Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జార్ఖండ్ ప్రభుత్వ గెజిట్ను వాయిదావేసి, అఖిలపక్షంతో చర్చించాలి : సీపీఐ(ఎం) డిమాండ్
రాంచి : గిరిజన, రాష్ట్రంలోని ప్రాంతీయ భాషలకు సంబంధించి గతేడాది డిసెంబరు 27న విడుదల చేసిన జార్ఖండ్ ప్రభుత్వ గెజిట్ (అసాధారణ)ను వాయిదా వేసి, దానిపై తక్షణమే చర్చించేందుకు అఖిలపక్షం ఏర్పాటు చేయాలని సీపీఐ(ఎం) జార్ఖండ్ రాష్ట్ర కార్యదర్శివర్గం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. జార్ఖండ్ ప్రభుత్వం ప్రచురించిన ఈ నోటిఫికేషన్ రాష్ట్రంలో గందరగోళాన్ని సృష్టించిందని, కొన్ని సంస్థలు ప్రాంతీయ భాషలకు సంబంధించి బాధ్యతారాహిత్యంగా ప్రకటనలు చేయడం ద్వారా తమ విచ్ఛిన్నకర ఎజెండాను రెచ్చగొట్టడం ప్రారంభించాయని సీపీఐ(ఎం) విమర్శించింది. వివిధ రాజకీయ పార్టీలతోనూ, సామాజిక సంస్థలతోనూ విస్తృతంగా చర్చలు జరపకుండా హేమంత్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించిందని విమర్శించింది. భాష పేరుతో రాష్ట్రంలో ప్రజల మధ్య విభజన సృష్టించేందుకు కొన్ని శక్తులకు అవకాశం కల్పించిందని పేర్కొంది. ఉపాధి అవకాశాలు లేక రాష్ట్రంలోని లక్షలాదిమంది నిరుద్యోగ యువత అనిశ్చిత స్థితిలో కొట్టుమిట్టాడుతుండడం, విచ్ఛిన్నకర శక్తులు తమ ఎజెండాతో ముందుకు సాగేందుకు అవకాశాలను కల్పించింది. భాషా ప్రాతిపదిక రాష్ట్రాల ఏర్పాటుకు సీపీఐ(ఎం) ఎప్పుడూ అనుకూలమే. జార్ఖండ్లో ఉపాధితో సహా ఏడు పాయింట్లతో కూడిన మార్గదర్శకాలు వున్నాయి. ఉపాధిపై జార్ఖండ్ ప్రభుత్వం 2007లో నోటిఫికషన్ కూడా జారీ చేసింది. రాష్ట్రంలో దాన్ని సక్రమంగా అమలు చేయలేదు. ముందు దాన్ని సక్రమంగా అమలు చేయాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేస్తోంది. గిరిజన భాషలతో పాటు ప్రధాన ప్రాంతీయ భాషలను కూడా పరిరక్షించాలన్న స్పష్టమైన భావనతో సీపీఐ(ఎం) వుంది. ఈ భాషల్లో ప్రాధమిక తరగతుల నుంచే విద్యా బోధన, ఆయా ప్రాంతాల్లో స్థానిక భాష బాగా వచ్చిన వారినే రిక్రూట్ చేయడం వంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అంతేకానీ భాష ప్రాతిపదికన ప్రజల మధ్య విచ్ఛిన్నకర కార్యకలాపాలు సాగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామని పార్టీ పేర్కొంది. ముందుగా ఆ గెజిట్ను వాయిదా వేసి, రాష్ట్ర ప్రయోజనాల రీత్యా దీనిపై ఏకాభిప్రాయం వచ్చేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. జార్ఖండ్లో డొమిసైల్(నివాసం)ను ముందుగా నిర్వచించి, తర్వాత రాష్ట్ర ఉపాధి విధానాన్ని రూపొందించాలని కోరింది.