Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్తగా 2లక్షల ఉద్యోగాలు ఏర్పడతాయి : కేరళ సీఎం పినరరు విజయన్
న్యూఢిల్లీ : భారతదేశం సాంకేతికంగా మరింత ముందడుగు వేయటం కోసం కేరళ ప్రభుత్వం భారీ ప్రణాళికను ప్రకటించింది. రాబోయే ఐదేండ్లలో రాష్ట్రంలో స్టార్టప్స్ సంఖ్య 15వేలు దాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని కేరళ సీఎం పినరరు విజయన్ ప్రకటించారు. తద్వారా సాంకేతిక పరిజ్ఞానరంగంలో 2లక్షలకుపైగా కొత్త ఉద్యోగాలు ఏర్పడతాయని చెప్పారు. కేరళ స్టార్టప్ మిషన్ (కేఎస్‌యూఎం) ఆధ్వర్యంలో 'హడల్ గ్లోబల్ 2022' సదస్సులో ఆయన ప్రసంగిస్తూ..''వర్దమాన సాంకేతిక యుగంలో రాష్ట్రాన్ని ఒక స్టార్టప్ హబ్‌గా మార్చాలన్నది మా ఉద్దేశం. ఈదేశ భవిష్యత్ అంతా స్టార్టప్స్‌తో ముడిపడి ఉంది. 2015 తర్వాత కేరళలోని స్టార్టప్స్ రూ.3200కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించాయి'' అని చెప్పారు. కొచ్చిలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన 'టెక్నాలజీ ఇన్నోవేషన్ జోన్'ను మరింత విస్తరిస్తామని చెప్పారు. ఇలాంటిదే తిరువనంతపురంలోనూ క్యాంపస్ తీసుకొస్తామన్నారు. ''పెద్ద సంఖ్యలో స్టార్టప్స్ ఏర్పడటానికి మనదేశంలో చాలా అవకాశాలున్నాయి. భారత్‌లో నేడు స్టార్టప్స్ సంఖ్య 55వేలు దాటిందంటే..దానికి కారణం ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిందే. స్టార్టప్స్‌లో భారత్ ర్యాంకింగ్ మెరుగుపడటంలో కేరళ ముఖ్యపాత్ర పోషిస్తోంది'' అని అన్నారు. స్టార్టప్స్‌ను తీసుకురావటంలో కేరళ దేశానికి ఆదర్శవంతంగా నిలుస్తోందని కేరళ మంత్రి పి.రాజీవ్ అన్నారు.