Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సరైన సమయంలో హిజాబ్‌పై విచారణ
- హైకోర్టు ఏ చేస్తుందో చూద్దాం..
- జాతీయ సమస్యగా మార్చొద్దు : సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : కర్నాటకలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన హిజాబ్ వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కర్నాటక హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుకాగా.. అత్యవసర విచారణ చేపట్టడానికి సుప్రీం నిరాకరించింది. దీనిపై సరైన సమయం లో విచారణ చేపడతామని స్పష్టం చేసింది. కర్నాటకలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, హైకోర్టులో జరుగు తోన్న విచారణను తాము గమనిస్తున్నామని పేర్కొన్నది. దీనిని జాతీయ స్థాయి సమస్యగా మార్చవద్దని న్యాయవాదు లకు సూచించింది. ఈ వివాదాన్ని ఢిల్లీ వరకు తీసుకు రావడం సరైనదేనా? అని ప్రశ్నించింది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై సీజేఐ ఎన్.వి.రమణ, జస్టిస్ ఎ.ఎస్.బోపన్న, జస్టిస్ హిమా కోహ్లిల నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. హైకోర్టు న్యాయమూర్తుల వ్యాఖ్యల ఆధారంగా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలైంది. అధికారిక ఉత్తర్వులు చూశాక స్పంది స్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఒకవేళ అందులో ఏదైనా తప్పుంటే..కచ్చితంగా జోక్యం చేసుకుంటామని చెప్పింది. దేశంలోని ప్రతిపౌరుడి ప్రాథమిక హక్కులను కాపాడుతామని భరోసా ఇచ్చింది. ఇదిలా ఉండగా, ఏకరూప వస్త్రాలను ధరించాలంటూ కర్నాటక ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ..ఇప్పటికే ఓ విద్యార్థిని సుప్రీంను ఆశ్రయించారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు.ఈ వివాదం దేశవ్యాప్తంగా విస్తరిస్తోందని తెలిపారు.
అలాగే హిజాబ్ వివాదంపై కర్నాటక హైకోర్టు విచారణలో ఉన్న కేసులను బదిలీ చేసుకోవడంతోపాటు 9మంది న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం విచారణ చేపట్టాలని కోరుతూ పిటిషనర్ చేసిన విజ్ఞప్తిని లిస్టింగ్ చేసుకోవాలని కోరారు. దీనికి స్పందించిన చీఫ్ జస్టిస్..'అలాగే..పరిశీలిస్తాం' అని పేర్కొన్నారు. అయితే ఇప్పుడే ఈ కేసును సుప్రీంకోర్టులో లిస్టింగ్ చేస్తే హైకోర్టు విచారణ జరిపేందుకు ఆస్కారం ఉండదని వెల్లడించారు.
కేవలం ముస్లింలకు సంబంధించినదే కాదు : న్యాయవాది దేవ్‌దత్ కామత్
హైకోర్టు ఆదేశాల్ని సవాల్ చేస్తూ కొంతమంది విద్యార్థులు సుప్రీంలో పిటిషన్ వేయగా, వీరి తరఫున సీనియర్ న్యాయవాది దేవ్‌దత్ కామత్ వాదనలు వినిపించారు. ''తనకు నచ్చిన మతాచారాలను పాటించే హక్కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ఈదేశంలోని ప్రతి పౌరుడికి ఇచ్చింది. ఈ హక్కును ఉల్లంఘించే విధంగా కర్నాటక హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి.
కాబట్టి ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ జరపాలని అత్యున్నత న్యాయాస్థానాన్ని కోరుతున్నా. పాఠశాలలు, కాలేజీల్లో విద్యార్థులెవ్వరూ మతపరమైన వస్త్రధారణ, గుర్తులు కలిగివుండరాదని హైకోర్టు ఆదేశాలు జారీచేయడం సరైంది కాదు.ఇది ముస్లిం సమాజంపైనే కాదు, ఇతర మతాల ప్రజల నమ్మకంపై ప్రభావం చూపుతు ంది. సిక్కులు తలపాగా ధరిస్తారు కదా! హైకోర్టు ఆదేశాల కారణంగా తమ క్లయింట్లు విద్యాసంస్థలకు వెళ్లలేకపోతున్నారు''
అని చెప్పారు.దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ..తాను ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కుల ను కాపాడతానని చెప్పింది. ప్రస్తుతం హైకోర్టు దీనిపై అత్యవసర విచారణ చేపట్టింది కాబట్టి, తీర్పు వెలువడ్డాక పరిశీలిస్తామని సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ జరుపాలని కామత్ కోరినప్పుడు..పరిశీలిస్తామని సీజేఐ ఎన్.వి.రమణ సమాధానమిచ్చారు.
విద్యార్థుల ప్రయోజనాలు ఆశించి : కర్నాటక హైకోర్టు
హిజాబ్ వివాదంపై కర్నాటక హైకోర్టు ఉత్తర్వు పూర్తిపాఠం శుక్రవారం విడుదలైంది. ''హిజాబ్ ధరించాలా? వద్దా? అనే పేరుతో అంతులేని ఆందోళన, విద్యా సంస్థల మూతపడటం బాధాకరం. మతం, సంస్కృతి పేరుతో శాంతిభద్రతలకు భంగం వాటిల్లటం నాగరిక సమాజం అనుమతించదు. ఆందోళనలతో సుదీర్ఘకాలం విద్యాసంస్థలు మూతపడటం మంచిది కాదు. విద్యార్థుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని విద్యాసంస్థలు తెరవాలని ఆదేశిస్తున్నాం. ఈ అంశానికి సంబంధించి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలి'' అని ఉత్తర్వుల్లో న్యాయస్థానం పేర్కొన్నది. కేసు తదుపరి విచారణ సోమవారం నాటికి వాయిదా వేసింది.