Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రంలో 40లక్షల ఖాళీలుంటే 20లక్షలు కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ
- 'మోడీ' వచ్చాక ప్రయివేటీకరణ వేగవంతం
- ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లపై దెబ్బ
ప్రయివేటీకరణ ఎంతటి దారుణమైన ఫలితాల్ని ఇస్తుందో, ప్రజల ప్రయోజనాల్ని ఎంతగా దెబ్బకొడుతుందో భారతదేశం ఒక ఉదాహరణగా చూపొచ్చు. ఏడో వేతన సంఘం నివేదిక ప్రకారం కేంద్రంలో 40.66 ఉద్యోగ ఖాళీలు ఉండగా, సగానికిపైగా..20.57లక్షల ఉద్యోగాలు (మార్చి 2019నాటికి) కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీచేశారు. ప్రభుత్వ ఉద్యోగాలుగా వీటిని భర్తీ చేస్తే..3.08లక్షల ఉద్యోగాలు ఎస్సీలకు, 1.54లక్షలు ఎస్టీలకు, 5.55లక్షల ఉద్యోగాలు ఓబీసీలకు వచ్చేవి. మొత్తంగా 20.57లక్షల కుటుంబాల్లో ఆర్థికంగా, సామాజికంగా గణనీయమైన మార్పు వచ్చేది. వారి జీవన ప్రమాణాలు పెరిగేవి. అయితే మోడీ సర్కార్ అమలుజేస్తున్న ప్రయివేటీకరణ విధానాలు.. రిజర్వేషన్లకు తూట్లు పొడిచింది.
న్యూఢిల్లీ : 15ఏండ్లక్రితంతో పోల్చితే బ్యాంకింగ్, రైల్వేలలో రెగ్యులర్ ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గగా, కాంట్రాక్ట్ ఉద్యోగులు భారీగా పెరిగారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు దక్కాల్సిన ఉద్యోగాల్ని కాంట్రాక్ట్ పద్ధతిలో పాలకులు తమ ఇష్టమున్నట్టుగా భర్తీ చేస్తున్నారు. గత 8ఏండ్లలో ప్రయివేటీకరణను మోడీ సర్కార్ మరింత వేగవంతం చేసింది. తద్వారా కోట్లాది మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందలేని పరిస్థితి ఏర్పడింది.
అంతా కాంట్ట్రాక్ కిందే..
ఇప్పుడున్న జనాభా అవసరాలు దృష్టిలో పెట్టుకుంటే కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థల్లోనూ ఉద్యోగుల సంఖ్య పెరగాలి. ప్రతి ఏటా ఉద్యోగఖాళీల నోటిఫికేషన్ జారీ చేయాలి. కానీ అలా జరగటం లేదు. కారణం కొన్నేండ్లుగా పాలకులు అమలుజేస్తున్న 'ప్రయివేటీకరణ'. ఉదాహరణకు మార్చి 2004లో రైల్వేలో ఉద్యోగుల సంఖ్య 14.41లక్షలు. మార్చి 2020నాటికి రైల్వే ఉద్యోగుల సంఖ్య 12.53లక్షలకు తగ్గింది. రిజర్వేషన్లు పాటించకుండా కాంట్రాక్ట్ పద్ధతిలో 7.5లక్షల మందిని నియమించారు.
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లోనూ ఇదే జరుగుతోంది. ఈ సంస్థల్లో 2012-13నాటికి 17,33,973 ఉద్యోగులు ఉండేవారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు-2,83,350, దినసరి వేతనంపై 43,166మంది పనిచేసేవారు. 2019-20నాటికి పరిస్థితి ఎంతగా మారిందంటే, మొత్తం ఉద్యోగుల సంఖ్య 14.73లక్షలకు తగ్గింది. అందులోనూ 5లక్షల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులే ఉన్నారు. 53,127మంది దినసరి వేతనంపై పనిచేస్తున్నారు. రిజర్వేషన్లు పాటించకుండా ఇవన్నీ (కాంట్రాక్ట్, దినసరి వేతనం) భర్తీ చేశారు.
రెట్టింపు అయ్యేది !
ఒకసర్వే ప్రకారం 2019-20 నాటికి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 9.19లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులున్నారు. ఇందులో ఎస్సీ ఉద్యోగులు-1.6లక్షలు, ఎస్టీ-99వేలు, ఓబీసీ-1.98లక్షలు ఉన్నారు. రెగ్యులర్ ఉద్యోగాల్ని కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానాలతో భర్తీ చేయకపోతే..ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ఉద్యోగుల సంఖ్య నేడు రెట్టింపు అయ్యేదని సర్వే ఆధారాలతో సహా గణాంకాల్ని విడుదల చేసింది. తద్వారా దేశవ్యాప్తంగా ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా ముందడుగు వేసేవని నిపుణులు అభిప్రాయపడ్డారు.
బ్యాంకులు..ఎల్ఐసీ
2005-06లో ప్రభుత్వ బ్యాంకుల్లో 7,29,424మంది ఉద్యోగులు, ప్రయివేటు బ్యాంకుల్లో 1,39,039మంది పనిచేసేవారు. మార్చి, 2021నాటికి ప్రభుత్వ బ్యాంకుల్లో ఉద్యోగుల సంఖ్య 7,83,518కాగా, ప్రయివేటు బ్యాంకుల్లో ఉద్యోగుల సంఖ్య 5,70,713. జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)..ప్రపంచంలోనే పేరొందిన ప్రఖ్యాత సంస్థ. 10శాతం వాటాల అమ్మకం ద్వారా లక్షల కోట్ల రూపాయలు సేకరించడానికి మోడీ సర్కార్ సిద్ధమైంది. ఎల్ఐసీలో ఉద్యోగుల సంఖ్య 1,19,767 నుంచి 1,08,987కు తగ్గింది. ఎల్ఐసీలో వాటాల అమ్మకం ద్వారా ఉపాధి పొందుతున్న 13లక్షల మంది ఏజెంట్ల భవితవ్యం అగమ్యగోచరంగా తయారైంది.
బీఎస్ఎన్ఎల్
టెలికాం రంగంలో బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ నేడున్న పరిస్థితికి కారణం ప్రయివేటీకరణ. 2014లో బీఎస్ఎన్ఎల్లో 2.38లక్షల మంది, ఎంటీఎన్ఎల్లో 36వేల మంది ఉద్యోగులుండేవారు. రిలయన్స్ జియోకు లాభం చేకూర్చడం కోసం బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ను మోడీ సర్కార్ నిర్వీర్యం చేసింది. ఉద్యోగుల సంఖ్యను బీఎస్ఎన్ఎల్లో 78వేలకు, ఎంటీఎన్ఎల్లో 14వేలకు తగ్గించారు. నాలుగో తరం (4జీ) టెలికాం సేవలు కేటాయించకుండా, ఉద్దేశపూర్వకంగా బలహీనపర్చారు.