Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర బడ్జెట్లో అరకొరగా నిధుల కేటాయింపు
- ఆన్లైన్ టీచింగ్‌తో డిజిటల్ అసమానతలు
- పెరుగుతున్న డ్రాపవుట్స్..
- పీఎం ఈ-విద్యకు ప్రకటించిన రూ.లక్ష ఏమూలకు?
న్యూఢిల్లీ : కోవిడ్ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నరంగాల్లో విద్యారంగం ఒకటి. దేశవ్యాప్తంగా స్కూల్స్ సుదీర్ఘకాలం మూతపడ్డాయి. ఈ రెండేండ్లలో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. ప్రయివేట్ రంగంలో ఆన్లైన్లో బోధన కొనసాగగా, ప్రభుత్వ పాఠశాల్లో చదువుతున్న పిల్లలకు ఆన్లైన్ బోధన పూర్తిస్థాయిలో అందలేదు. పేదలు, అణగారిన వర్గాల పిల్లలకు స్మార్ట్ఫోన్లు లేకపోవటం, ఉన్నా..నెట్వర్క్ సమస్యలు. వెరసి..దేశంలో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలపై తీవ్ర ప్రభావం పడింది. విద్యా నైపుణ్యాలు పొందటంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. చాలా కొద్ది మంది మాత్రమే డిజిటల్ పాఠాల్ని విని ఆకలింపు చేసుకున్నారు. దాదాపు 82వారాలపాటు స్కూల్స్ మూతపడ్డాయి. దీనివల్ల 24.7కోట్లమంది విద్యార్థులు చదువులో వెనుకబడిపోయారు. ఇప్పుడు మూడో ఏడాదిలోనూ ఒమిక్రాన్ రూపంలో కరోనా వెంటాడింది. ఈనేపథ్యంలో విద్యారంగం కోసం కొత్త విధానాలతో, సరికొత్త రోడ్‌మ్యాప్‌తో కేంద్రం ముందుకు వస్తుందని అందరూ భావించారు. తాజా బడ్జెట్లో (2022-23) విద్యారంగానికి రూ.1,04,277కోట్లు కేటాయించింది. గత బడ్జెట్‌తో పోల్చితే, ఈసారి కేంద్రం ప్రతిపాదించిన రూ.40లక్షల కోట్ల బడ్జెట్లో విద్యారంగానికి వాటా పెరగలేదని నిపుణులు చెబుతున్నారు.
నమ్మకం పెంచేదెలా?
కోవిడ్ ప్రమాదం ఇంకా పూర్తిగా తొలిగిపోలేదు. పాఠశాలకు పంపితే ఎలా ? అని పిల్లల తల్లిదండ్రులు భయపడుతున్నారు. స్కూల్స్‌లో కోవిడ్ నిబంధనలు పాటించాలంటే, స్కూల్స్ సురిక్షితమనే భావన ఏర్పడాలంటే మరిన్ని నిధులు అవసరం. సమగ్ర శిక్షా అభియాన్ కింద రూ.37,383కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌తో పోల్చితే నిధుల కేటాయింపు పెరిగింది. అయితే ఇవన్నీ 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిణీ అయితే..అదనంగా సమకూరేది కేవలం రూ.175కోట్లే. సక్షాం అంగన్వాడీ, పోషణ్ 2.0 పథకాలకు పెరిగిన నిధులు 0.79శాతం. పీఎం పోషణ్ (మధ్యాహ్న భోజనం)కు నిధులు తగ్గాయి.
డిజిటల్ అసమానతలు
ఆన్లైన్ క్లాసుల వల్ల 77శాతం మంది విద్యార్థులు నష్టపోయారని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీయే తేల్చిచెప్పింది. బడిమానేసిన పిల్లల సంఖ్యకూడా గణనీయంగా పెరిగిందని తెలిపింది. ఇందులో ఎక్కువగా పేదలు, అణగారిన వర్గాల పిల్లలు ఉన్నారని పేర్కొన్నది. డిజిటల్ సేవల్లో నెలకొన్న అసమానతలకు ఇది నిదర్శనం. అయినప్పటికీ ఈసారి బడ్జెట్లో ఆన్లైన్ ఎడ్యుకేషన్, డిజిటల్ ఈ-కంటెంట్, డిజిటల్ టీచర్స్‌ను కేంద్రం ప్రస్తావించింది. కోవిడ్ తీసుకొచ్చిన సవాళ్లకు పరిష్కారమని తెలిపింది. పోనీ..నిధుల కేటాయింపు ఏమైనా పెంచారా? అంటే అదీ లేదు. పీఎం ఈ-విద్యకు 2021-22(సవరించిన)లో రూ.50కోట్లు కేటాయించగా, తాజా బడ్జెట్ అంచనాల్లో కేవలం రూ.1లక్ష రూపాయలు కేటాయించింది.