Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామీణాభివృద్ధికి నిధులలో తగ్గుదల
- 3.50 శాతానికి పడిపోయిన వైనం
- సామాజికవేత్తలు, విశ్లేషకుల ఆందోళన
న్యూఢిల్లీ : మోడీ సర్కారు ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశంలోని సకలజనులను నిరాశ పరిచింది. దాదాపు అన్ని రంగాల పైనా ఇదే తీరు కనిపిస్తున్నది. ఇప్పటికే భారత్లో కరోనా మహమ్మారి తీసుకొచ్చిన ప్రతికూల మార్పులు అన్నీ ఇన్నీ కావు. లాక్డౌన్ వంటి పరిస్థితులతో వలసకార్మికులు తిరిగి తమ సొంతూర్లకు చేరుకున్నారు. మహమ్మారి ప్రభావాన్ని తీవ్రంగా ఎదుర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల బడ్జెట్లో గ్రామీణ భారతాన్ని ఆదుకోవాల్సిన మోడీ సర్కారు దానిని విస్మరించింది. గ్రామీణాభివృద్ధికి నిధులు తక్కువగా కేటాయించింది. దీనిపై సామాజికవేత్తలు, విశ్లేషకులు ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.
గ్రామీణ రంగం ఇప్పటికీ నిరుద్యోగం, ఆదాయ క్షీణత, సంపూర్ణ పేదరికం పెరుగుదల వంటి సమస్యలను ఎదుర్కొంటున్నది. ఈ పరిస్థితిని పరిష్కరించడానికి ప్రభుత్వపు అదనపు వ్యయం అత్యవసరమని నిపుణులు చెప్పారు. గ్రామీణాభివృద్ధి శాఖ వాటా 2019-20లో మొత్తం కేంద్ర బడ్జెట్లో 4.60 శాతం నుంచి 2020-21లో 5.63 శాతానికి పెరిగింది. అయితే, 2021-22కి గానూ సవరించిన అంచనాలలో అది పడిపోయింది. ఈ బడ్జెట్లో దిగజారి 3.50 శాతం వద్ద ఉన్నది.
గ్రామీణ ఉపాధి కేటాయింపుల్లో కోత
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) నైపుణ్యం లేని గ్రామీణ కూలీలకు కనీసం వంద రోజుల వేతన ఉపాధి హామీనిస్తుంది. 2020-21లో ఈ పథకం కింద పని కోసం దరఖాస్తు చేసుకున్న 13.32 కోట్ల మందిలో 13.29 కోట్ల మందికి పని కల్పించారు. 2021-22లో జనవరి మొదటి వారం వరకు 11.30 కోట్ల మంది దరఖాస్తు చేసుకోగా అందులో 11.22 కోట్ల మందికి పనులు కల్పించారు. పథకానికి కేటాయింపులు గత ఆర్థిక సంవత్సరం మాదిరిగానే రూ. 73,000 కోట్లుగా ఉన్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో దీని బడ్జెట్ రూ. 98 వేల కోట్లకు చేరుకున్నది. ప్రతి ఏడాదీ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద మంజూరు చేయబడిన గ్రాంట్లు సరిపోకపోతున్నప్పటికీ ప్రస్తుత కేటాయింపు 2021-22 సవరించిన అంచనా కంటే 25.5 శాతం తక్కువగా ఉన్నది. డిసెంబర్ 2021 నాటికి వేతన బిల్లు పెండింగ్ బాధ్యతలు రూ. 3,655 కోట్లు. ఒకవైపు, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద పనికి ఆల్ టైమ్ హై డిమాండ్ ఉండగా, మోడీ సర్కారు మాత్రం కేటాయింపుల్లో కోతను పెట్టడం గమనార్హం.
సెంటర్ ఫర్ ఎకనామిక్ డేటా అండ్ అనాలసిస్, అశోకా విశ్వ విద్యాలయం ఇటీవల జరిపిన ఒక అధ్యయనం ప్రకారం.. 2020లో పాన్- ఇండియా ప్రాతిపాదికన నమోదిత కుటుంబాలకు గ్యారెంటీ 100 రోజుల పనికి బదులుగా సగటున 22 రోజుల ఉపాధి (జాతీయ సగటు) అందించబడింది. అయితే, 2020-21లో ఈ పథకం కింద సగటున 51.52 రోజుల పనిని అందించినట్టు ప్రభుత్వం పేర్కొన్నది. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో నైపుణ్యం లేని కార్మికులకు చట్టబద్ధంగా సూచించిన కనీస వేతనాలు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ వేతనాల కంటే ఎక్కువగా ఉన్నాయి. అయితే, 12 రాష్ట్రాల్లో చట్టబద్ధమైన కనీస వేతనాలు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ వేతనాల కంటే 50-75 శాతం ఎక్కువగా ఉండటం గమనార్హం.
మహిళలకు అసమాన బడ్జెట్
ఉపాధి హామీ కింద మొత్తం క్రియాశీల కార్మికులలో మహిళా కార్మికుల భాగస్వామ్యం 2019-20లో 54.78 శాతం, 2020-21లో 53.07 శాతంగా ఉన్నది. అయితే, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద బడ్జెట్లో 33 శాతం మహిళలకు నివేదించబడింది. 2022-23 బడ్జెట్ అంచనాలో ఉపాధి హామీ కింద మహిళలకు కేటాయింపులు రూ. 26 వేల కోట్లుగా ఉన్నాయి. 2021-22 సవరణ అంచనాలో రూ. 32,666.6 కోట్లకు తగ్గటం గమనార్హం. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పనిలో మహిళల అధిక భాగస్వామ్యం కారణంగా లింగ బడ్జెట్ ప్రకటనలో నివేదించబడిన కేటాయింపును పెంచాల్సినవసరం ఉనదని నిపుణులు చెప్పారు.
రూరల్ హౌజింగ్
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (పీఎంఏవై-జీ) కింద 2022 నాటికి గ్రామీణ భారతదేశంలో మొత్తం 2.95 కోట్ల పక్కా ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు పార్లమెంటరీ ప్రశ్నకు సమాధానంగా కేంద్రం వెల్లడించింది. అయితే, ఇప్పటి వరకు 1.65 కోట్ల ఇండ్లు మాత్రమే పూర్తయ్యాయి. పీఎంఏవై-జీ కింద 2022-23 అంచనా బడ్జెట్ రూ. 20 వేల కోట్లు. ఇది 2021-22 సవరించిన అంచనాల కంటే తక్కువ కావటం గమనార్హం.