Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇనుము, అల్యూమినియం, ఎరువుల తయారీపై తీవ్ర ప్రభావం
- ఉత్పత్తి నష్టాలు..సామాన్యుడిపై భారం : పరిశ్రమ అసోసియేషన్స్
- బొగ్గు సరఫరా పెంచాలని ప్రధాని మోడీకి లేఖ
న్యూఢిల్లీ : దేశంలో బొగ్గు కొరత మళ్లీ తీవ్ర స్థాయికి చేరుకుంది. విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లకు తప్ప మిగతా పరిశ్రమలకు సరిపడా బొగ్గు సరఫరా కావటం లేదు. దాంతో ఇనుము, అల్యూమినియం, ఉక్కు, సిమెంట్, స్పాంజ్ ఐరన్, రసాయనాలు, రేయాన్..మొదలైన పరిశ్రమల్లో ఉత్పత్తి గణనీయంగా దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిశ్రమల్లో పెద్ద పెద్ద కొలిమిలో బొగ్గును మండిస్తారు. ప్లాంట్లలో ఉత్పత్తి ప్రక్రియ అంతా దీనితోనే ముడిపడి ఉంది. బొగ్గు సరఫరా నిలిచిపోవటంతో ఆయా కంపెనీలు తమ వద్ద ఉన్న నిల్వల్ని వినియోగిస్తున్నాయి. ఇవికూడా అయిపోతే.. కంపెనీ ఉత్పత్తి వ్యయం భారీగా పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. దీనిపై తాజాగా ప్రధాని మోడీకి లేఖ రాశాయి. బొగ్గు సరఫరా నిలిచిపోయిందని కేంద్ర బొగ్గుమంత్రిత్వ శాఖకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేదని లేఖలో పరిశ్రమ అసోసియేషన్స్ పేర్కొన్నాయి. విద్యుత్ తయారీ ప్లాంట్లకు తప్ప, మిగతా పరిశ్రమలకు బొగ్గు సరఫరా కావటం లేదని, వివిధ మార్గాల ద్వారా సరఫరా కావాల్సిన ఇంధనం కూడా నిలిచిపోయిందని లేఖలో తెలియజేశాయి. ఉత్పత్తి ప్రక్రియను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని ఫెర్టిలైజర్స్ అసోసియేషన్, అల్యూమినియం అసోసియేషన్ ఆఫ్ ఇండియా, కోల్ కన్జ్యూమర్స్ అసోసియేషన్, కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియా టెక్స్టైల్ ఇండిస్టీ, క్యాప్టీవ్ పవర్ ప్రొడ్యూసర్స్, స్పాంజ్ ఐరన్ అసోసియేషన్...సంయుక్తంగా కేంద్ర ప్రభుత్వానికి స్వయంగా తెలియజేశాయి. ''రైల్, రోడ్డు, రైల్ రోడ్డు మార్గాల ద్వారా బొగ్గు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దాంతో పరిశ్రమలు సమస్యల వలయంలో చిక్కుకుంటు న్నాయి. గత ఏడాది దేశంలో బొగ్గు కొరత తీవ్రస్థాయికి చేరటంతో, మిగతా పరిశ్రమలకు సరఫరా ఆపేసి..విద్యుత్ ప్లాంట్లకు తరలించారు. కోల్ ఇండియా నుంచి బొగ్గు ఉత్పత్తి పెరిగినా..ఇతర పరిశ్రమలకు మునపటిలా బొగ్గు సరఫరా కావటం లేదు. దాంతో పరిశ్రమల్లో తయారీ అంతా నిలిచిపోయింది'' అని లేఖలో పేర్కొన్నాయి. కేటాయించిన దానిప్రకారం బొగ్గును సరఫరా చేసి పరిశ్రమ వర్గాలకు న్యాయం చేయాలని అసోసియేషన్స్ కోరుతున్నాయి. బొగ్గు కొరత ఇదే స్థాయిలో ఉంటే ఉత్పత్తిలో ఆర్థిక నష్టాలు భారీగా ఉంటాయని, వస్తువల ధరలు పెరుగుతాయని, ఇది సామాన్యుడిపైనా తీవ్ర ప్రభావం చూపుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ అంశంపై కోల్ ఇండియా స్పందిస్తూ, ప్రస్తుతం విద్యుత్యేతర రంగాల పరిశ్రమలకు ప్రతిరోజూ సగటున 3.4లక్షల టన్నుల బొగ్గు సరఫరా చేస్తున్నాం. బఫర్ స్టాక్స్ కోసం ముందు ముందు బొగ్గు సరఫరా పెంచుతామని తెలిపింది.
42 బొగ్గు బ్లాకుల వేలం : కేంద్రం
ఇప్పటివరకూ (12 ఫిబ్రవరి 2022నాటికి) 42బొగ్గు బ్లాకులను వేలం వేశామని కేంద్రం తాజాగా వెల్లడించింది. ఇవన్నీ కూడా కమర్షియల్ మైనింగ్కి చెందినవే. గతవారం 10 బొగ్గు బ్లాకులను వేలం వేసినట్టు కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ''కమర్షియల్ మైనింగ్ కోసం 42బొగ్గు క్షేత్రాల్ని వేలం వేశాం. గరిష్ట ఉత్పత్తి సామర్థ్యం (పీఆర్సీ) ప్రాతిపదికన ఈ క్షేత్రాల్లో ప్రతిఏటా 8.64కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి కానున్నది. గత వారం 10బొగ్గు బ్లాకుల వేలం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిఏటా రూ.2,858కోట్ల ఆదాయం వస్తుంది'' అని బొగ్గు మంత్రిత్వ శాఖ తెలిపింది. గతవారం జరిగిన 10బొగ్గు బ్లాకుల వేలం పాటలో పలు కంపెనీలు పాల్గొన్నాయి. జార్ఖండ్లో రెండు బొగ్గు బ్లాకుల్ని దాల్మియా సిమెంట్, భారతీ లిమిటెడ్ దక్కించుకున్నాయి. ఒడిషాలో బొగ్గు గనిని మహానంది మైన్స్, మినరల్స్, మరో క్షేత్రాన్ని యాజ్దానీ స్టీల్, పవర్ కైవసం చేసుకున్నాయి. అస్సాం మినరల్ డెవలప్మెంట్, జిందాల్ స్టీల్ , పవర్, హిందాల్కో, బిఎస్ ఇస్పాట్, ప్లాటినం అల్లారు..కంపెనీలు బొగ్గు క్షేత్రాల వేలం పాటలో అధిక ధరకు బిడ్డింగ్ దాఖలుచేశాయి.