Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హిజాబ్ పేరుతో విద్యార్థుల మధ్య చిచ్చు..
- రెచ్చగొడుతున్న కర్నాటక రాష్ట్ర మంత్రులు : సీపీఐ(ఎం)
న్యూఢిల్లీ : కర్నాటకలో అధికార బీజేపీ ప్రజల మధ్య అనవసర వివాదాన్ని సృష్టించిందని సీపీఐ(ఎం) ఆగ్రహం వ్యక్తం చేసింది. హిజాబ్, కాషాయ కండువా..వివాదానికి వెంటనే ముగింపు పలకాలని కర్నాటక ప్రభుత్వానికి సూచించింది. ఉడిపి కాలేజ్‌లో మొదలైన హిజాబ్, కాషాయ కండువా..వివాదం రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోందని, విద్యార్థుల్లో మత విభజన ఏర్పడటానికి కారణమైందని సీపీఐ(ఎం) కర్నాటక శాఖ శుక్రవారం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. దీంట్లో పేర్కొన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పుడు నెలకొన్న ఈ వివాదం అంతా రాష్ట్ర బీజేపీ సర్కార్ సృష్టించిందే. కొంత మంది విద్యార్థుల్ని రెచ్చగొట్టి తెరవెనుకుండి వివాదాన్ని నడిపిస్తోంది. విద్యార్థుల మధ్య మత విభజనను మరింత పెంచేలా రాష్ట్ర ప్రభుత్వ చర్యలున్నాయి. నేటి ఈ పరిస్థితికి రాష్ట్రంలోని మత సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కర్నాటక హోం మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది.
ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్నారు..
ఒక మతానికి చెందిన విద్యార్థులు..తమ స్కూల్ యూనిఫాంలో భాగంగానే హిజాబ్‌ను ధరిస్తున్నారు. అనేక విద్యా సంస్థల్లోనూ మనం చూస్తున్నాం. స్కూల్ యూనిఫాం రంగులను బట్టి హిజాబ్ ధరించటాన్ని చూడొచ్చు. జనరల్ యూనిఫాం కోడ్‌ను ఉల్లంఘించటం గా దీనిని భావించరాదు. మతకోణంలో హిందూత్వ సంస్థలు హిజాబ్ పై రాద్ధాంతం చేస్తున్నాయి. ఒక వర్గంవారిని లక్ష్యంగా చేసుకొని భయ భ్రాంతులకు గురిచేస్తున్నాయి. విద్యార్థుల్ని రెచ్చగొట్టేలా కొంతమంది మంత్రులు వ్యవహరిస్తున్నారు. ఇదంతా కూడా రాష్ట్రంలో ఆగిపోవాలి.
ప్రజల దృష్టి మరలించడానికే..
ఇక్కడ రాష్ట్రంలో, అక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ. గత 8ఏండ్లుగా బీజేపీ పాలకులు అనుసరిస్తున్న విధానాలతో దేశంలో కార్మికులు, రైతులు, పేదలు నిరసన బాట పడుతున్నారు. ఉద్యోగాలు, ఉపాధి, ధరల పెరుగుదల, అసమానతలు..ఇలా అనేక సమస్యలపై ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ ఉధృతరూపం దాల్చుతున్నాయనే భయంతో అనవసర వివాదాన్ని బీజేపీ సృష్టించింది. తద్వారా ప్రజల దృష్టి మరల్చడమే పాలకుల లక్ష్యం. విభజన రాజకీయాలే నేటి పరిస్థితి కారణం. ముందు ముందు రాష్ట్రలో శాంతిభద్రతలు సైతం ప్రమాదంలో పడతాయి.