Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 28 బ్యాంక్‌లకు షిప్పింగ్ కంపెనీ ఎగవేత
- సీబీఐ కేసు నమోదు
న్యూఢిల్లీ : బ్యాంక్‌లకు వేల కోట్లు కన్నం వేసిన విజయ మాల్యా, నీరవ్ మోడీల వ్యవహారం మర్చిపోకముందే మరో ఘటన బయటపడింది. గుజరాత్ కేంద్రంగా పని చేస్తున్న ఏబీజీ షిప్‌యార్డ్ కంపెనీ దేశంలోని 28 బ్యాంక్‌లకు టోకరా ఇచ్చింది. ఐసీఐసీఐ బ్యాంక్ కన్సోరియంలోని పలు బ్యాంక్‌లకు ఏకంగా రూ.22,842 కోట్లకు మోసం చేసింది. దీంతో ఆ కంపెనీ సీఎండి, డైరెక్టర్లపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఏబీజీ షిప్‌యార్డ్ సీఎండీ రిషి కమలేష్ అగర్వాల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతానమ్ ముతస్వామి, మరో ముగ్గురు డైరెక్టర్లు అశ్వినీ కుమార్, సుశీల్ కుమార్ అగర్వాల్, రవి విమల్ నెవెటియాలపై మోసం, క్రిమినల్ కేసులు పెట్టింది. ఏబీజీ గ్రూప్ గుజరాత్‌లోని సూరత్ కేంద్రంగా పని చేస్తుంది. షిప్‌ల తయారీ, వాటి రిపేర్ వ్యాపారాలను కలిగి ఉంది. గడిచిన 16 ఏండ్లలో 165 వాణిజ్య ఓడలను తయారు చేసింది. ఈ సంస్థకు బ్యాంక్‌లు వరుస కట్టి అప్పులివ్వడం గమనార్హం.
ఎస్బీఐ ఫిర్యాదుతో సీబీఐ కేసు నమోదు చేసింది. ఏబీజీకి ఐసిఐసిఐ బ్యాంక్ అత్యధికంగా రూ.7,089 కోట్లు అప్పులిచ్చింది. ఐడిబిఐ బ్యాంక్ రూ.3,639 కోట్లు, ఎస్బిఐ రూ.2,925 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.1,614 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.1,244 కోట్ల చొప్పున రుణాలిచ్చిన వాటిలో ఉన్నాయి.
దేశంలోని దాదాపుగా అన్ని బ్యాంక్‌ల నుంచి అప్పులు తీసుకుంది. 2012 ఏప్రిల్ నుంచి 2017 జులై మధ్య ఏబీజీ లావాదేవీలపై ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఫోరెన్సిక్ ఆడిట్‌ను నిర్వహించింది. ఇందులో నిధుల మళ్లింపు సహా అనేక అవకతవకలు జరిగినట్టు గుర్తించింది. 2015 నుంచి ఈ కంపెనీ పరపతి పడిపోతూ వచ్చింది. 2016 జులైలో ఈ ఖాతాలను నిరర్థక ఆస్తులుగా బ్యాంక్‌లు గుర్తించాయి. భారత బ్యాంక్‌లకు విజరు మాల్యా రూ.9వేల కోట్లు పైనా, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ రూ.14వేల కోట్ల రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన కేసులను సీబీఐ విచారిస్తున్న విషయం తెలిసిందే.