Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజకీయం చేయొద్దు : సోదరుడు విన్నపం
ముంబయి : ముంబయిలోని శివాజీ పార్క్‌లో ప్రముఖ గాయని లతా మంగేష్కర్ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని కుటుంబ సభ్యుల నుంచి ఎవరూ డిమాండ్ చేయలేదని ఆమె సోదరుడు, సంగీతకారుడు హృదయనాథ్ మంగేష్కర్ శుక్రవారం తెలిపారు. 'శివాజీ పార్క్‌లో లతా స్మారకం ఏర్పాటు అంశంపై రాజకీయం చేయొద్దు, స్మారకాన్ని ఏర్పాటు చేయాలని మేము కోరుకోలేదు. మా కుటుంబ సభ్యుల నుంచి ఎవరూ అలాంటి డిమాండ్ చేయలేదు' అని ఆయన తెలిపారు. ఈ నెల 6న కన్నుమూసిన లతా మంగేష్కర్‌కు శివాజీ పార్క్‌లో అంత్యక్రియలు చేశారు. ఆమె జ్ఞాపకార్థం అక్కడ స్మారకం ఏర్పాటు చేయాలన్న డిమాండ్ అధికార కాంగ్రెస్-శివసేన కూటమి, ప్రతిపక్ష బీజేపీ మధ్య వాగ్వాదానికి దారి తీసింది. ఆ పార్కులో లత స్మారకం ఏర్పాటు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు లేఖ రాశారు. దీనికి కాంగ్రెస్ నేత ఒకరు మద్దతునిచ్చి.. తర్వాత వెనక్కు తగ్గారు. బాలథాకరే ఈ పార్కు వద్ద దసరా ర్యాలీని నిర్వహించేవారు. ఆ సాంప్రదాయాన్ని ఆయన కుమారుడు ఉద్ధవ్ థాకరే కొనసాగిస్తున్నారు. తాజా డిమాండ్‌తో ఉద్ధవ్ థాకరే ఇరుకున పడినట్లయింది. ఈ అంశంపై చిల్లర రాజకీయాలు చేయొద్దని మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) నేత సందీప్ దేశ్ పాండే కోరారు. అక్కడ స్మారకాన్ని వంచిత్ బహుజన్ అఘాదీ (వీబీఏ) చీఫ్ ప్రకాష్ అంబేద్కర్ తిరస్కరించారు. లెజెండరీ క్రికెటర్లను తయారు చేసిన మైదానాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఇలా రాజకీయ వివాదానికి దారితీయడంతో హృదయనాథ్ మంగేష్కర్ స్పందించారు. ముంబయిలోని కలినాలో 2.5 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయి సంగీత అకాడమీని రూ.1200 కోట్లతో నిర్మించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సంగీత అకాడమీ ఏర్పాటు లతకు అత్యుత్తమ నివాళి అని ఆమె సోదరుడు హృదయనాథ్ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు.