Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్చి 14 కి పార్లమెంట్ వాయిదా
న్యూఢిల్లీ : మొదటి విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. దీంతో శుక్రవారం పార్లమెంట్ ఉభయ సభలు మార్చి 14 నాటికి వాయిదా పడ్డాయి. జనవరి 31న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉభయ సభల నుద్దేశించి చేసిన ప్రసంగంతో ప్రారంభమైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి దశ ఫిబ్రవరి 11తో ముగిశాయి. అదే రోజు లోక్‌సభ, రాజ్యసభల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను, ఫిబ్రవరి 1న 2022-23 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపైన, బడ్జెట్ పైన ఉభయ సభల్లో చర్చ జరిగింది. ఉభయ సభల్లో ఎటువంటి అంతరాయాలు జరగలేదు. దీంతో రాజ్యసభలో నిర్ణీత షెడ్యూల్ కంటే అర గంట సేపు ఎక్కువే సభా కార్యకలాపాలు జరిగాయి. రాజ్యసభలో 51 స్టార్ ప్రశ్నలు, 50 ప్రత్యేక ప్రస్తావనలు, 70 జీరో అవర్ అంశాలు లేవనెత్తినట్టు రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ హరివంశ్ నారాయణ్ సింగ్ తెలిపారు. అనంతరం సభను మార్చి 14 నాటికి వాయిదా వేశారు. ''బడ్జెట్ సెషన్ మొదటి దశలో సభ్యులందరూ చురుకుగా పాల్గొనడం సానుకూల సహకారం లభించింది. కరోనా సవాళ్లు ఉన్నప్పటికీ సభ్యులు తమ రాజ్యాంగపరమైన బాధ్యతలను నిబద్ధతతో సభలో అర్థరాత్రి వరకు పని చేయడం ద్వారా నెరవేర్చారు. తద్వారా సభా నిర్వహణ 121 శాతం అధిక ఉత్పాదకతను సాధించగలిగాం'' అని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు.
సభలో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చకు కేటాయించిన 12 గంటలకు బదులు 15 గంటల 13 నిమిషాల పాటు చర్చ జరగ్గా, అందులో 60 మంది సభ్యులు పాల్గొన్నారు. మరో 60 మంది సభ్యులు తమ ప్రసంగాలను సభ టేబుల్‌పై ఉంచారు. అదేవిధంగా సాధారణ బడ్జెట్‌పై చర్చకు కేటాయించిన 12 గంటల బదులు, మొత్తం 15 గంటల 33 నిమిషాల చర్చ జరిగింది. ఇందులో 81 మంది సభ్యులు పాల్గొన్నారు. 63 మంది ఇతర సభ్యులు తమ ప్రసంగాలను టేబుల్‌పై ఉంచారు.
లోక్‌సభలో ప్రతిపక్షాలు వాకౌట్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కేరళ, పశ్చిమ బెంగాల్, కాశ్మీర్ పై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ప్రతిపక్షాలు లోక్‌సభలో వాకౌట్ చేశాయి. కాంగ్రెస్, సీపీఐ(ఎం), సీపీఐ, డీఎంకే, ఆర్ఎస్ పి, టీఎంసీ తదితర పార్టీలు వాకౌట్ చేశాయి. కేరళ, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్‌పై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన ప్రకటనపై సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ రాజ్యసభలో రూల్ 267 కింద బిజినెస్ నోటీసును సస్పెండ్ చేశారు.