Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్‌ఎస్‌ఐజీఎస్‌ఈ నిలుపుదల
- స్కాలర్షిప్ కేటాయింపుల్లో 30 శాతం కోత
న్యూఢిల్లీ : దేశంలోని ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీల విషయంలో మోడీ సర్కారు పక్షపాతం చూపుతున్నది. ఎస్సీ, ఎస్టీలకు చెందిన విద్యార్థినుల కోసం ప్రవేశపెట్టిన పథకాన్ని కేంద్రం నిలిపివేసింది. ఈ-లెర్నింగ్‌పై తప్పుదారి పట్టిస్తున్నది. ఎస్సీ, ఎస్టీలతో పాటు ఓబీసీలకు కేటాయించిన స్కాలర్‌షిప్‌లలో కోతలు విధించింది. మోడీ సర్కారు ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంకెల గారడి, ప్రజలను తప్పుదోవ పట్టించే అంశాలున్నాయని ఆర్థిక నిపుణులు ఆరోపించారు. యూపీఏ-1 హయాంలో రూపొందించి ప్రవేశపెట్టిన వెనుకబడిన తరగతుల బాలికల విద్యను ప్రోత్సహించే పథకాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిశ్శబ్దంగా నిలిపివేసింది. బాలికల సెకండరీ ఎడ్యుకేషన్ జాతీయ ప్రోత్సాహక పథకం (ఎన్‌ఎస్‌ఐజీఎస్‌ఈ)ను అప్పటి ఆర్థిక మంత్రి పి. చిదంబరం ప్రవేశపెట్టారు.
ఇటు స్కాలర్‌షిప్‌లలోనూ మోడీ సర్కారు కోతలు పెట్టింది. యూనియన్ బడ్జెట్ 2022-23లో, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ), ఇతర వెనుకబడిన తరగతుల(ఓబీసీ) విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల కేటాయింపులో 30 శాతం తగ్గుదల ఉన్నది. సాంప్రదాయిక పాఠశాల విద్యకు ఖర్చుతో లోపాలను పరిష్కరించకుండా ఈ-లెర్నింగ్, డిజిటలైజేషన్‌ను నొక్కి చెప్పాలనే ప్రభుత్వ అధిక ఆసక్తిని ప్రతిపాదనలు హైలైట్ చేస్తున్నాయని ఉపాధ్యాయ సంఘాలు అభిప్రాయపడ్డాయి.
2008, మేలో కేంద్రంలోని అప్పటి యూపీఏ-1 ప్రభుత్వం ప్రోత్సాహక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇది కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ పథకం పొడగింపు. దీనిని ఇప్పుడు కేంద్రం నిలిపివేయడం గమనార్హం. ఈ పథకం కింద 2006-07లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ బాలికల కోసం 1000 రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించారు. ఇందుకోసం ప్రారంభంలో రూ. 128 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత మరో రూ. 172 కోట్లు కేటాయించారు. '' ఎనిమిదో తరగతి పరీక్షల ఉత్తీర్ణత సాధించి సెకండరీ పాఠశాలలో చేరిన బాలికకు మరింత ప్రోత్సాహకం అందించాలి. 18 ఏండ్లు వచ్చే వరకు ఆ బాలిక పేరు మీద రూ. 3000 జమ అవుతుంది'' అని అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ప్రకటించారు. అయితే, గత మూడేండ్లుగా కేంద్రం ఈ పథకాన్ని నీరు గార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. ఇందులో భాగంగా ఈ పథకానికి కేటాయింపులు క్రమంగా తగ్గించబడ్డాయి. ఇది గత నాలుగేండ్లలో గరిష్టంగా రూ. 320 కోట్ల నుంచి నామమాత్రంగా రూ. కోటికి పడిపోయింది. 2022-23 బడ్జెట్ ప్రతిపాదనలు, డిజిటలైజేషన్, ఈ-లెర్నింగ్‌పై మితిమీరిన ఒత్తిడి ప్రతికూల ప్రభావాలను చూపుతాయని స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టీఎఫ్ఐ) ప్రెసిడెంట్ అభిజిత్ ముఖర్జీ అన్నారు.