Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హిమాలయాలకు హాని కలుగుతోందని ఆవేదన
న్యూఢిల్లీ : చార్ధామ్ రహదారి విస్తరణ పనుల పర్యవేక్షణ కోసం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన హై పవర్డ్ కమిటీ (హెచ్పీసీ) చైర్మన్ రవి చోప్రా తన పదవికి రాజీనామా చేశారు. జనవరి 27వ తేదీతో రవిచోప్రా రాజీనామా లేఖను ది హిందూ గుర్తించింది. లేఖలో హిమాలయాలను రక్షించే ప్యానెల్ 'శిధిలమైపోయింది' అని రవిచోప్రా ఆరోపించారు. భద్రతా కారణాలతో చార్ధామ్ రోడ్డును రెండు లైన్లగా విస్తరించడానికి డిసెంబరు 14న సుప్రీంకోర్టు అనుమతించింది. చార్ధామ్ రోడ్లు విస్తరణను రవిచోప్రాతోపాటు హెచ్పిసిలో కొంత మంది సభ్యులు గతం నుంచి వ్యతిరేకిస్తున్నారు. రోడ్డు విస్తరణతో హిమాలయ భూభాగానికి హాని జరుగుతుందని వీరు చెబుతున్నారు. రోడ్డు విస్తరణ పనులను హెచ్పిసి సభ్యులు పరిశీలించారు. పనులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. హెచ్పీసి చేసిన విజ్ఞప్తులను రోడ్లు రవాణా శాఖ పట్టించుకోవడం లేదని, హెచ్పిసి పాత్రను సుప్రీంకోర్టు పరిమితం చేసిందని రవిచోప్రా విమర్శించారు. 'ఆధునిక సాంకేతిక పరికరాలతో ఇంజనీర్లు హిమాలయాలపై దాడి చేయడం నేను చూశాను. వారు హైవేలను విస్తరించడానికి హిమాలయాలను గాయపరిచి, సహజమైన అడవులను నరికి వేశారు. నానాటికీ పెరుగుతున్న పర్యాటకుల సంఖ్య, వారి వాహనాల నుంచి తీవ్రమైన కాలుష్యం హిమాలయ శిఖరాలకు హాని చేసే విషపూరిత వాయువులను వెదజల్లుతున్నాయి. ఇంజనీర్లు తాము ప్రకృతిని జయించామని ఆనందిస్తారు, వాటి ఫోటోలను ప్రసారం చేస్తారు. ఇంజనీర్లు కూడా ప్రకతిలో ఒక భాగమని, సహజ పర్యావరణం నాశనం చేయబడితే మనుగడ సాగించలేరని వారు గ్రహించలేరు' అని రవిచోప్రా తెలిపారు.