Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యోగి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం
- సీఏఏ నిరసనకారుల నుంచి నష్టపరిహారం వసూలును తప్పుపట్టిన కోర్టు
న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) నిరసనకారుల నుంచి నష్టపరిహారం పేరుతో నగదు వసూలు చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. వారి నుంచి వసూలు చేసిన నగదును తిరిగి ఇచ్చేయాలని జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం ఆదేశించింది. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ని వ్యతిరేకిస్తూ 2019లో యూపీలో పెద్దఎత్తున ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. ఈ నిరసన కార్యక్రమాల కారణంగా ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తులకు నష్టం జరిగిందనీ, ఆ నష్టాన్ని నిరసనకారులే భర్తీచేయాలని యోగి ప్రభుత్వం నోటీసులిచ్చింది. ఈ రికవరీ నోటీసులను రద్దు చేయాలంటూ పర్వేజ్ అరిఫ్ టిటు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చట్టవిరుద్ధంగా జారీ చేసిన ఆ నోటీసులను ఉపసంహరించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో 274 రికవరీ నోటీసులను ఉపసంహరించినట్టు రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. కాగా, తాజాగా నిరసనకారుల నుంచి వసూలు చేసిన మొత్తాన్నీ.. తిరిగి వారికి ఇచ్చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నష్టపరిహారాన్ని రాబట్టేందుకు 2019 డిసెంబరులో చేపట్టిన చర్యలు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని తెలిపింది. అయితే ఉత్తర ప్రదేశ్ రికవరీ ఆఫ్ డ్యామేజెస్ టు పబ్లిక్ అండ్ ప్రయివేట్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవచ్చునని తెలిపింది. ఈ చట్టాన్ని 2020 ఆగస్టు 31న నోటిఫై చేశారు. అయితే ట్రిబ్యునల్లు ఈ విషయాన్ని నిర్ణయించే వరకూ చేపట్టిన రికవరీలపై యథాతథ స్థితిని నిర్దేశించాలని రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనాన్ని కోరింది. అయితే ఒక ప్రొసీడింగ్‌ను ఉపసంహరించుకున్నప్పుడు అన్ని పర్యవసాన చర్యలనూ ఎదుర్కోవలసి ఉంటుందని ధర్మాసనం స్పష్టంచేసింది.