Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్క్సిజానికి పెరుగుతున్న ప్రాధాన్యత
- రెడ్బుక్స్ డే సభలో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఏచూరి
అమరావతి. ప్రపంచవ్యాప్తంగా మార్క్సిజానికి ప్రాధాన్యత పెరిగిందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 2008లో మొదలైన ఆర్థిక సంక్షోభానికి పెట్టుబడి దారీ వ్యవస్థే కారణమని, దీనికి ప్రత్యామ్నాయంగా సోషలిజం తీసుకురావాలనే ధోరణి పెరిగిందన్నారు. ఇందులో భాగంగానే మార్క్సిజం అధ్యయనం ప్రపంచవ్యాప్తంగా పెరిగిందని చెప్పారు. సీపీఐ(ఎం) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో 'రెడ్బుక్స్ డే సభ' ఆదివారం ఆన్లైన్ వేదికగా ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు పి మధు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొన్న ఏచూరి మాట్లాడుతూ ఆర్ధిక సంక్షోభం నుంచి బయట పడాలంటే పెట్టుబడిదారుడు తన లాభాలను తగ్గించుకొని ప్రజానీకానికి కొనుగోలు శక్తి ఇవ్వాలని చెప్పారు. ఇందుకు పెట్టుబడిదారులు ఒప్పుకోరని,అందువల్లే సంక్షోభం ఇంకా పెరుగుతుందని తెలిపారు. లాభాలను పెంచుకునే క్రమంలో నయా ఉదారవాద విధానాలు తీసుకొస్తున్నారని చెప్పారు. ఇందులో భాగంగానే అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, వనరుల ప్రయివేటీకరణ జరుగుతోందన్నారు. దీని వల్ల కొత్త రకం సంక్షోభం పుట్టుకొచ్చిందన్నారు. లాభాలు పెరిగినంతా కాలం ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుందన్నారు. ప్రజలపై దోపిడీని ఇంకా తీవ్రం చేసేందుకు లాభాల స్థాయిని పెంచేందుకు కార్మిక వర్గంపై తీవ్రమైన దోపిడీ జరుగుతుందన్నారు. పోరాడి సాధించుకున్న 8 పనిగంటల పనిదినాన్ని భారతదేశంతో పాటు ఇతర దేశాల్లోనూ హరిస్తున్నారని తెలిపారు. ప్రపంచాన్ని మార్చాలన్నా, దోపిడీని అంతం చేయాలన్నా, రాజకీయ ప్రత్యామ్నాయ సోషలిస్టు వ్యవస్థను నిర్మించడమే మార్గమని మార్క్స్, ఎంగెల్స్ కమ్యూనిస్టు ప్రణాళికలో పొందుపరిచారని తెలిపారు. ప్రజాఉద్యమాల ద్వారా పెరూ, లాటిన్ అమెరికా వంటి దేశాల్లో వామపక్ష ప్రభుత్వాలు ఏర్పడ్డాయని చెప్పారు. ప్రజల్లో వస్తున్న అసంతృప్తిని దారిమళ్లించేందుకు దేశంలో మత గొడవలు సృష్టిస్తున్నారని తెలిపారు. ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని ఏకం చేసే శక్తి కమ్యూనిస్టులకే ఉందన్నారు. అందుకే కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని బలహీన పర్చాలని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అంటున్నారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో మార్క్సిజం అధ్యయాన్ని నిరంతరంగా కొనసాగించాలని పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కమ్యూనిస్టు మూలసూత్రాలు ఆడియోను ఆవిష్కరించారు.అనంతరం మాట్లాడుతూ ప్రత్యామ్నాయ భావజాలాన్ని సుసంపన్నం చేయడానికి సాహిత్య అధ్యయనం అవసరమన్నారు. కమ్యూనిస్టులు అధికారంలో రాకుండా బూర్జువా శక్తులు కమ్యూనిస్టులపై తీవ్ర ఆరోపణలు చేశాయని చెప్పారు. కమ్యూనిస్టు మ్యానిఫెస్టో ప్రపంచ కార్మిక వర్గ కారక్రమం అని వివరించారు. మానవ జాతి ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపగల సిద్ధాంతం మార్క్సిజమని చెప్పారు. అధ్యక్షత వహించిన మధు మాట్లాడుతూ .బూర్జువా వర్గం ప్రయత్నాల్లో వృత్తిదారులు, చిన్న చిన్న పారిశ్రామిక వేత్తలు నలిగిపోతున్నారని చెప్పారు. సకల సంపదను కొల్లగొట్టేందుకు ద్రవ్యపెట్టుబడి పూనుకుందన్నారు. ద్రవ్యపెట్టుబడికి వ్యతిరేకంగా నాలుగేండ్లుగా పోరాటం సాగుతోందని, ప్రపంచంలో గుత్త సంస్థగా ఉన్న అమెజాన్ కంపెనీలో కార్మికులు ఆందోళన చేశారని తెలిపారు. సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో అభివృద్ధి చెందిన ప్రపంచాన్ని మార్పు చేయగల సిద్ధంతం, మార్క్సిజం, లెనినిజం అని అన్నారు. మార్క్సిజం లెనినిజం పుస్తకాలను ప్రజల్లో తీసుకెళ్లాలని కోరారు. సీపీఐ(ఎం)ఏపీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి రమాదేవి, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు బాలమల్లేష్ పాల్గొని ప్రసంగించగా ప్రజాశక్తి బుక్ హౌస్ జనరల్ మేనేజర్ కె లక్ష్మయ్య వందన సమర్పణ చేశారు. సీపీఐ(ఎం)ఏపీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం, విశాలాంధ్ర పబ్లిషింగ్హౌస్ మేనేజర్ అప్పలనాయుడు పాల్గొన్నారు.