Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హర్యానా ప్రభుత్వ నియంతృత్వ చర్యలు
- సీఐటీయూ, ఐద్వా నేతల అరెస్టు
- వాహనాలు ఆపి, వేధించి, అమానుషంగా వ్యవహరించిన పోలీసులు
న్యూఢిల్లీ : వేతనాల పెంపుతో సహా తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లపై హర్యానా ప్రభుత్వం ఎస్మాను ప్రయోగించింది. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి అహర్నిశలు సేవలం దించిన తమకు వేతనాలపరంగా న్యాయం జరగాలని వారు కోరుతున్నారు. డిమాండ్లను పరిష్కరించాలని, గత నెల్లో కుదిరిన వేతన ఒప్పందాలను అమలు చేయాలని కోరుతూ గురువారం ఒక రోజు సమ్మెకు సీఐటీయూ అనుబంధ ఆశా వర్కర్స్ యూనియన్ పిలుపిచ్చింది. రాష్ట్ర ఆరోగ్య మంత్రి అనీల్ విజ్ నియోజకవర్గమైన అంబాలాలో ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సమ్మెను నిషేధిస్తూ హర్యానా ప్రభుత్వం వారిపై ఎస్మాను ప్రయోగించింది. మూకుమ్మడిగా అరెస్టులు చేసింది. పలువురు నేతలను గృహ నిర్బంధాలకు గురి చేసింది.
సీఐటీయూ ఖండన
చట్టబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్న అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లపై హర్యానా ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడడాన్ని సీఐటీయూ ఖండించింది. అరెస్టు చేసిన సిఐటియు హర్యానా రాష్ట్ర అధ్యక్షురాలు సురేఖతో పాటు నేతలందరినీ విడుదల చేయాలని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ ఒక ప్రకటనలో కోరారు. న్యాయబద్ధమైన వేతనాల కోసం గతేడాది డిసెంబరు 8 నుంచి కొనసాగుతున్న అంగన్వాడీ కార్యకర్తల సమ్మెపై ప్రభుత్వ నిరంకుశ వైఖరిని, అణచివేత చర్యలను ఆయన ఖండించారు.
రెండు రోజుల ముందునుండే వేధింపులు
ఇచ్చిన హామీలను అమలు చేయడానికి బదులుగా, హర్యానా ప్రభుత్వం 15వ తేదీ సాయంత్రం నుంచి ఎస్మాను ప్రయోగించింది. కర్షకులు, కార్మికులపై ప్రజాస్వామ్యవ్యతిరేక చర్యలకు పాల్పడే బీజేపీ ప్రభుత్వం పలు జిల్లాల్లో 16వ తేదీ సాయంత్రం నుంచి సీఐటీయూ, ఆశా వర్కర్లను, యూనియన్ నేతలను గృహ నిర్బంధం చేసింది. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షురాలు, ఆశా వర్కర్స్ యూనియన్ హర్యానా శాఖ అధ్యక్షురాలు సురేఖ, ప్రధాన కార్యదర్శి సునీత, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సవిత, ఇతర నేతలను కురుక్షేత్రలో గురువారం ఉదయం అరెస్టు చేశారు. వీరందరూ ర్యాలీ జరిగే అంబాలాకు వెళుతుండగా అరెస్టుకు పాల్పడ్డారు. వారి వాహనాలను అపేసిన పోలీసులు వారి పట్ల అమానుషంగా ప్రవర్తించారని తపన్‌సేన్ పేర్కొన్నారు. భివానీతో సహా పలు జిల్లాల్లో పలువురు సిఐటియు, ఎస్కెఎస్, ఆశా యూనియన్ నేతలను అరెస్టు చేశారు.
వాహనాలు నిలిపేసి, కొట్టి....
వాహనాలు నిలిపేశారు, వాహనాల డ్రైవర్లను కూడా వదిలిపెట్టలేదు. దారుణంగా కొట్టారు. ఆశా వర్కర్లను వేధింపులకు గురి చేశారు. తాము ప్రయాణిస్తున్న వాహనాలను ఎక్కడ ఆపితే అక్కడే వర్కర్లు రోడ్లపై బైఠాయించి, నిరసనలు తెలిపారు. అన్ని దాడులను, అరెస్టులను, నిర్బంధాలను, బెదిరింపులను ఎదుర్కొని, తట్టుకుని ఆశా వర్కర్లు ప్రతీ జిల్లాలో పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చారు. బిజెపి రాష్ట్ర ప్రభుత్వ నియంతృత్వం ధోరణిని తీవ్రంగా ఖండించారు. వర్కర్లను పెద్ద సంఖ్యలో తొలగించడం, తప్పుడు కేసులు బనాయించడం వంటి చర్యలకు పాల్పడుతున్నా తలొగ్గక అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె కొనసాగిస్తున్నారు.
ఎస్మాను ఉపసంహరించాలి
ఇటువంటి అప్రజాస్వామిక చర్యలను, ఎత్తుగడలను సిఐటియు తీవ్రంగా ఖండిస్తోందని తపన్‌సేన్ పేర్కొన్నారు. తక్షణమే బేషరతుగా నిరంకుశ ఎస్మాను ఉపసంహరించాలని హర్యానా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆశా, అంగన్వాడీ యూనియన్లతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ప్రభుత్వం అమలు చేయాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. ఈ అణచివేత చర్యలను ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాల్సిందిగా సిఐటియు హర్యానా రాష్ట్ర కమిటీ పిలుపిచ్చింది. పోరాడుతున్న వర్కర్లకు సంఘీభావం తెలుపుతూ బీజేపీ ప్రభుత్వ దాష్టికాన్ని నిరసించాల్సిందిగా యావత్ కార్మిక లోకాన్ని సీఐటీయూ కోరింది.