Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లెదర్ పరిశ్రమను దారుణంగా దెబ్బకొట్టిన లాక్డౌన్
- సగానికిపైగా యూనిట్లు మూతపడ్డా..పట్టించుకోని యోగి సర్కార్
- అఖిలేశ్ వైపు చూస్తున్న కార్మికులు, యువత
- మాంచెస్టర్ ఆఫ్ ఏసియాగా గుర్తింపు
- బెల్టులు, చెప్పుల తయారీకి ప్రసిద్ధి
న్యూఢిల్లీ : తోళ్ల పరిశ్రమలతో కళకళలాడే కాన్పూర్..ఇప్పుడు కారు చీకట్లో మగ్గిపోయింది. ఎక్కడ చూసినా.. మూతపడ్డ పరిశ్రమలు, ఉపాధి కోసం తిరుగుతున్న కార్మికులు కనిపిస్తున్నారు. కరోనా సంక్షోభం, లాక్డౌన్ సమయంలో పరిశ్రమను ఆదుకునే చర్యలేవీ యోగి సర్కార్ చేపట్టలేదు. దాంతో నగరంలో నిరుద్యోగం తీవ్రరూపం దాల్చింది. మరోవైపు కాలుష్య నియంత్రణ పేరుతో యోగి సర్కార్ చేపట్టిన చర్యలు..ఇక్కడి తోళ్ల వ్యాపారాన్ని దారుణంగా దెబ్బకొట్టింది. అటు లాక్డౌన్..ఇటు ప్రభుత్వ ఆంక్షలు..వెరసి తోళ్ల ఉత్పత్తి సగానికిపైగా తగ్గిపోయిందని అక్కడి వ్యాపారులు వాపోతున్నారు. అంతేకాదు నగరంలో ఎక్కడ చూసినా అభివృద్ధి లేమి అందర్నీ బాధిస్తోంది. కనీసం తాగటానికి మంచినీరు లేక అనేక ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. గుంతలు పడిన రోడ్లు, చెత్తాచెదారం, చిన్నాభిన్నమైన మురుగునీటి వసతి..వెరసి కాన్పూర్ అంటేనే ఒక భయానక వాతావరణం కనపడుతోందని పట్టణ పౌరులు ఆవేదన చెందుతున్నారు.అసెంబ్లీ ఎన్నికలవేళ నగరంలో యోగి సర్కార్కు ఎదురుగాలి వీస్తోంది. నిరుద్యోగం కారణంగా యువత, ఉపాధి కోల్పోయిన కార్మికులు యోగి పాలనపై ఆగ్రహంతో ఉన్నారు. కాన్పూర్ పరిధిలో 10 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇక్కడ సమాజ్వాదీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ నెలకొంది. తాగునీరు, మురుగు కాల్వల పరిస్థితి, నిరుద్యోగం, తోళ్ల పరిశ్రమ..తదితర అంశాలపై నాయకులు మళ్లీ పెద్ద పెద్ద వాగ్దానాలు చేస్తున్నారు. లాక్డౌన్ ఎత్తేసినా..ఇప్పటికీ అనేక పరిశ్రమల్లో కార్మికులకు సగం వేతనమే అందుతోంది. ఉపాధి కోల్పోయిన అనేకమంది కార్మికులు బ్యాటరీతో నడిచే రిక్షాల్ని కొనుగోలు చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ వారికి సరైన ఆదాయం లభించటం లేదు. స్థానికంగా పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం, దారుణమైన రోడ్లు..రిక్షా కార్మికుల బతుకుతెరువును దెబ్బతీస్తున్నాయి.
ప్రజలు విసిగిపోయారు!
జనాభారీత్యా ఉత్తరప్రదేశ్లో అతిపెద్ద జిల్లా కాన్పూర్. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 45లక్షల పైన్నే ఉంది. ఇందులో ముస్లిం జనాభా 15.73శాతం, దళితులు 15శాతం ఉన్నారు. జిల్లాలో ఒక మున్సిపల్ కార్పొరేషన్, రెండు మున్సిపాల్టీలు, 557 గ్రామపంచాయితీలు, 909 రెవెన్యూ విలేజీలున్నాయి. 10 అసెంబ్లీ స్థానాల్లో ఓటర్ల నిర్ణయం..రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో సమాజ్వాదీ, కాంగ్రెస్ ఒక్కో స్థానం గెలిచాయి. అయితే ఈసారి ఆ పరిస్థితి ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు. మెజార్టీ ఓటర్లు మార్పును కోరుతున్నారని తెలిపారు. అఖిలేశ్ యాదవ్ వైపు ఓటర్లు మొగ్గు చూపుతున్నారని, నిరుద్యోగం, విద్వేష రాజకీయాలతో ప్రజలు విసిగిపోయారని స్థానికులు చెబుతున్నారు.
ఆర్థికంగా ప్రాముఖ్యత
తోళ్ల పరిశ్రమతోపాటు, దాని అనుబంధ తయారీ పరిశ్రమ యూనిట్లు కాన్పూర్ చుట్టు పక్కల పెద్ద సంఖ్యలో ఉన్నాయి. రాష్ట్ర జీఎస్డీపీలో గణనీయమైన వాటా ఈ నగరం నుంచి వస్తుందని సమాచారం. లాక్డౌన్, కరోనా సంక్షోభం నేపథ్యంలో ఇక్కడి పరిశ్రమలు, వ్యాపార సముదాయాలు పెద్ద సంఖ్యలో మూతపడ్డాయి. ఇందులో పనిచేసే కార్మికులు అత్యధికంగా ముస్లిం, దళిత సామాజికవర్గానికి చెందినవారు. వీరి జీవితాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇక్కడి పరిశ్రమలతో ముడిపడ్డాయి.
అయితే ఈ పరిశ్రమలకు మేలు చేసే విధంగా యోగి సర్కార్ ఎటువంటి కీలక నిర్ణయం తీసుకోకపోవటం ఇక్కడి ప్రజల్లో తీవ్ర ఆగ్రహం నింపింది. పరిశ్రమలు, కార్మికుల సమస్యల్ని పరిష్కరిస్తానని అఖిలేశ్ యాదవ్ చెబుతున్నాడు. వ్యాపార వర్గాలకు ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు, కొత్త హాస్పిటల్స్ నిర్మాణం, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు రూ.1800 పెన్షన్, ప్రభుత్వ నియామకాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ను పక్కాగా అమలుజేస్తామని వాగ్దానం చేస్తున్నాడు.