? ఏది మాట్లాడాలో? ఒక సంస్థ నిర్దేశించటం ప్రజాస్వామ్యంలో సరైంది కాదు. నేడు ఒక మతానికి చెందన బాలికల్ని లక్ష్యంగా చేసుకొని సాగుతున్న బెదిరింపులను దేశ యువత అడ్డుకోవాలి. ప్రజాస్వామ్య, లౌకిక దేశం కోసం ఒక్కటవ్వాలి.